మహానగరంపై కొనసాగుతోన్న వరుణ ప్రతాపం
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం
పునరావాస కేంద్రాలకు నిర్వాసితుల తరలింపు
హుస్సేన్‌సాగర్, మూసీ తీర ప్రాంతాల్లో అప్రమత్తం
ప్రజాపక్షం/హైదరాబాద్ హైదరాబాద్ మహానగరంలో వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే భాగ్యనగరాన్ని దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. నగరమంతా పట్టపగలే చీకటి కమ్ముకుంది. ఉరుములు, మెరుపులతో హడలెత్తించింది. మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. అన్ని ప్రాంతాల్లో కురిసిన కుండపోత వానకు రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షం నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. నగర ప్రజలు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై నీరు నిల్వకుండా డిఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. వరద సహాయక చర్యల కోసం నియమించిన ప్రత్యేక అధికారులు, వర్షకాల అత్యవసర బృందాలను అప్రమత్తం చేశామని జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేశ్ కుమార్ తెలిపారు. అత్యవసర సేవల కోసం 100కు డయల్ చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. లోయర్ ట్యాంక్‌బండ్ ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ నదిపరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను బయటకు రానివ్వకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, బేగంపేట్, ప్రకాష్‌నగర్, ఉప్పల్, కొత్తపేట, సంతోష్‌నగర్, సికింద్రాబాద్, మీర్‌పేట్, రామంతాపూర్, హబ్సీగూడ, ఆర్కే పురం, సైదాబాద్, చైతన్యపురి, సరూర్‌నగర్, కొత్తపేట, చార్మినార్, ఫలక్‌నుమా, జూపార్క్, అఫ్జల్‌గంజ్, బహదూర్‌పుర, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి, మదాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, అల్వాల్, తార్నాక, కుషాయిగూడ, నాగారం, దమ్మయిగూడ, చర్లపల్లి, నల్లకుంట, అంబర్‌పేట్, ముషీరాబాద్, నారాయణగూడ, కోఠి, లక్డీకాపూల్‌లలో కుండపోతగా వర్షం కురిసింది.
మాసబ్‌ట్యాంక్ రోడ్లులో రాకపోకలకు అంతరాయం
డ్రైనేజీ పైపులైను లీకేజీతో మాసబ్‌ట్యాంక్ వెళ్లే రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. వర్షం కూడా ప్రారంభం కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రమించారు. నాగార్జున సర్కిల్ మీదుగా మాసబ్‌ట్యాంక్ వెళ్లే రహదారిపై భారీ ఎత్తున రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని జివికె మాల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ పైపులైను పొంగిపోర్లింది. దీనికి తోడు వర్షం కురుస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరమ్మతు పనులను చేపట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాసబ్‌ట్యాంక్ వైపునకు ట్రాఫిక్ మళ్లీంచారు.
వానంటేనే.. వణుకు!
RELATED ARTICLES