రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు, బడా లీడర్లు
మొదలైన బేరసారాలు
చిన్న పంచాయతీలకు రూ.10 లక్షల ఎర
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పల్లెపోరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెరలేపడంతో గల్లీ లీడర్లలో గడబిడ మొదలైంది. గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఎనలేని గౌరవం ఉండడంతో దాని కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న లీడర్లు రంగంలోకి దిగారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా క్యాటగిరీలకు చెందిన గ్రామాల నాయకులు ఎవరికి వారే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పంట చేలల్లో, తోటల్లో దావత్‌లు ఏర్పాటు చేసి ప్రత్యర్థులుగా బరిలోకి దిగే అవకాశం ఉన్న వారితో బేరసారాలు మొదలుపెట్టారు. ఈసారి చాలా చిన్న గ్రామాలు గతంలో ఉన్న పెద్దపంచాయతీ నుంచి విడిపోయి కొత్త పంచాయతీలుగా ఏర్పడడంతో కొత్త లీడర్లు పుట్టుకొచ్చారు. అందరినీ ఒకటి చేసి నయానా, భయానా ఒప్పించి పంచాయతీ సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసేందుకు ఆయా గ్రామాల పెద్దలు, సంబంధిత మండలాల, నియోజక వర్గాల లీడర్లు రంగంలోకి దిగారు. చిన్న పంచాయతీలలో ఈ తరహా బేరసారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వార్డులు తక్కువ, లీడర్ల సంఖ్య కూడా తక్కువే ఉండడంతో బేరసారాలతో ఒప్పించి వాటిని కైవసం చేసుకోవడం సులభమని భావించిన బడా లీడర్లు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల నేతలు తమకు అనుయాయులైన వారి కార్యకర్తలను రంగంలోకి దించారు. 500లోపు జనాభా ఉన్న పంచాయతీలే రాష్ట్రంలో 981 ఉన్నాయి. ఇలాంటి పంచాయతీలన్నింటినీ ఏకగ్రీవం చేయడం పెద్ద కష్టం కాదనే భావన ఆయా నియోజకవర్గాల ప్రధానపార్టీల నేతల్లో ఉంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికారపార్టీ నేతలు పంచాయతీలను వారి పార్టీ ఖాతాలో వేసుకునే ప్రక్రియను ముమ్మరం చేశారు.