సమగ్ర వ్యూహంతోనే కరోనాపై గెలిచాం
కొవిడ్‌ను-19ను అడ్డంపెట్టుకొని రాష్ట్రాలపై నియంత్రణకు కేంద్రం యత్నం
కేరళ… ఆసియా ఖండపు క్యూబా
కేంద్ర ప్యాకేజీ బూటకం
కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్ ఇసాక్
ప్రజాపక్షం/హైదరాబాద్: కొవిడ్- సమర్థవంతంగా ఎదుర్కొవడంలో బలమైన స్థానిక ప్రభుత్వాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కారణమని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ తెలిపారు. ఈ మహమ్మారి అనుభవంలోనైనా ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు కేరళ అనుభవం నుండి కొవిడ్- అదుపులో వచ్చేనాటికైనా అంతటా ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సంక్షోభాన్ని ఆసరగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను తన అదుపులోనికి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాల కారణంగా లాక్‌డౌన్ తర్వాత వైరస్ మరింత ప్రబలే ప్రమాదం ఉన్నదని, ఇదొక విషాదమని అభిప్రాయపడ్డారు. కేరళలో ఇప్పటి వరకు సమర్ధవంతంగా వైరస్‌కు అడ్డుకట్ట వేస్తున్నామని, అయితే జీవనం, జీవనోపాధి కొనసాగాలనే ఉద్దేశంతో లాక్‌డౌన్ ఎత్తివేతకు సమగ్రమైన వ్యూహం తో ముందుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్‌కు చెందిన ‘మంథన్’ అనే సంస్థ ఆదివారం నాడు ‘కొవిడ్ కేరళ- అనుభవాలు’ అనే అంశంపై థామస్ ఇసాక్‌తో ఆన్‌లైన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో ఇప్పటి వరకు 1208 కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 624 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 9 మంది మరణించారని తెలిపారు. ‘భౌతిక ధూరం- సామాజిక ఐక్యత’ అనే నినాదంతో తాము లాక్‌డౌన్ నుండి బయట పడే వ్యూహాన్ని అవలంబిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కరోనా బారిన పడేందుకు అవకాశం ఉన్న పెద్ద వయసు వారు, ఇతర వ్యాధులు ఉన్న వారు ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నామని, మిగతా వారిని క్రమంగా వారి వారి పనులకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు. తొలుత వ్యవసాయ రంగంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని, ఫార్మ, వైద్య పరికరాలు, ఐటి వంటి పరిశ్రమలను అనుమతినిస్తూ వెళ్తామని చెప్పారు. లాక్‌డౌన్ తర్వాత బయటకు ఎవరు వెళ్తారు.? ఇంటికి ఎవరు పరిమితమవ్వాలనే విషయమై స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారని, ముఖ్యంగా ఇంట్లో ఉన్న వారికి వైద్య అవసరాలు ఉంటాయని, ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ‘టెలి మెడిసిన్’ విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. అవసరమైన వారు ఫోన్ చేస్తే ఆరోగ్య కార్యకర్త ఇంటికొచ్చి డాక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన పరీక్షలను నిర్వహించి, మందులు అందజేస్తారని పేర్కొన్నారు. అవసరమైన వారికి ఆహారాన్ని కూడా సరఫరా చేస్తామన్నారు. కొవిడ్ ప్రమాదాన్ని ముందే గుర్తించి అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పిహెచ్‌సి వరకు సన్నద్ధమవ్వడమే కరోనాను అరికట్టడంలో ముందుండేందుకు ప్రధాన కారణమని చెప్పారు. కొవిడ్ పేషంట్లను ఎలా గుర్తించాలి? చికిత్స ఎలా ఇవ్వాలి..? మరణిస్తే ఎం చేయాలి… అనే అంశాలపై మాక్‌డ్రిల్ నిర్వహించామన్నారు. ప్రతి జిల్లాలో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశామని, అవసరమైతే ఇతర సంస్థలను కూడా ఆస్పత్రులగా మార్చేందుకు ఏర్పాట్లు చేశామని థామస్ వివరించారు. అలాగే లాక్‌డౌన్‌కు ముందే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా రూ.20వేల కోట్ల ప్యాకేజీని కేటాయించామని, దీనికి ప్రజలు కూడా సహకరించారని తెలిపారు. కుటుంబ స్త్రీ గ్రూపులు కూడా ఉపయోగపడ్డాయని, ప్రతి వంద మందికి ఒక కుటుంబ స్త్రీ వాలంటీర్ ఉంటారని, వీరంతా ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని తెలుసుకుంటారన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి ప్రతి రోజూ సాయంత్రం లైవ్ మీడియా ద్వారా పుకార్లకు తావు ఇవ్వకుండా చేశామన్నారు. ఇప్పుడు లాక్‌డౌన్ తర్వాత ఆదాయ మార్గాల కోసం మౌలిక వనరులను పెంపొందించుకోవడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకుంటున్నాంసంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగా ఇందుకోసం రూ. 50వేల కోట్లు మౌలిక వనరులపై పెట్టుబడి పెడుతున్నామని థామస్ తెలిపారు. కేరళలో ఉత్తరం నుండి దక్షిణాన్ని కలుపుతూ రూ.75వేల కోట్లతో సెమీ స్పీడ్ రైల్వే లైన్ల్లను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తున్నామన్నారు. అలాగే ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ జల మార్గాన్ని కూడా రూపొందిస్తున్నామన్నారు.
కేరళ… ఆసియా ఖండపు క్యూబా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రేజిల్ అధ్యక్షుడు బోల్‌సెనారో వంటి వారికి కొవిడ్‌తో ప్రజలు ప్రాణాలు పోయినా ఖాతరు చేయకుండా లాక్‌డౌన్ కంటే ఆర్థిక వ్యవస్థే ప్రధానమని థామస్ అన్నారు. అమెరికా ఒక అధ్యయనం ప్రకారం కొవిడ్‌తో మరణించిన వారు జీవించి ఉంటే అందించే ఉత్పత్తి కంటే లాక్‌డౌన్ ఎత్తివేయడం ద్వారా ఉత్పాదకత చాలా తక్కువ అని వెల్లడైన విషయాన్ని వివరించారు. కేరళ రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకు విలువ ఇస్తున్నామని, ఇక్కడ 9 మందే మరణించారని, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌తో సగటు మరణ రేటు 6 శాతం అని, భారతదేశంలో 2.8 శాతం అని, కేరళలో 0.7 శాతమేనని అన్నారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతన్న మహారాష్ట్రలో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు వంద మంది వైద్యులను ముంబయికి పంపిస్తున్నామన్నారు. ఇప్పుడు కేరళను ప్రశంసపూర్వకంగా ఆసియా ఖండపు క్యూబా అని అంటున్నారని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్యాకేజీపై పెదవి విరుపు
కొవిడ్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై థామస్ పెదవి విరిచారు. కేంద్ర ప్యాకేజీ డిమాండ్, సప్లయ్‌ను సమన్వయపర్చుకుంటుందంటే రెండింటిలోనూ విఫలమైందని, ప్రజల చేతికి డబ్బులు ఇవ్వడమే ఇప్పుడు అత్యవసరమని తెలిపారు. కేంద్రం డబ్బులు ఇవ్వకుండా, మరోవైపు రాష్ట్రాలు రుణాలు తీసుకోవాలంటే నానా షరతులు పెట్టారని ఆరోపించారు. కేంద్ర చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత కూనరిల్లుతుందన్నారు. పోయిన త్రైమాసిక వృద్ధి రేటు 3.2 శాతానికి పడిపోతే, ప్రస్తుత త్రైమాసికానికి మైనస్‌కు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్యాకేజీ రూ. 20లక్షల కోట్లలో రుణాలే ఉన్నాయని, ఎంఎస్‌ఎంఇలకు కూడా రూ.8 లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలని అని అన్నారని, అలా ఇస్తే బ్యాంకులు రిజర్వుబ్యాంక్ వద్ద రెపోరేట్ కింద రూ.8.5 లక్షల కోట్లు సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ పేరుతో ఊరికే వదిలేసిందని, పరీక్షలు చేసి వైరస్ భారిన పడిన వారిని వేరు చేయాల్సిందని, అలా కాకుండా పూర్తి స్థాయి చేయకపోవడంతో లాక్‌డౌన్ వదిలిన తర్వాత వైరస్ మరింత విస్తృతి చెందే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.