కరెంట్ పరిస్థితిపై జెన్ కో, ట్రాన్స్ కో సిఎండిని అడిగి తెలుసుకున్న సిఎం కెసిఆర్
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాటి వల్ల పోటెత్తుతున్న వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు జెన్ కో ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం సిఎండి ప్రభాకర్ రావుతో మాట్లాడారు. రాష్ట్రం లో విద్యుత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను కూడా విద్యుత్ విషయం లో అప్రమత్తం చేయాలని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని, విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారని, వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్పూర్తి కొనసాగించాలని ముఖ్యమంత్రి సిఎండిని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, వరదల్లో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయని, విద్యుత్ పోళ్ళు వరిగిపోయి వైర్లు తెగిపోయాయని సిఎండి ప్రభాకర్‌రావు సిఎంకు వివరించారు. ఇంకా వానలు, వరదల ఉధృతి తగ్గలేదని, జలమయమైన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదన్నారు. హైదరాబాద్‌తో పాటు చాలా పట్టణాల్లో అపార్టుమెంట్లు నీటితో నిండి ఉండడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేసినట్లు సిఎండి తెలిపారు. పరిస్థితిని బట్టి మళ్లీ సరఫరా చేస్తున్నామని, ఎక్కడి వరకు సిబ్బంది చేరుకోగలుగుతున్నారో అక్కడి వరకు వెళ్లి 24 గంటల పాటు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు సిఎండి ముఖ్యమంత్రికి వివరించారు.
విద్యుత్‌శాఖ అప్రమత్తం
RELATED ARTICLES