ప్రజాపక్షం / హైదరాబాద్ : సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మంచి సమాజం నిర్మించే క్రమంలో జీయర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డిజిపిల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని సిఎం ప్రకటించారు. మాజీ డిజిపి హెచ్.జె.దొర తన ఆటోబయోగ్రఫీగా రాసిన ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్‌లో గురువారం ఆవిష్కరించారు. తమిళనాడు మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, విజిలెన్స్ కమిషనర్ కె.ఆర్.నందన్, రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, పలువురు మాజీ డిజిపిలు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దొర గురువు ఆచార్య ఆర్‌విఆర్ చంద్రశేఖర్‌రావు, మాజీ డిజిపి రొడ్డం ప్రభాకర్‌రావు, సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు, ప్రముఖ పాత్రికేయులు ఐ.వెంకట్రావు, పలువురు ఐపిఎస్, ఐఎఎస్ అధికారులు, దొర స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాజీ డిజిపి దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ, ఇతర పోలీసు అధికారులకు స్పూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. పుస్తక రచయితను, ప్రచురణ కర్తలను ముఖ్యమంత్రి సన్మానించారు. హెచ్.జె.దొరను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ దురదృష్ట వశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతున్నదని, కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించవచ్చని, ఇందు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, మాజీ డిజిపిలతో కమిటీ వేస్తామని, జీయర్ స్వామి లాంటి ఆధ్మాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటామని సిఎం వెల్లడించారు. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలని సిఎం కెసిఆర్ కోరారు. డిజిపి మహేందర్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణకే పరిమతం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. గుడుంబా నిర్మూలనలో, పేకాట క్లబ్బుల మూసివేతలో, బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో, హరితహారం ద్వారా చెట్లు పెంచడంలో ఎంతో కృషి చేశారన్నారు. ఈ సంవత్సరమే సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతుందని, అందులో పోలీసులు భాగస్వాములై విజయవంతం చేయాలని, చదువుకుని వారందరినీ అక్షరాస్యులగా మార్చే ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. హెచ్.జె. దొర తన అనుభవంతో రాసిన విషయాలన్నింటినీ స్పూర్తిగా తీసుకుని పోలీసు అధికారులు ముందుకుపోవాలని, ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి నిష్ణాతులను చేయాలని, వారిలో వృత్తి నైపుణ్యం పెరగాలని, ఇందుకు అవసరమైన చర్యలు డిజిపి తీసుకోవాలన్నారు.
విద్యావిధానం మారాలె
RELATED ARTICLES