HomeNewsBreaking Newsవిద్యారంగానికి అధిక ప్రాధాన్యం

విద్యారంగానికి అధిక ప్రాధాన్యం

త్వరలోనే ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు
ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం
ఎస్‌టియుటిఎస్‌ వజ్రోత్సవాల్లో మంత్రి హరీశ్‌రావు

ప్రజాపక్షం/రంగారెడ్డి ప్రతినిధి/వనస్థలిపురం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి కెసిఆర్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రు లు టి.హరీష్‌రావు, పి.సబితా ఇంద్రారెడ్డి, ఎస్‌. నిరంజన్‌ రెడ్డి, ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌, తెలంగాణ స్టేట్‌ (ఎస్‌టియుటిఎస్‌) వజ్రోత్సవ సంబరాలు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని ఎంఇరెడ్డి గార్డెన్స్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ సభలో ముఖ్య అతిథులుగా మంత్రులతో పాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ప్రతినిధులనుద్దేశించి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు ఆపడం వల్లే టీచర్ల జీతాల చెల్లింపులో ఆలస్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రమోషన్లు, బదిలీల విషయంలో సిఎం కెసిఆర్‌ సానుకూలంగా ఉన్నారని, ఆ సమస్యలను కూడా పరిష్కారిస్తామని, విద్యాశాఖలోని ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ఎస్‌టియు అని, ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాకుండా సమాజం కోసం, విద్యార్థుల కోసం పోరాటం చేసిన సంస్థ ఎస్‌టి యు అని ఈ సంఘం ఇంకా అద్భుతంగా ముం దుకు వెళ్లాలని, ఉన్నత విద్యాబోధన కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జీతాలు కావాలని ఆపుతామా?
“ఒకటో తేదీన జీతాలు వస్తుండే.. ఇప్పుడేమో పదో తారీఖుకు జీతాలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు. జీతాల గురించి మీకు కూడా ఆందోళన ఉంది. డబ్బులు ఉండి మీకు ఇవ్వకుం డా ఉంటామా? కావాలని ఆపుతామా? మొదటి ఆరేడు ఏండ్లు ఎప్పుడు కూడా జీతాలు ఆగలేదు. ఏడాది కాలం నుంచి ఈ సమస్య వస్తుంది. ఇది మీకు కూడా తెలిసి ఉంటే మంచిది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. అసెంబ్లీలో రూ.2.5 లక్షల కోట్లకు బడ్జెట్‌ పాస్‌ అయిం ది. బడ్జెట్‌ పాసైన తర్వాత ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు ఎఫ్‌ఆర్‌బిఎం నిధులలో కోత పెట్టేసింది. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టడం లేదని రూ.12 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి రాకుండా నిలిపివేశారు. 15వ ఆర్థిక సంఘం చెప్పినా రూ.5 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మన రాష్ట్రానికి హక్కుగా, వాటాగా రావాల్సిన రూ.40 వేల కోట్లను కేంద్రం నిలిపివేసింది. దీంతో కొంత ఇబ్బందిజరుగుతున్న మాట వాస్తవం. వీలైనంత త్వరగా జీతాల సమస్యను పరిష్కరిస్తాం అని మంత్రి హరీశ్‌రావు ఉపాధ్యాయులకు వివరించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మార్కులు, ర్యాంకులే కాదు.. విలువలు కూడా ముఖ్యమని, గురువు లేనిదే విద్య లేదని, విద్య లేనిదే జ్ఞానం లేదని, జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మనుగడ ఉండనే ఉండదు అన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సిఎం కెసిఆర్‌ దృష్టి సారించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కెసిఆర్‌ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రులు జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువస్తూ వాటిని పరిష్కరించుకోవడంలో ఎస్‌టియు ముందుంటుందన్నారు. కెజి టు పిజి విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రణాళికలను పాటిస్తూ భిన్నమైన అంశాలను చర్చించి విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. సమగ్రమైన విద్యా విధానానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1150 గురుకులాలు ఏర్పాటు చేశామని, 83 డిగ్రీ కళాశాలను నూతనంగా ఏర్పాటు చేశామన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.
సమాజం ఉన్నంత కాలం విద్య అవసరం ఉంటుంది: సాంబశివరావు
స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ ఏ ఒక్కరిదో కాదని, ఇది తెలుగు ప్రజల అందరిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. జాతి, సమాజం, ఉన్నంతకాలం విద్య అవసరం ఉంటుందని, విద్య అవసరం ఉన్నంతకాలం ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని, సమాజం ఉన్నంతకాలం ఎస్‌టియు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులందరికీ జన్మనిచ్చిన సంఘం ఎస్‌టియు అని సాంబశివరావు గుర్తు చేశారు. సమాజానికి అత్యంత అవసరమైనది వ్యవసాయం, విద్య, ఆరోగ్యం అన్నారు. చెడు ప్రభావాన్ని దరిదాపులకు రానివ్వకుండా సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ప్రశ్నించే గొంతులను నొక్కిస్తున్నారని, ప్రశ్నను చంపేస్తున్నారని, చివరికి సైన్స్‌ను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సాంబశివరావు గుర్తు చేశారు. ప్రపంచాన్ని నడిపించే మీరు ప్రశ్నను చంపే వారిని నిలదీసి నిప్పుతో కడిగేసేవారు మీరేనని, సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చి ప్రశ్నను బ్రతికించేలా ఉపాధ్యాయుల తమ ఐడియాలజీతో కృషి చేయాలని సాంబశివరావు కోరారు.
హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ముఖ్దూం మొహినుద్దీన్‌: చాడ వెంకట్‌రెడ్డి
ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ముగ్దుమ్‌ మొహినుద్దీన్‌ అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి కొనియాడారు. దేశంలో మొదటగా ఉపాధ్యాయుల హక్కుల కోసం యూనియన్‌ ఉందంటే అది ఎస్‌టియు మాత్రమే అని తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే అవకాశం ఒక గురువుకు మాత్రమే ఉంద్న పేర్కొన్నారు. ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఉపాధ్యాయుల కల సాధించిన చరిత్ర ఎస్‌టియుకు మాత్రమే అవకాశం దక్కిందన్నారు. ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎస్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.పర్వతరెడ్డి, ఎస్‌టియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి.భుజంగరావు, నాయకులు బ్రహ్మచారి సాయి శ్రీనివాస్‌, తిమ్మన్న, రవి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments