HomeNewsBreaking Newsవిద్యావ్యవస్థపైవాడీ.. వేడి

విద్యావ్యవస్థపైవాడీ.. వేడి

చూచిరాతలు, కుంభకోణాలు
తెలంగాణ విద్యావ్యవస్థపై ఎపి మంత్రి బొత్స వ్యాఖ్యలు

తెలంగాణ విద్యావ్యవస్థపై ఆంధ్రపదేశ్‌ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడంతా చూచిరాతలు, కుంభకోణాలేనని, ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపణలు చేశారు. ఎపి మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కించపరిచేవిధంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఎపిలో విద్యా వ్యవస్థ బాగుంటే లక్షలాదిమంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు. రాష్ట్రంపై ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారని మండిపడ్డారు.
విజయవాడ : తెలంగాణ విద్యా వ్యవస్థపై ఎపి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ట్రిపుల్‌ ఐటి ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడారు.‘ఎపి విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్‌ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి” అని బొత్స వ్యాఖ్యానించారు.
కించపరిచేలా మాట్లాడొద్దు
బొత్స వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి : మంత్రులు డిమాండ్‌
హైదరాబాద్‌ : తెలంగాణ విద్యావ్యవస్థ గురించి ఆంధ్రప్రదేశ్‌ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. బొత్స చేసిన వ్యాఖ్యలను
ఉప సంహరించుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఎపిలో విద్యా వ్యవస్థ బాగుంటే లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ఆమె ప్రశ్నించారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎపి మాత్రం విరుద్ధంగా మాట్లాడడం శోచనీయమని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగు పరుస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పడిన తరువాత 1050 గురుకులాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణలో ఒక్కో విద్యార్ధి పైన రూ.లక్ష 50వేలను ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఒఆర్‌సిసి కింద ప్రతి విద్యార్థికి రూ. 2 .50 లక్షలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో రెండు సార్లు ఉపాధ్యాయులను బదిలీలు చేశామని గుర్తు చేశారు. కొంత మంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లడం వల్ల బదిలీలు ఆగాయని తెలిపారు.
చూసి పరీక్షలు రాసినందువల్లే
ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ చూసి రాసి పరీక్షలు పాస్‌ అయ్యారు కాబట్టే .. అలా అంటున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో, అక్కసుతో బొత్స మాట్లాడతున్నారని ఆక్షేపించారు. తాము తెలంగాణలోనే చదువుకుంటామని ఎపి విద్యార్థి కోర్టుకు కూడా వెళ్లారని మంత్రి గుర్తు చేశారు. ఎపి రాజధాని ఏది అని పరీక్షల్లో అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. ఎందుకు అలా విషం కక్కుతున్నారని ప్రశ్నించారు. వారి హయాంలో ఎపిపిఎస్‌సిలో స్కాములు జరిగేవని, ఇప్పుడు కూడా అలానే అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. బదిలీల కోసం వారి హయాంలో సూట్‌ కేసులు పట్టుకొని లాడ్జిల్లో ఉండేవారని గుర్తు చేశారు. వారి హయాంలో కోళ్ల ఫారాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉంటే నాణ్యత లేదని తీసివేసినట్టు మంత్రి చెప్పారు. మా దగ్గర వోక్స్‌ వ్యాగన్‌ స్కాములు ఉన్నాయా? అని ప్రశ్నించిన శ్రీనివాస్‌గౌడ్‌.. ఎపిలో ఆలయాల వద్ద కూడా వివక్ష ఉందన్నారు. ఎపిలో అంతా కులపిచ్చి.. అభివృద్ధి లేదన్నారు. అన్ని విషయాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని బొత్సకు సవాల్‌ విసిరారు. బొత్స పిల్లలు కూడా ఇక్కడే చదివి ఉంటారని వ్యాఖ్యానించారు. బాధ, ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడారా? లేక రాజకీయంగా ఉపయోగపడుతుందని మాట్లాడారా? అని ప్రశ్నించారు. టిఎస్‌పిఎస్‌సి లీకేజీ కేసులో వెంటాడి దోషులను అరెస్టు చేస్తున్నామని, పారదర్శకంగా ఉండాలన్న ప్రభుత్వ చర్యలు హర్షించాలన్నారు. తెలంగాణను కించపర్చేలా మాట్లాడితే సహించబోమన్నారు. ఎపి అభివృధ్ధిపై దృష్టి సారించాలని, మనుషులు కలిసి మెలిసి ఉండేలా చూడాలని బొత్సకు సూచించారు. ఏపీలోనూ భారాసను విస్తరిస్తామని, అధికారం ఇస్తే తెలంగాణ తరహాలో ఎపిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారు : గంగుల

బొత్స సత్యనారాయణపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యావ్యవస్థపై బొత్స చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కరీంనగర్‌లో మీడియాతో గంగుల కమలాకర్‌ మాట్లాడారు. దేశంలో అత్యున్నత విద్యను అందిస్తోంది కెసిఆర్‌ ప్రభుత్వమని గంగుల కమలాకర్‌ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారంటూ ఆయన మండిపడ్డారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్‌ లీకేజ్‌ కేసులో నిందితులను పట్టుకుని జైలుకు పంపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. ఎపిలో టీచర్ల బదిలీలకు రూ.లక్షకు పైగా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందని ఆరోపించారు. తెలంగాణలో ఆ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని చెప్పారు. ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, ఏపీపీఎస్సీ సభ్యులే వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారని గంగుల ఆరోపించారు. సాయంత్రంలోపు దీనిపై బొత్స స్పందించాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన తర్వాత ఆయన హైదరాబాద్‌లో అడుగులుపెట్టాలన్నారు. బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments