ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్ ఢిల్లీ లేదా ముంబయి.. చెన్నై లేదా హైదరాబాద్.. నగరం ఏదైనా.. చిన్నపాటి వానలకే వరద బీభత్సం సామాన్యమైంది. ఒకప్పుడు ఉన్న కుంటలు, చెరువులు, కాలువలను ఆక్రమించి అక్రమం కట్టడాలతో నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోయాయి. నీరు భూమిలోకి ఇంకిపోయే మార్గం లేదు. దీనితో అనేకానేక ఆవాస ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. ఇళ్లలోనూ మోకాలులోతు నీరు వచ్చి చేరడంతో అల్లాడుతున్నారు. ప్రతి వర్షాకాలం ఇదే సమస్య. ఇవే దృశ్యాలు.. ఇవే సమస్యలు.. దిద్దుబాటు చర్యలు మృగ్యం. అధికారుల్లో కనిపించని చలనం. వెరసి ప్రజలకు కష్టకాలం.. పర్యావరణ మార్పులు, టౌన్ ప్లానింగ్ లోపాలు, పట్టణ నగర సరిహద్దు ప్రాంతాలు ఆక్రమణలు, పోరంబోకు, ఇతర ఖాళీ స్థలాలు ఆక్రమణలు, ప్రమాణాలు పక్కన పెట్టి చేపట్టే నిర్మాణాలు, తనిఖీ అధికారులు లేకపోవడం, మురుగు కాల్వలు నిర్మాణాలు సరిగా లేకపోవడం, వేస్ట్ వాటర్ వెళ్లే మార్గాలు లేకపోవడం, సరైన గ్రీనరీ, చెట్లు పెంపకం లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో చెరువులు కప్పెట్టి, నిర్మాణాలు చేపడుతున్నారు.నదీ పరీవాహక ప్రాంతాలు కూడా ఆక్రమణలు, అక్రమ త్రవ్వకాలు ఇవి అన్నియు లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా పట్టణ నగర ప్రాంతాలు ముంపునకు కారణం అవుతున్నాయి. పట్టణ నగర శివారు ప్రాంతాల్లో అతి తక్కువ ధరలకు భూములు చేజిక్కించుకున్న రియాలిటీ వ్యాపారస్తులు గేటె్‌డ కమ్యునిటీలు, విల్లాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఇండివిడ్యుయల్ హౌస్, వ్యాపార భవనాలు, కమీర్షియల్ భవనాలు వంటివి నిర్మాణం చేపట్టి , కొన్ని సందర్భాల్లో నియమనిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ అర్బన్ ఫ్లడ్స్‌కు ప్రధాన కారణాలవుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, ఎప్పుడు వానలొస్తాయో, ఎప్పుడు ఎండలు మండిస్తాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇది ప్రకృతి తప్పు కాదు.. మానవ స్వయంకృతం. ప్రకృతిని, పర్యావరణాన్ని మనం సక్రమంగా కాపాడుకోలేకపోవడమే కాదు, వాటిని ఖాతరు చేయకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుండడంతో తలెత్తిన కష్టం. ప్రకృతి విపత్తులనేవి మనకే కాదు, ప్రపంచమంతా ఒకటే. అవి మన చేతుల్లో ఉండవు. నిజమే. కానీ వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడ మొక్కటే మార్గమన్న అవగాహన లేకపోవడమే ఇన్ని అనర్థాలకు మూలం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనేక విపత్తుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. కానీ చేజేతులా పర్యావరణాన్ని మనకు మనమే దెబ్బతీసుకోవడం, ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా ఏళ్ళతరబడిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే విపత్తుల ముప్పు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా అనేక మహా నగరాల్లోనూ, పట్టణాల్లోనూ వాటి తాలూకు దుష్ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విపత్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తగు ముందస్తు ప్రణాళికలు ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలో వరదల నియంత్రణ అనేది సరిగా ఉండడం లేదని, ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా తదితర మహానగరాలు భారీ వరదల బారిన పడడడం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే అనే విషయాన్ని నిపుణుల అధ్యయనాలు కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల నివారణకు సరైన ప్రణాళికలు అమలుచేయని కారణంగానే నష్టాలు తప్పడం లేదని నీతి అయోగ్ అత్యున్నత కమిటీ తమ నివేదికలో విచారం వ్యక్తం చేసింది కూడా. అయినా ఎవరు పట్టించుకుంటున్నారు? ఇప్పటి తాజా బీభత్సాలకు ఎవరు బాధ్యులు? హైదరాబాద్‌సహా తెలంగాణలోని పలు నగరాల్లో భారీవర్షాలు కురిశాయి. ప్రజా జీవితాలను అల్లకల్లోలం చేశాయి. సరైన నీటి యాజమాన్యం, నదుల నీటిని క్రమబద్ధం చేయలేకపోవడం, వరదలను నియంత్రిం చేందుకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వంటి మానవతప్పిదాలే ఈ దుస్థితికి ప్రధాన కారణం. ప్రాణాలు పోవడానికి, కోట్లాది రూపాయల ఆస్తులు నష్టపోవడానికి కూడా మానవ నిర్లక్ష్యాన్నే ప్రధాన కారణంగా పేర్కోక తప్పదు. వదర నీటితో నగరాలు, పట్టణాలు మునగకుండా ఉండేందుకు టౌన్ ప్లానింగ్ కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. వెట్ ల్యాండ్ కమిషన్, స్పాంజ్ సిటీ కమిషన్, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిషన్ వంటి ద్వారా సరైన కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలి. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిషన్ వంటి సంస్థలను బలోపేతం చేయాలి. సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. వాతావరణ శాఖ సూచనలు సలహాలు పాటించాలి. స్థానిక సంస్థలు పూర్తి అధికారాలు, స్వేచ్ఛగా పనిచేసే ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాబోయే వంద సంవత్సరాల అవసరతలు ద్రృష్టిలో ఉంచుకుని నూతన నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్ చేసి పట్టణాలు నగరాలు ముంపు బారిన, కాలుష్యం బారిన పడకుండా అత్యాధునిక పట్టణ నగరాలు నిర్మించి, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా నూతన సకల సౌకర్యాలు ఉండే అద్భుతమైన కట్టడాలు నిర్మించడమే ప్రస్తుతం ప్రభుత్వాలు, ఇంజనీర్స్ మీద ఉన్న ప్రధాన బాధ్యత. ఇకనైనా దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ ప్రకృతి విపత్తులను నివారించుకునేందుకు శాశ్వత ప్రాతిపదికపై నిపుణుల బృందాలతో కూడిన నూతన వ్యవస్థలకు శ్రీకారం చుట్టాలి. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రకృతి, వాతావరణ శాస్త్ర పరిజ్ఞానాన్ని, అత్యాధునిక వ్యవస్థలన్నిటినీ మేల్కొల్పి, సరైన దిశానిర్ధేశం చేయాలి. ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలకు ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా, శక్తివంచన లేకుండా అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతో పాటు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ప్రజలు..అందరూ ఈ విపత్తులను నివారించుకునే కృషిలో భాగస్వాములు కావాలి. లేకపోతే, నేటి భారీ ఆస్తి నష్టాలు రేపటి ప్రాణ నష్టాలుగా మారే ప్రమాదం ఉంది.
వానొచ్చెనంటే.. వరదొస్తది..
RELATED ARTICLES