కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలో విద్యావిధానాన్ని సమూలం గా క్రమబద్ధీకరించాలని, వివిధ కోర్సులో చేరేప్పు డు విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. మహారాష్ట్రలో 2019- విద్యా సంవత్సరానికి పిజి మెడికల్, డెం టల్ అడ్మిషన్‌లో చోటుచేసుకున్న అనిశ్చితి, విద్యార్థుల వెతలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఈ ఆదేశానిచ్చింది. ప్రతిభగత విద్యార్థులకు పరిస్థితి దుర్భరంగా మారుతోందని కూడా అభిప్రాయపడింది. ‘మా ఆందోళన అంతా విద్యార్థుల గురించే. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతోంది. మెడికల్ లేక ఇతర కోర్సులో అడ్మిషన్‌ల విషయంలో విద్యార్థుల్లో ఓ అనిశ్చితి ఏర్పడుతోంది’ అని న్యాయమూర్తులు ఇందు మాల్హో త్రా, ఎంఆర్ షాతో కూడిన సెలవుకాల ధర్మాసనం తెలిపింది. ‘మీరెందుకు మొత్తం విద్యావిధానాన్ని సరిదిద్ధరు? విద్యార్థులకు ఎందుకింత ఆందోళన, ఒత్తిడి? ఎందుకిన్ని వ్యాజ్యాలు’ అని ధర్మాసనం అడిగింది. ‘విద్యార్థుల వెతలను పరిశీలించాలని మేము రాష్ట్రాలకు, కేంద్రానికి చెబుతున్నాము’ అని చెప్పింది. విద్యార్థులకు అనిశ్చితి ఏర్పడితే అది వారి మొత్తం కెరీర్‌పై ప్రభావం చూపగలదు అని కూడా తెలిపింది. పిజి మెడికల్ కోర్సు అడ్మిషన్లలో ఏర్పడిన అనిశ్చితికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. దీనికంతటికీ మహారాష్ట్ర ప్రభుత్వమే కారణమంది. కాలేజీలు, కోర్సుల ఎంపిక విషయం లో విద్యార్థులు చాలా టెన్షన్‌కు గురవుతున్నారని పేర్కొంది. ‘మేము ఇంకా ఆలస్యం చేసి సమస్య ను మరింత ముందుకు తీసుకెళ్ల దలచుకోలేదు’ అని కూడా అభిప్రాయపడింది. ‘జూన్ 14కల్లా 2019 విద్యా సంవత్సరానికి పిజి మెడికల్, డెంటల్ కోర్సులకు కౌన్సెలింగ్ ఫైనల్ రౌండ్ నిర్వహించాలి’ అని కూడా ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.