సిరీస్‌పై భారత్ కన్ను
లంకకు చావో రేవో
నేడు చివరి టి20
పుణె: మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లలో భాగంగా మొదటి మ్యాచ్ రద్దవగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. దీంతో భారత్ జోరుమీదుంది. శుక్రవారంతో శ్రీలంకతో జరిగే మూడో టీ20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. పుణే వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ తహతహలాడుతోంది. మరోవైపు శ్రీలంకకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌ను కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇందులో గెలిస్తే సిరీస్ 1-1తో సమమవుతోంది. దీంతో లంక జట్టుకు ఈ మ్యాచ్ కీలకంగా తయారైంది. తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉండడంతో లంక జట్టు తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దుకాగా, ఇండోర్‌లో జరిగిన రెండో టి20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక, ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని భావిస్తోంది. ఇండోర్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టగా రాణించింది. దీంతో జట్టుకు అలవోక విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి రానున్న సిరీస్‌లకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే లక్ష్యంతో కోహ్లి సేన ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఈ పరిస్థితుల్లో భారత్‌తో పోరు పర్యాటక లంక జట్టుకు సవాలుగా తయారైంది. తీవ్ర ఒత్తిడిని తట్టుకుని లంక ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
రాహుల్ జోరు.. ధావన్‌కు పరీక్ష
కిందటి మ్యాచ్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తున్న రాహుల్ మాత్రం తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ టీమిండియాకు శుభారంభం అందించాడు. వేగంగా ఆడుతూ ఒత్తిడి లేకుండా చేయడంలో సఫలమయ్యాడు. ఈసారి మరింత మెరుగ్గా ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రాహుల్ విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో కూడా భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. ఇక, ఇండోర్ మ్యాచ్‌లో అంతంత మాత్రంగానే రాణించిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. కొంతకాలంగా ధావన్ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. గతంలోలాగా వేగంగా ఆడడంలో విఫలమవుతున్నాడు. దీంతో జట్టులో స్థానాన్ని కాపాడు కోవడం క్లిష్టంగా తయారైంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ధావన్‌కు తుది జట్టులో ఆడే అవకాశం లభించింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో శిఖర్ విఫలమయ్యాడనే చెప్పాలి. కనీసం ఈ మ్యాచ్‌లోనైన కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం అతనిపై ఉంది. ఇందులో విఫలమైతే టీమిండియాలో స్థానం కాపాడుకోవడం ధావన్‌కు కష్టంగా మారుతుందనే చెప్పాలి.
కోహ్లి మళ్లీ మెరవాలి
ఇండోర్ టి కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లి లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే కిందటి సిరీస్‌లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్‌కు సిరీస్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నాడు. కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. మరోవైపు యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు తమ సత్తా చాటేందుకు ఇదే మంచి తరుణమని చెప్పాలి. రెండో మ్యాచ్‌లో అవకాశం లభించినా అయ్యర్ దాన్ని ఆశించిన స్థాయిలో సద్వినియోగం చేసుకోలేక పోయాడు. కానీ, ఈ మ్యాచ్‌లో ఛాన్స్ దొరికితే భారీ స్కోరు సాధించాలనే లక్ష్యంతో కనిపిస్తున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న పంత్‌కు సంజు శాంసన్ రూపంలో గట్టి పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో మెరుగైన ఆటను కనబరచాల్సిన అవసరం పంత్‌కు నెలకొంది. ఈసారి విఫలమైతే అతని కష్టాలు రెట్టింపు కావడం ఖాయం.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రిషబ్ పంత్‌లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇండోర్‌లో నాలుగోస్థానంలో ఆడినా పుణేలో మాత్రం కోహ్లీ తన పాత స్థానానికి వచ్చే అవకాశముంది. మిడిలార్డర్‌లో తనకు దక్కిన అవకాశాలను శ్రేయాస్ అయ్యర్ చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఇదే ఫామ్‌ని అతడు గనుక కొనసాగిస్తే భారత్‌కు చాలా కాలంగా సమస్యగా మారిన నాలుగో స్థానానికి ఓ పరిష్కారం లభించినట్లే. శివమ్ దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ బంతితో మాత్రం ఫరవాలేదనిపిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లేలో స్పెషలిస్ట్ బౌలర్‌గా నిలుస్తున్నాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో యజువేంద్ర చాహల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. రొటేషన్ పాలసీలో భాగంగా చాహల్‌ను ఆడించవచ్చు. ఇండోర్‌లో వేదికగా జరిగిన రెండో టీ20లో కుల్దీప్ రెండు వికెట్లు తీసి రాణించాడు. అయితే, గత ఐదు మ్యాచ్‌ల్లో రిజర్వ్‌కే పరిమితమైన చాహల్‌ను ఆడించే అవకాశాలున్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరిగానే భారత తుదిజట్టులో ముగ్గురు పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ ఆడనున్నారు. రెండో టీ20లో కీలక సమయంలో రెండు వికెట్లు తీసి సైనీ టీమిండియాకు బ్రేకిచ్చాడు. గాయం నుంచి కోలుకుని లంకతో సిరిస్‌లో రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి ఓవర్‌ను రెండు వైడ్లతో స్టార్ట్ చేసిన బుమ్రా ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు ఇచ్చాడు. బుమ్రా ట్రాక్‌లో పడితే టీమిండియా బౌలింగ్ విభాగం పటిష్టంగా మారినట్లే. మ్యాచ్ శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది.
బౌలర్లే కీలకం
భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లు ఈసారి కూడా కీలకంగా మారారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు జట్టులో కొదవలేదు. కిందటి పోటీలో నవ్‌దీప్ సైని, శార్దూల్ ఠాకూర్ అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. కిందటిసారి పెద్దగా ప్రభావం చూపని బుమ్రా ఈ మ్యాచ్‌లో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌లతో స్పిన్ విభాగం చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా లంక బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఇదిలావుండగా శ్రీలంకకు ఈ మ్యాచ్ పరీక్షగా తయారైంది. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో ఓడిపోవడంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో చిక్కుకుంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే లంక సిరీస్ సమం చేయగలుగుతోంది. ఒక వేళ ఓడి పోతే మాత్రం సిరీస్‌ను కోల్పోక తప్పదు. దీంతో ఈ మ్యాచ్‌ను లంక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారత్‌ను ఓడించి సిరీస్‌ను సమంగా ముగించాలని భావిస్తోంది. దీని కోసం గురువారం జట్టు ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో లంక బలంగానే ఉంది. అయితే నిలకడలేమి ఒక్కటే జట్టుకు సమస్యగా తయారైంది. ఆ లోటును పూడ్చుకుంటే భారత్‌ను ఓడించడం పెద్ద సమస్యేమి కాదు.
ఒక్క వికెట్ దూరంలె బుమ్రా..
పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఒక రికార్డు ఊరిస్తోంది. భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కడానికి బుమ్రా ఒక వికెట్ దూరంలో నిలిచాడు. ప్రస్తుతం స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్- యుజువేంద్ర చహల్‌లతో కలిసి బుమ్రా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రాకు వ్యక్తిగత అత్యధిక వికెట్లు సాధించడానికి వికెట్ కావాలి. అశ్విన్-చహల్-బుమ్రాలు 52 టీ20 వికెట్లతో టాప్‌లో ఉన్నారు. పుణె టీ20 మ్యాచ్‌లో చహల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. శ్రీలంక జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఉండటంతో గత మ్యాచ్‌లో కుల్దీప్‌కు కెప్టెన్ కోహ్లీ అవకాశం ఇచ్చాడు. కెప్టెన్ అంచనాలను నిలబెట్టడంతో మళ్లీ అతనికే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. దాంతో చహల్‌కు నిరాశే ఎదురుకానుంది. దీంతో భారత్ తరఫున అత్యధిక వికెట్ల మార్కును బుమ్రా అందుకునే చాన్స్ ఉంది. బుమ్రా 44 టీ20 మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు తీసాడు. చహల్ 36 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీయగా.. అశ్విన్ 46 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు సాధించాడు. గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుని రెండో టీ20తో రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి విఫలమయ్యాడు. తన కోట 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరున్న బుమ్రా.. ఆఖరి ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు ఇచ్చాడు. హసరంగా హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి బుమ్రాను బెంబేలెత్తించాడు. దీంతో బుమ్రా ఇంకా తన మునుపటి ఫామ్ అందుకోలేదని అరడమైంది. చివరి టీ20లో తన సత్తా చాటాలని ఇవ్విళ్లూరుతున్నాడు.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, సంజు శాంసన్, బుమ్రా, చాహల్, సైనీ, ఠాకూర్, కుల్దీప్ యాదవ్.
శ్రీలంక: లసిత్ మలింగ (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సె, ఒశాడా ఫెర్నాండో, ధనుష్క గుణతిలక, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, డిక్వెల్లా, వనిండు హరసంగా, లహిరు కుమార, సండకాన్, కాసున్ రజిత.
రాత్రి 7 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం..