బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ నేత ప్రకటన
టిఎంసి, బిజెపిపై పోరు సాగిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జితిన్ ప్రసాద్ ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎం సి), భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై పోరు సాగిస్తామని అన్నారు. టిఎంసి, బిజెపి ఆధిపత్య పోరాటంలో మునిగిపోయాయని, ప్ర జా సమస్యల పట్ల ఆ రెండు పార్టీలకూ చిత్తశుద్ధి లేదని ఆదివారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసాద్ పేర్కొన్నారు. అందులో ప్రజలంతా ప్రతామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని, 294 మంది సభ్యులు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్-మే మాసాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామ పక్షాల కూటమికి పట్టం కడతారన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. వామ పక్ష పార్టీల నేతలతో సీట్ల సర్దుబాటుపై దృష్టి కేంద్రీకరించామని, సాధ్యమైనంత త్వరంలో ఒక స్పష్టమైన అవగాహన వస్తుందని ఆయన అన్నారు. చర్చల కోసం తమ పార్టీ ఒక ప్యానెల్‌ను నియమించినట్టు వివరించారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎఐసిసి కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని, అయితే, అధిష్ఠానం నేరుగా జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళతామని, స్థానిక అవసరాలు, పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయే తప్ప, ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు ఎవరూ ఆదేశాలు జారీ చేయరని ప్రసాద్ అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి రావాలని పశ్చిమ బెంగాల్ పార్టీ శ్రేణులు కోరుతున్నాయని చెప్పారు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతున్నదని, త్వరలోనే ఒక స్పష్టమైన అవగాహనకు వస్తామని చెప్పారు. పోటీకి ఎంపిక చేసిన అభ్యర్థులకు తగినంత సమయం ఉంటే, వారు ప్రచార కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతారని అభిప్రాయపడ్డారు. అందుకే, అభ్యర్థుల ఎంపికను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరీ, కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు అబ్దుల్ మాన్నన్, పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ ప్రదీప్ భట్టాచార్య, నేపాల్ మహతో వంటి నేతలు సీట్ల సర్దుబాటుపై ఏర్పడిన కమిటీలో ఉన్నారని చెప్పారు. చర్చలను కుదిరినంత త్వరగా పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమని ్రప్రసాద్ పేర్కొన్నారు. టిఎంసి, బిజెపి బలాబలాలు తేల్చుకునేందుకు పోటీపడుతున్నాయే తప్ప ప్రజల సంక్షేమంపై అసలు దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ప్రత్యామ్నాయ శక్తుల అవసరం ఏర్పడిందన్నారు. లెఫ్ట్ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఉత్తమ ఫలితాలను రాబట్టుకోగలదన్న నమ్మకం తనకు ఉందన్నారు. కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల మధ్య విభేదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి పలు కేంద్ర పథకాలు అందుకే తమ రాష్ట్ర ప్రజలకు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగం, మౌలిక వసతులు, విద్య, వైద్యం తదితర రంగాల్లో లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయని ప్రసాద్ అన్నారు. ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ అధికారంలో ఉన్న టిఎంసికానీ, కేంద్ర సర్కారుకానీ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
వామపక్షాలతో కలిసి పోటీ
RELATED ARTICLES