న్యూఢిల్లీ: హింసాకాండకు గురైన ఈశాన్య ఢిల్లీలో శాంతి పునరుద్ధరించాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాలని కోరుతూ పలు కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు రాశాయి. దేశ రాజధాని పరిస్థితిపై చర్చించడానికి సమయం ఇవాలని ఎన్‌సిపి, సిపిఐ, సిపిఐ(ఎం), ఆర్‌జెడి, ఎల్‌జెడి, డిఎంకె, ఆప్ వంటి పార్టీ నేతలు రాష్ట్రపతిని కోరారు. ‘శాంతి స్థాపనకు ఆయనకు నేరుగా జవాబుదారి అయ్యే లెఫ్టినెంట్ గవర్నర్ వంటి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, సాధారణ పరిస్థితి త్వరగా నెలకొనేలా చూడాలని, రెచ్చగొట్టే ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారందరిపై ఎఫ్‌ఐఆర్ వెంటనే నమోదుచేయాలని, హింసకు పాల్పడినవారిపై కేసులు తప్పక బుక్ చేయాలి’ అని విపక్ష నాయకులు తమ లేఖలో పేర్కొన్నారు. హింసకు గురైన ప్రాంతాల్లో శాంతి, సాధారణ పరిస్థితిని నెలకొల్పాలని కాంగ్రెస్ గురువారం రాష్ట్రపతిని కలిసి కోరిం ది. అంతేకాక కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేసింది. హింసాకాండ కారణంగా నిరాశ్రయులైన వారి కోసం సహాయక శిబిరాలను ఏర్పాటుచేయాలని, వారికి తగిన భద్రత కల్పించాలని, వారి శ్రేయస్సురీత్యా నిత్యావసర వస్తువులను సరఫరాచేసేలా అధికారులను ఆదేశించాలని రాష్ట్రపతిని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కోరింది.అల్లర్లు ప్రజలకు మానసికవేదనను కలిగించాయని ముఖ్యంగా బాలలు మానసిక వేదనకు గురయ్యారని…వారికి సలహా ఇవ్వడానికి కేంద్రాలను నెలకొల్పాని, అల్లర్లకు ప్రభావితమైన ప్రాంతాల్లో అంతర్గత మత శాంతి కార్యక్రమాలు నిర్వహించడానికి తమకు అనుమతినివ్వాలని విపక్షాలు తమ లేఖలో రాష్ట్రపతిని కోరాయి. ‘దాడులలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు తగిన పరిహారాన్ని కేంద్రం ప్రకటించాలి’ అని లేఖలో వారు కోరారు. ఇళ్ళు, ఆస్తులు, వాణిజ్య సంస్థలు ధ్వంసమైన వారికి తగిన పరిహారం ఇవ్వాలని కూడా కోరారు. విపక్షాల లేఖపై సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, లోక్‌తాంత్రిక్ జనతా దళ్ చీఫ్ శరద్ యాదవ్, డిఎంకె నాయకుడు టిఆర్ బాలు, రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు మనోజ్ ఝా,ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజ య్ సింగ్ తదితరులు సంతకాలు చేశారు.
విద్వేషంతో రెచ్చగొట్టారు!
RELATED ARTICLES