బస్సుల్లో బెల్గ్రేడ్‌కి.. అక్కడినుండి భారత్‌కు..
భారతీయుల్ని వెళ్ళకుండా బలవంతంగా అడ్డుకున్నారని
భద్రతా మండలికి రష్యా ఫిర్యాదు!
ఐక్యరాజ్యసమితి : భారతీయ, ఇతర విదేశీ విద్యార్థులు ఉక్రేన్ నుండి సురక్షితంగా తరలించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేసింది. రష్యా బస్సుల్లో భారతీయ విద్యార్థులను తొలుత బెల్గ్రేడ్‌కు తరలించి అక్కడ వారికి వసతి సదుపాలిచ్చి అక్కడి నుండి విమానాల్లో భారత్‌కు తరలిస్తామని తెలియజేసింది. ఉక్రేన్‌లో ఉన్న విదేశీయులందరినీ ఇదేవిధంగా తరలిస్తామని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో రష్యా తెలియజేసింది. ఖార్కివ్, సుమీ నగరాలలో ఉన్న 3,700 మంది భారతీయ విద్యార్థులు దేశం వదిలివెళ్ళకుండా ఉక్రేన్ జాతీయులు బలవంతంగా అడ్డుకున్నారని భద్రతామండలి సమావేశంలో రష్యా విమర్శించింది. శుక్రవారంనాడు (మార్చి 4వ తేదీన) భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించిం ది. తూర్పు ఉక్రేన్ ప్రాంతాల్లోని ఖార్కివ్, సుమీ నగరాలలో ఉన్న భారతీయ విద్యార్థులను, ఇతర విదేశీ జాతీయులను సురక్షితంగా తరలించేందు కు వీలుగా రష్యా బస్సులు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని ఈ సమావేశంలో రష్యా రాయబారి వాస్సిలీ నెబెంజియా తెలియజేశారు. ఖార్కివ్, సుమీ నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, ఇతర విదేశీ జాతీయులను తరలించేందుకు ఆ రెండు నగరాలకు రష్యా బస్సులు పంపిస్తామని తెలిపింది. రష్యా పాలనావిభాగ నగరం బెల్గ్రేడ్‌లో సౌకర్యవంతమైన 131 రష్యా బస్సులు ఉక్రేన్ వెళ్ళేందుకు శనివారం ఉదయం 6 గంటల నుండే సిద్ధంగా ఉన్నాయన్నారు. చెక్ పాయింట్ల వద్ద విశ్రాంతి కోసం తాత్కాలిక సదుపాయాలు కల్పించామని, వారికి వేడి వేడి ఆహారం,నీరు ఇస్తామని, సంచార ఔషధాలయం కూడా అక్కడ సిద్ధంగా ఉందన్నారు.
ఉక్రేన్‌లో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో,ఆల్బేనియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, బ్రిటన్,అమెరికా దేశాలు ఈ అత్యవసరంగా భద్రాతామండలి సమావేశం ఏర్పాటు చేయాలని కోరాయి. ఈ అణు విద్యుత్ కేంద్రం యూరప్ మొత్తంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం. ఈ సమావేశంలో శాశ్వతసభ్యత్వంగల రష్యా తరపున నెబెంజియా మాట్లాడుతూ, ఉక్రేన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులుసహా, ఇతర విదేశీ జాతీయులను కూడా అక్కడి నుండి సురక్షితంగా, శాంతియుత పద్ధతులలో దేశం వెలుపలకు తరలించేందుకు రష్యా సుముఖంగా ఉందని చెప్పారు. 3,700 మంది భారతీయ విద్యార్థులను దేశం వదిలి వెళ్ళకుండా ఉక్రేన్ జాతీయులు బలవంతంగా అడ్డుకున్నారని విమర్శించారు. పౌరులు నగరాలనుండి బయటకు రాకుండా ఉగ్రవాదులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రభావం కేవలం ఉక్రేనియన్ జాతీయులమీదనే కాదని, ఇతర విదేశీయులమీద కూడా పడిందని అన్నారు. వేలాదిమంది విదేశీయులను వెళ్ళనీయకుండా ఉక్రేనియన్లు బలవంతంగా అడ్డుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఒక్క ఖార్కివ్ నగరంలోనే 3,189 మంది భారతీయులను, 2,700 మంది వియత్నామీయులను, 202 మంది చైనా జాతీయులను, సుమీ నగరం నుండి 576 మంది భారత విద్యార్థులను, ఘనా దేశానికి చెందిన 101 మందిని,121 మంది చైనీయులను దేశం వదిలి వెళ్ళకుండా బలవంతంగా అడ్డుకున్నారని నెబెంజియా భద్రతామండలికి ఫిర్యాదు చేశారు.
రష్యా పాలనావిభాగ నగరమైన బెల్గ్రేడ్‌లో సౌకర్యవంతమైన 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని, ఈ బస్సులను ఉక్రేన్‌లోన తూర్పు ప్రాంతాలకు పంపి భారతీయులను సురక్షితంగా వారు కోరుకున్న గమ్యాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. నెఖోటీవ్‌కా, సుడ్జా క్రాసింగ్ పాయింట్ల వద్ద ఈ బస్సులు రెడీగా ఉన్నాయని చెప్పారు. చెక్ పాయింట్ల వద్ద విశ్రాంతి కోసం తాత్కాలిక సదుపాయాలు కల్పించామని, వారికి వేడి వేడి ఆహారం,నీరు ఇస్తామన్నారు.
అయితే భారతీయ విద్యార్థులను ఉక్రేన్‌లో బలవంతంగా అడ్డుకున్నారని రష్యా రాయబారి నెబెంజియా చెప్పడంపై భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, ఉక్రేన్ నుండి తమకు అలాంటి సమాచారం ఏదీ అందలేదన్నారు. భారతీయులను నిర్బంధించారన్న నివేదికలేవీ తమకు అందలేదన్నారు. భారత్ ఎప్పటికప్పుడు ఉక్రేన్‌తో,ఆ పొరుగున ఉన్న ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగిస్తోందని చెప్పారు. భద్రతామండలి సమావేశంలో భారత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ, భారతీయ విద్యార్థుల భద్రత తమకు చాలా ముఖ్యమని అన్నారు. వేలాదిమంది భారతీయులు ఉక్రేన్‌లో ఉన్నారని, ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల తరలింపునకు రష్యా సుముఖత
RELATED ARTICLES