HomeNewsBreaking Newsవిద్యుత్‌ సౌధ ముట్టడి ఉద్రిక్తం

విద్యుత్‌ సౌధ ముట్టడి ఉద్రిక్తం

రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్‌ నాయకుల నిరసన
ప్రజాపక్షం / హైదరాబాద్‌ విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన హైదరాబాద్‌లోని ‘విద్యుత్‌ సౌధ’ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతతకు దారి తీసింది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపులను నిరసిస్తూ, విద్యుత్‌ చార్జీల పెంపును తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ యాసంగి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అనే ఐదు ప్రధాన డిమాండ్లతో రాష్ర్ట వ్యాప్త ఆందోళనలకు టిపిసిసి పిలుపునిచ్చింది. అందులో హైదరాబాద్‌ కేంద్రంగా విద్యుత్‌ సౌధ, సివిల్‌ సప్లయ్‌ కార్యాలయాలను కాంగ్రెస్‌ నాయకులు ముట్టడించారు. అయితే గురువారం తెల్లవారుజామునుంచే పోలీసులు ముఖ్య నాయకుల ఇళ్లను చుట్టుముట్టి వారిని హౌస్‌ అరెస్టులు చేశారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, పిఎసి కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ, మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు, నాయకులు మల్లు రవి, హర్కర వేణుగోపాల్‌, దాసోజు శ్రవణ్‌, వినోద్‌ రెడ్డి, బక్క జడ్సన్లతోపాటు పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. కొంత సేపటికి కాంగ్రెస్‌ నాయకులను విద్యుత్‌ సౌధవద్దకు వెళ్ళడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంఎల్‌ఎ శ్రీధర్‌ బాబు, ఎంఎల్‌సి జీవన్‌ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాస్కీ గౌడ్‌ తదితరుల నేతృత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం వందలాది కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి విద్యుత్‌ సౌధ వైపు వెళ్ళేందుకు ప్రయత్నించారు. ఖైరతాబాద్‌ ఫ్లుఓవర్‌ వద్ద పోలీసులు బారికేడ్‌లు పెట్టి అడ్డుకున్నారు. కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉందని వారు అడ్డుకోవడంతో పిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి, శ్రీదర్‌ బాబు, మధు యాష్కి, యూత్‌ నాయకులు అనిల్‌ యాదవ్‌, శివసేనరెడ్డి తదితరులు బారికేడ్‌ల పైకి ఎక్కి అవతలవైపు దూకి విద్యుత్‌ సౌధ వైపు పరుగుపరుగున దూసుకెళ్ళారు. దాంతో వారికి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఫిరోజ్‌ ఖాన్‌, ఓబిసి సెల్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ మైనారిటీ సెల్‌ చైర్మన్‌ సోహల్‌, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు వెంకట్‌, దళిత కాంగ్రెస్‌ చైర్మన్‌ ప్రీతమ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొద్ది మందికి అనుమతి ఇవ్వగా అక్కడ నుంచి పాదయాత్రగా విద్యత్‌ సౌధకు వెళ్ళి ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావుతో సమావేశమై విద్యుత్‌ చార్జీల పెంపుదల ప్రజా వ్యతిరేకమని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, టి.జీవన్‌రెడ్డి, మధుయాస్కీ గౌడ్‌, మల్లు రవి, అనిల్‌ యాదవ్‌, వినోద్‌రెడ్డి తదతరులు ఉన్నారు.
మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు విద్యారెడ్డికి అస్వస్థత
కాగా, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో పలువురు విద్యుత్‌ సౌధ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళా నాయకురాలు విద్యారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధ సమస్యలు రావడంతో ఆమెను హుటాహుటిన నిమ్స్‌ ఆసుప్రతికి తరలించారు. నిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లి విద్యారెడ్డిని రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పరామర్శించారు. ఫిషర్మెన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మెట్టు సాయి ఆధ్వర్యంలో ముట్టడికి ప్రయత్నించగా వారిని అరెస్టు చేసి ఎస్‌.ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments