సెక్రటేరియట్ కార్యాలయాల తరలింపునకు సర్కార్ డెడ్‌లైన్
ఎర్రమంజిల్‌కు తరలి వెళ్లిన ఆర్ అండ్ బి శాఖ
ప్రజాపక్షం / హైదరాబాద్ : సెక్రటేరియట్ కార్యాలయాల తరలింపు మరింత వేగవంతమైంది. వారం రోజుల్లోపే అన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బుధ, గురు వారాల్లో పలు కార్యాలయాలు తరలి వెళ్లా యి. నేడు శ్రావణ శుక్రవారం మంచి ముహూర్తం కావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి కార్యాలయంతో పాటు వైద్యశాఖ, ఐటి శాఖలు సైతం శుక్రవారం నుండే కొత్త ప్రాంతాల నుండి కార్యకలాపాలను ప్రారంభించుకోవాలని ఆదేశించినట్లు ఉన్నతాధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. బిఆర్‌కె భవన్‌లోనే సిఎస్ జోషి కార్యాలయం నేటి నుండి కార్యకలాపాలు ప్రారం భం కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మల కార్యాలయాలు ఎర్రమంజిల్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయ సముదాయంలోకి తరలించారు. విశాలమైన ఈ భవన సముదాయంలో వివిధ విభాగాల వారీగా ఛాంబర్లను, ఫైలింగ్ సెక్షన్లను కేటాయించారు. ఎర్రమంజిల్ ఇఎన్‌సి భవనంలోకి ఆర్ అండ్ బి శాఖతో పాటు రవాణా శాఖ కార్యాలయం కూడా తరలించేంతగా ఇక్కడ స్థలం, సదుపాయాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎర్రమంజిల్ ఇఎన్‌సి భవనం ప్రస్తుతం ఆర్ అండ్ బి శాఖను తరలించారు. అవసరమైన భవనాలకు రంగులు వేస్తున్నారు. మరీ అంతగా వాడకం లేకుండా బూజు పట్టి ఉన్న గదుల్లో దుమ్ము తొలగిస్తున్నారు. శుక్రవారం నుండే ఇక్కడ పూర్తిస్థాయి రోజు వారీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయంటున్నారు. నూతన సెక్రటేరియట్ నిర్మాణంపై హైకోర్టులో వ్యాజ్యాలు ఒక పక్క, సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేసిన దరిమిలాల నిర్మాణ పనులు మరో పక్క చర్చనీయాంశంగామారుతున్నాయి.“కోర్టుకు చెప్పాల్సింది చెబుదా ం .. నిర్మాణ పనులు ముందుకు సాగేందుకు ముందు గా శాఖలన్నీ కూడా సమయత్తంగా ఉండాలి” అని సిఎం కెసిఆర్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి ఇతర ఉన్నతాధికారులతో అన్నట్లు సమాచారం.సిఎస్ ఎస్‌కె జోషి సూచనల మేరకు వారం రోజుల్లోపే ఎంపిక చేసుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు.బూర్గుల రామకృష్ణారావు (బిఆర్‌కె) భవన్‌కు వెళ్లే కార్యాలయాలు తప్ప ఇతర కార్యాలయాలు మాత్రం శుక్ర, శని, సోమ వారాల నాటికల్లా దాదాపు తరలి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైళ్ల, ఫర్నీచర్ ఒకే సారి కాకుండా ముందుగా ఫర్నీచర్ ఆ తర్వాత ఫైళ్లు తరలించాలని కాంట్రా క్టు పొం దిన ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. గురువారం నాడు ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ కార్యాలయంలోని మొత్తం అల్మారాలు, కుర్చీలు, సోఫాలు, ఫ్యా న్లు తదితర సామాగ్రినంతటికీ జాగ్రత్తగా ఇఎన్‌సి బిల్డింగ్‌కు తరలించారు.