సుప్రీంకోర్టులో ముఖాముఖి కేసుల విచారణ : మార్చి 15 నుండి ప్రారంభం
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో ఇకమీదట వారానికి మూడు రోజులపాటు కేసుల విచారణ ముఖాముఖి కొనసాగుతాయి. మరో రెండు రోజులు దృశ్యమాధ్యమం ద్వారా కేసుల విచారణ కొనసాగుతుంది. మార్చి 15వ తేదీ నుండి ప్రయోగప్రాతిపదికపై ఈ మిశ్రమ విధానం అమలులోకి వస్తుంది. కొవిడ్-19 విజృంభించిన తర్వాత గత ఏడాది మార్చి నెల నుండి ఇప్పటివరకు సుప్రీంకోర్టు దృశ్యమాధ్యమం, టెలికాన్ఫరెన్సింగ్ విధానాల ద్వారానే కేసులను విచారిస్తోంది. అయితే పూర్వం ఉన్న పద్ధతిలోనే ముఖాముఖి కేసుల విచారణ పునఃప్రారంభించాలని ఈ మధ్య న్యాయవాదులు చాలామంది డిమాండ్ చేస్తూ ఉండటంతో, ప్రయోగప్రాతిపదికపై వారానికి మూడు రోజులపాటు ముఖాముఖి, మరో రెండు రోజులు దృశ్యమాధ్యమం ద్వారా మిశ్రపద్ధతులు అనుసరిస్తూ విచారణలు చేయాలని సుప్రీంకోర్టు శనివారంనాడు నిర్ణయించింది. ఇకమీదట, మం గళవారం, బుధవారం, గురువారం మూడు రోజులపాటు కేసుల విచారణకు న్యాయవాదులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరవుతారు. తమ వాదనలను వినిపిస్తారు. నిందితులను కూడా యథాపూర్వపద్ధతిలో ప్రవేశపెడతారు. అయితే ఎక్కువ సంఖ్యలో నిందితులు ఉన్నారా? లేక ఈ కేసు కేవలం పరిమితంగా ఇద్దరికి, ముగ్గురికి సంబంధించినదా? అనే విచక్షణతో సుప్రీంకోర్టు కేసులను అనుమతిస్తుంది. సోమవారం, శుక్రవారం మాత్రం కేసులను దృశ్యమాథ్యమ పద్ధతిలో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తారు. ఏడాదికాలంగా దృశ్యమాధ్యమంలో జరుగుతున్న కేసుల విచారణలో కూడా న్యాయమూర్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాయిస్ సరిగ్గా వినిపించకపోవడం, స్పష్టత లేకపోవడం, కనెక్షన్ పోవడం, న్యాయవాదులు పార్కుల్లోనూ, మెట్లు ఎక్కుతూ దిగుతూ నడుస్తూ దృశ్యమాధ్యమాల ద్వారా కేసుల విచారణలో పాల్గొనడం…వంటి అనేక సమస్యలు తలెత్తడంతో ఒకదశలో న్యాయస్థానం బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారానికి 3 రోజులే
RELATED ARTICLES