వామపక్ష నేతల పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్ ‘బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమ’ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో మహా ఉద్యమం అవసరమని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. 2000ల సంవత్సరంలో బషీర్‌బాగ్‌లో జరిగిన విద్యుత్ ఉద్యమ ఫలితంగా ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపేందుకే దశాబ్ధాల పాటు పాలకులు భయపడాల్సి వచ్చిందన్నారు. ‘విద్యుత్ ఉద్యమ’ 22వ వార్షికోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద వామపక్ష నాయకులు ఆదివారం నివాళ్లు అర్పించారు. అనంతరం “అమరుల త్యాగాన్ని వృథా కానివ్వబోమని, మీ బాటలోనే నడుస్తామని” ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, ఎన్.బాలమల్లేష్,హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ,సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు డి.జి.నరసింహరావు, హైదరాబాద్ సెంట్రల్ జోన్ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ , సిపిఐ(ఎం.ఎల్.) న్యూడెమోక్రసి కార్యదర్శి వర్గ సభ్యులు జె.వి.చలపతిరావు, సిపిఐ(ఎం.ఎల్-న్యూడెమోక్రసి (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు ఎం.హన్మేష్, సిపిఐ(ఎం.ఎల్.) న్యూడెమోక్రసి నాయకులు సంధ్య,ఎస్‌యుసిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి మురహరి, ఎంసిపిఐ (యు) నాయకులు సుధాకర్ తదితరులు హాజరయ్యారు.2000 సంవత్సరంలో నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యుత్ ధరల పెంపునకు నిరసనగా బషీర్‌బాగ్‌ల జరిగిన ఉద్యమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పగా, చాలా మందికి గాయాలయ్యాయని వారు గుర్తు చేసుకున్నారు. ఆ ఉద్యమ ఫలితంగానే దశాబ్దాల పాటు విద్యుత్ ధరలను పెంచలేదని, తద్వారా ప్రజలపై భారం పడలేదని వామపక్ష నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ప్రజలపై భారం మోపాలని చూస్తే సహించేదే లేదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదన్నారు. బి.వి.రాఘవులు మాట్లాడుతూ నాడు విద్యుత్ ఉద్యమం నిర్వహించకపోయి ఉంటే ప్రజలపై విద్యత్‌భారం పడేదన్నారు. విద్యుత్ ఉద్యమ తరహా దేశ వ్యాపితంగా మహా ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. విద్యుత్ ఉద్యమ ఫలితాలు ప్రజలు అనుభవించారని గుర్తు చేశారు.
పశ్యపద్మ మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించడమే విద్యుత్ అమరులకు నిజమైన నివాళి అని అన్నారు. దేశంలో కార్పొరేట్ దోపిడీ నిరంతరం కొనసాగుతోందని ధ్వజమెత్తారు. చలపతిరావు మాట్లాడుతూ బిజెపి మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతోందని, ఎమ్మెల్యే రాజాసింగ్ మతపరమైన వ్యాఖ్యలు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. సంధ్య మాట్లాడుతూ విద్యుత్ అమరుల స్ఫూర్తితో పోరాటం చేపట్టాలన్నారు.
కాంగ్రెస నివాళి
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆదివారం నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సవరణ బిల్లుపై దేశవ్యాప్త ఆందోళన
RELATED ARTICLES