HomeNewsBreaking Newsవిఆర్‌ఎల అసెంబ్లీ ముట్టడి

విఆర్‌ఎల అసెంబ్లీ ముట్టడి

సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కెటిఆర్‌ హామీ
20న విఆర్‌ఎల ప్రతినిధులు, అధికారుల సంయుక్త సమావేశం
తాత్కాలికంగా సమ్మె వాయిదా
ప్రజాపక్షం / హైదరాబాద్‌
విఆర్‌ఎల సమ్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. విఆర్‌ఎలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు మరోసారి ఈ నెల 20వ తేదీన విఆర్‌ఎ సంఘం ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులంతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించగా స్పందించిన ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌లు విఆర్‌ఎల సంఘం ప్రతినిధులతో అసెంబ్లీ ప్రాంగణంలో చర్చలు జరిపారు. విఆర్‌ఎలకు పేస్కేల్‌ ఇవ్వాలని, అర్హులకు పదోన్నతి, మృతి చెందిన విఆర్‌ఎల పిల్లల కోసం కారుణ్య నియామకాలు చేపట్టాలని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తదితర డిమాండ్లను విఆర్‌ఎల సంఘం ప్రతినిధి బృందం మంత్రి కెటిఆర్‌కు ముందుంచింది. ఇందుకు మంత్రి కెటిఆర్‌ స్పందిస్తూ విఆర్‌ఎల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే వాటిపై వాటిపై మరింత సమగ్రంగా చర్చిద్దామని, అందుకు ప్రభుత్వానికి సమయం అవసరమని, ఈ నెల 20వ తేదీన మరోసారి సమావేశమౌదామని చెప్పారు. ఇందుకు విఆర్‌ఎల సంఘం ప్రతినిధి బృందం కూడా సానుకూలంగా స్పందించింది.
సమ్మె తాత్కాలికంగా వాయిదా
విఆర్‌ఎ సంఘం ప్రతినిధుల ప్రకటన

పే స్కేల్‌ అమలు, అర్హులకు ప్రమోషన్లు, 55 సంవత్సరాల వయసు దాటిన వారి వారసులకు ఉద్యోగాలు తదితర డిమాండ్లతో గత కొన్ని రోజులుగా విఆర్‌ఎలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్‌, సిఎస్‌ సోమేష్‌ కుమార్‌తో చర్చల అనంతరం తమ సమ్మెను తాత్కాళికంగా వాయిదా వేస్తున్నట్లు విఆర్‌ఎ సంఘం ముఖ్య నాయకులు మాట్లాడుతూ తమ హామీలపై ఉత్తర్వులు వచ్చాకే సమ్మె విరమించాలని అనుకున్నామని, మంత్రి కెటిఆర్‌ హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. బుధవారం నుంచి 20వ తేదీ వరకు నిరసన శిబిరాల్లో తమ కార్యక్రమాలు శాంతియుతంగా కొనసాగిస్తామని చెప్పారు. “మా హక్కుల కోసం 50 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. మంత్రి కెటిఆర్‌ మాతో చర్చలు జరిపారు. గతంలో కెసిఆర్‌ మాకు ఇచ్చిన హమీల గురించి ఆయనకు వివరించాం. ఈనెల 20వ తేదీన జాయింట్‌ మీటింగ్‌ ఉంది. ముఖ్యమంత్రి, మంత్రి కెటిఆర్‌, ఉన్నతాధికారులపై మాకు నమ్మకం ఉంది. గ్రామాల్లో విఆర్‌ఎలపై చాలా భారం పడుతుంది. విఆర్‌ఓ వ్యవస్థ రద్దు అయ్యాక జాబ్‌ చార్ట్‌లో లేని విధులను కూడా మాతో చేయిస్తున్నారు. ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ఉన్నతాధికారుల నిర్లక్షం వల్లే మాకు ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయి” అని వారు వివరించారు.
విఆర్‌ఎల అసెంబ్లీ ముట్టడి& ఎక్కడికక్కడ అరెస్టు
విఆర్‌ఎల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంతో మంగళవారం ఉదయం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వందలాది మంది విఆర్‌ఎలు ఒక్కసారిగా భారీ ర్యాలీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చిన విఆర్‌ఎలను తెలుగుతల్లి ఫ్లువర్‌ కింద పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. తెలుగుతల్లి ఫ్లువర్‌పై వారు బైఠాయించి రాష్ర్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పే స్కేలు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. రాష్ర్టవ్యాప్తంగా పెద్దఎత్తున విఆర్‌ఎలు తరలిరావడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించారు. అసెంబ్లీ పరిసరాలకు దూసుకువచ్చి రోడ్లపై బైఠాయించడంతో పెద్దెత్తున రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో ప్రధాన రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసులు విఆర్‌ఎలను ఎక్కడికక్కడ అరెస్ట్‌ అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్‌ చేశారు. ఈ సందర్బంగా నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఛలో అసెంబ్లీలో ఏడు సంఘాలు పిలుపు ఇచ్చిన తరుణంలో హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లపై భారీగా పోలీసు బలగాలు భారీగా మోహరించారు. ఈ ఆందోళన నేపథ్యంలో మంత్రి కెటిఆర్‌ విఆర్‌ఎ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించడంతో విఆర్‌ఎలు శాంతించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments