సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి
మంత్రి తలసాని వెల్లడి
ప్రజాపక్షం / హైదరాబాద్ విజయ డెయిరీ ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పెంచుతున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కో ఆపరేటివ్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి రైతులతో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సు లో ఆయన పాల్గొన్నారు. గేదె పాలు రూ.46.69 నుండి రూ.49.40కు, ఆవుపాల ధరను రూ. 33.75 నుండి రూ.38.75 కు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే సొసైటీ (బిఎంసి యు) నిర్వహణకు ప్రస్తుతం ఉన్న లీటర్‌కు రూ. 1.25 నుండి రూ. 2 (వర్షాకాలంలో) రూ.1. 50 నుండి రూ.2.25 (వేసవికాలంలో) పెంచుతున్నట్లు తెలిపారు. పెంచుతున్న ధరలతో ప్రతినెల రూ.1.42 కోట్ల ఆర్థికభారం డెయిరీపై పడుతుందని, అయినా పాడి రైతుల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి పెంచిన ధరలు వర్తిస్తాయని వెల్లడించారు. ఈ సదస్సులో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, విజయ డెయిరీ ఇన్‌చార్జ్జి ఎండి ఆధార్ సిన్హా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టిఎస్‌ఎల్‌డిఎ సిఇఒ మంజువాణి, పలు జిల్లాలకు చెందిన పాడి రైతులు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మంది పాడి రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. అటువంటి పాడిరంగం అభివృద్ధికి, పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. పాడి రైతులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో విజయ డెయిరీకి పాలుపోసే రైతులలో ఎస్‌సిలు, ఎస్‌టిలకు 75 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీపై పాడి గేదెలను అందించడం, డెయిరీకి పోసే పాలకు లీటర్‌కు రూ.4 నగదు ప్రోత్సాహకం చెల్లించడం, సబ్సిడీపై దాణా, గడ్డి విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఉచితంగా మందులు, వ్యాక్సిన్‌లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. 1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా జీవాల వద్దకే మొబైల్ వెటర్నరీ క్లినిక్ వెళ్ళి వైద్యసేవలు అందిస్తున్నట్లు మంత్రి తలసాని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాడిరంగం ఎంతో అభివద్ధి సాధించిందని అన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో నష్టాలలో ఉన్న విజయ డెయిరీ రూ.800 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు, మేలుజాతి పాడి పశువుల అభివద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం పశుసంవర్ధక, డెయిరీ, టిఎస్‌ఎల్‌డిఎ, వెటర్నరీ యూనివర్సిటీ అధికారుల సమన్వయంతో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్‌డిడిబి) సహకారంతో ఇంటిగ్రేటెడ్ డెయిరీ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టినట్లు వివరించారు. అనేక విధాలుగా చేయూతను అందిస్తున్న విజయ డెయిరీకి పాలు పోయడం ద్వారా డెయిరీ మరింత అభివృద్ధి సాధించేందుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం కింద అనేకమంది పాడి గేదెలను కొనుగోలు చేశారని, వారు కూడా విజయ డెయిరీకి పాలు పోసే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. పాడి రైతులు పశుసంవర్ధక శాఖ అధికారుల సూచనలు, సలహాలను పాటించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న పలువురు రైతులు పలు సూచనలు, అభిప్రాయాలను వ్యక్త పరిచారు. పెండింగ్‌లో ఉన్న పాడిరంగం మరింత అభివృద్ధికి, పలు సమస్యల పరిష్కారం కోసం పాడి రైతులతో రాష్ర్ట, జిల్లా స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై ప్రభుత్వ పరంగా చేపట్టవలసిన చర్యలు, పాడి రైతులు అనుసరించవలసిన విధానాలపై చర్చించడం ద్వారా పెనుమార్పులు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని సమావేశం అభిప్రాయ పడింది.