అర్ధ శతకాలతో రాణించిన పుజారా, రహానే..
బంతితో మెరిసిన అశ్విన్, షమీ..
కష్టాల్లో ఆస్ట్రేలియా
ఆడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన మొదటి టెస్టులో భారత జట్టు విజయానికి చెరువైంది. 323 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అశ్విన్, మహ్మద్ షమీలు తలో రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియా నడ్డివిరగ్గొట్టారు. ప్రస్తుతం షాన్ మార్ష్ (31 బ్యాటిం గ్), ట్రావిస్ హెడ్ (11 బ్యా టింగ్) క్రీజులో ఉన్నారు. మరో ఆరు వికెట్లు పడగొడి తే టీమిండియా విజయం ఖా యమైపోతుంది. ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే చివరి రోజు 219 పరుగులు
చేయాల్సి ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండడంతో ఆసీస్‌కు విజయం పెద్ద సవాలే.. అంతకుముందు 151/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్లు చతేశ్వర్ పుజారా (71; 204 బంతుల్లో 9 ఫోర్లు), అజింక్యా రహానే (70; 147 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 106.5 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌటైంది. చివర్లో చెలరేగి బౌలింగ్ చేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ 6 వికెట్లు పడగొట్ట్టి భారత్‌ను కట్టడి చేశాడు. 323 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అరోన్ ఫించ్, మార్కుస్ హారిస్ శుభారంభమే అందించారు. ఇద్దరూ సమన్వయంతో ఆడుతూ భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. వికెట్ కపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చిన వీరు ఎక్కువగా డాట్ బాల్స్ ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు.
అశ్విన్ మొదలు పెట్టాడు…
ఈ సమయంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఆసీస్ వికెట్ల పతనాన్ని మొదలు పెట్టాడు. మొదట తెలివైన బంతితో కుదురుగా ఆడుతున్న అరోన్ ఫించ్‌ను బోల్తా కొట్టించి ఈ జంటను విడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన ఫించ్ 35 బంతుల్లో ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి కీపర్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 12వ ఓవర్ చివరి బంతికి 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖవాజాతో కలిసి హారిస్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కూడా ఆత్మరక్షణలో ఆడుతూ డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆసీస్ స్కోరు బోర్డు పరుగుల వేగం నత్తనడకగా సాగింది. తర్వాత హారిస్ దూకుడును పెంచుతూ బౌండరీలు కొట్టడం మొదలు పెట్టాడు. అయితే ఆ కొద్ది సేపటికే వేగంగా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్న హారిస్‌ను మహ్మద్ షమీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 44 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్‌తో కలిసి ఖవాజా ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన సీనియర్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడుతూ పరుగులు సాధించాడు. మరోవైపు ఖవాజా మాత్రం మరీ ఎక్కువగా ఆత్మరక్షణ ధోరణిని అనుసరిస్తూ పిచ్‌పై పాతుకుపోయాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్న ఈ జంటను సవాలుగా తీసుకున్న భారత బౌలర్లు వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే ఆసీస్ 19.2 ఓవర్లలో తొలి 50 పరుగులను పూర్తి చేసుకుంది. అనంతరం జట్టు స్కోరు 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ ఆసీస్‌కు మరో పెద్ద షాకిచ్చాడు. సమన్వయంతో ఆడుతూ భారత బౌలర్లను ఇబ్బంది పెడుతున్న ఉస్మాన్ ఖవాజా (42 బంతుల్లో 8) పరుగులను అశ్విన్ ఔట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. తర్వాత వచ్చిన పీటర్ హాండ్స్‌కొంబ్ కూడా కుదురుగా ఆడుతూ మార్ష్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఈ జంట కూడా భారత బౌలర్లకు సవాలుగా మారి క్రీజులో పాతుకుపోయింది. పరుగులు చేయకుండా డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇస్తూ పోవడంతో పరుగుల వేగం గణనీయంగా తగ్గిపోయింది. డ్రింక్స్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. బ్రేక్ అనంతరం మరోసారి భారత బౌలర్లు ఆసీస్‌పై ఎదురుదాడికి దిగారు. వికెట్ తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. ఆసీస్ స్కోరు 84 పరుగుల వద్ద కుదురుగా ఆడుతున్న హాండ్స్‌కొంబ్ (40 బంతుల్లో 14)ను షమీ తెలివైన బంతితో పల్టీ కొట్టించాడు. దీంతో 24 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మొదటి ఇన్నింగ్స్ హీరో ట్రావిస్ హెడ్ కూడా తన వికెట్‌ను కాపాడుకుంటూ కుదురుగా ఆడాడు. మరోవైపు మార్ష్ సింగిల్స్, డబుల్స్ తీస్తూ పోయాడు. ఈక్రమంలోనే కంగారు జట్టు 282 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ వికెట్‌ను విడదీయడానికి భారత బౌలర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, వీరిద్దరూ తెలివిగా ఆడుతూ తమ వికెట్‌ను కాపాడుకున్నారు. కాగా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.