1373 అభ్యంతరాలు ఒక్కరోజులో ఎలా పరిష్కారం చేశారు?
సర్కారు వాదన వాస్తవ దూరమన్న హైకోర్టు
మున్సిపల్ ఎన్నికలపై విచారణ 21కి వాయిదా
ప్రజాపక్షం/హైదరాబాద్ లీగల్ : ‘పురపాలక సంఘాల్లో వార్డుల విభజనకు నెల రోజుల వ్యవధి కోరిన పాలక పెద్దలు కేవలం 8 రోజుల్లోనే ఎట్లా చేశారో.. వచ్చిన అభ్యంతరాలు 1373 అన్నింటినీ ఒకే రోజులో ఎలా పరిష్కరించేశారో అర్థం కావబోవడం లేదు. స్‌సి, ఎస్‌టి, బిసి, మహిళా ఓటర్ల వివరాలన్నీ జూన్ 21 నుంచి 30 వరకూ చేశామన్నారు. ఎలా చేశారో కూడా చెప్పలేదు. ప్రభుత్వ చర్యలు ఐవాష్‌గా ఉన్నాయనిపిస్తోంది. నమ్మకాన్ని కలిగించడం లేదు. సర్కార్ చెబుతున్న వాదన వాస్తవానికి దూరంగా ఉందనిపిస్తోంది..’ అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియ చట్ట వ్యతిరేకంగా జరిగిందని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంజుకుమార్ రెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం మరోసారి విచారించింది. ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ కూడా సరిగ్గా వేయలేదు. ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది ఎలా చేశామో చెప్పకుండా నామమాత్రంగా కౌంటర్ వేసినట్లుగా అనిపిస్తోంది. ఉదాహరణకు జనాభా నిష్పత్తి మేరకు వార్డుల్ని విభజన ఎట్లా చేశారో చెప్పలేదు. విభజన చేయడానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు శిక్షణ ఏ తీరుగా ఇచ్చారో చెప్పలేదు. 1373 అభ్యంతరాలు వస్తే 665 అభ్యంతరాల్ని పరిష్కరించామని చెప్పారేకానీ ఎలా చేశారో వివరించలేదు. మిగిలిన 708 అభ్యంతరాల్ని ఎందుకు తోసిపుచ్చారో కూడా కారణాలు లేవు. అభ్యంతరాలన్నిటినీ ఒకే రోజు ఎట్లా చేశారో తెలియడం లేదు. సింగిల్ జడ్జి దగ్గర ముందస్తు ఎన్నికల ప్రక్రియ పూర్తికి 109 రోజులు కావాలన్న సర్కా ర్ అందులో వార్డుల విభజనకు 30 రోజులని చెప్పింది. కానీ 8 రోజుల్లోనే ఎట్లా చేసిందో అంతుబట్టనీయకుంది. నిజంగానే చేశారా..కంటి తుడుపుగా చేశా రా.. ఏమో నమ్మడానికి వీలుగా లేదు. అంతా చూస్తుంటే హడావుడిగా చేశారని అర్థమైపోతున్నంది. కొన్ని పురపాలికల్లో అభ్యంతరాలు, వాటిని పరిష్కరించిన వైనాన్ని పరిశీలిస్తే విస్తుపోవాల్సివస్తదేమో. నిజంగానే అభ్యంతరాల్ని పరిష్కరించారా అనే సందేహం కలుగతుంది. కొన్ని చోట్ల చాలా అభ్యంతరాల్ని చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఆమోదించలేదు. కొన్ని చోట్ల మాత్రమే సమ్మతించారు. సూర్యాపేటలో 79 వస్తే అభ్యంతరాలపై ఫిర్యాదు అందితే 78 తోసిపుచ్చారు. ఒక్కటే పరిష్కరించారు. మీర్‌పేటలో 39 వస్తే 37 పరిష్కరించి ఒక్కటే తోసిపుచ్చారు. ఆర్మూర్‌లో వచ్చిన 20 అభ్యంతరాలు చెల్లవన్నారు. కరీంనగర్ 109 వస్తే 50 చెల్లవన్నారు. పాలమూరులో77 అభ్యంతరాలు వస్తే 38 చెల్లవన్నారు. ఏయే కారణాల వల్ల వాటిని తోసిపుచ్చారో స్పష్టం చేయలేదు. అభ్యంతరాల గురించి సంబంధిత మునిసిపల్ కమిషనర్ నోటీసు బోర్డులో పెట్టాలి. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. ప్రజాప్రతినిధులకు తెలియజేయాలి. ఇవన్నీ ఒక్క రోజులో ఎట్లా చేశారో అధికారులకే తెలియాలి.. అని హైకోర్టు డివిజన్ బెంచ్ ధర్మసందేహాల్ని లేవనెత్తింది. కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేయాలంటే జనానికి చెప్పాలి కదా? వాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకోవాలి కదా? ఎల్లారెడ్డిని మునిసిపలిటీ చేస్తేనే అక్కడి జనానికి ఏవార్డులో ఓటు వేయాలో తెలియాలి కాదా?.. అని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది.