పాకిస్థాన్ కీలక నిర్ణయం
భారత దౌత్యవేత్త బహిష్కరణ
దౌత్యసంబంధాలను కుదించిన పొరుగుదేశం
ఇస్లామాబాద్ : జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేయడంతోపాటు రాష్ట్రహోదాను తొలగించి, అన్యాయంగా విభజించడం పట్ల పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి తీవ్రంగా స్పందించింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని ఆ దేశం నిర్ణయించింది. అలాగే ఇస్లామాబాద్‌లో భారత దైత్యవేత్త అజయ్ బిసారియాను బహిష్కరించింది. తక్షణమే దేశం వదిలివెళ్లిపోవాలని ఆదేశించింది. భారత్‌తో దౌత్య సంబంధాలను పూర్తిగా కు దించివేసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా ను ఎత్తివేయడం ‘ఏకపక్షం’గా, ‘అన్యాయం’ గా అభివర్ణించింది. భారత వైఖరిని సహించేది లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సి) కీలక సమావేశం బుధవారంనాడు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన జరిగింది. అగ్రశ్రేణి పౌర, సైనిక అధినాయకత్వం ఈ సమావేశానికి హాజరైంది. ఈ సమావేశానంతరం పాకిస్థాన్ విడుదల చేసిన ప్రకటనలో, భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అలాగే ఇరుదేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఇతర ‘ద్వైపాక్షిక ఏర్పాట్లు’ను కూడా సమీక్షించాలని నిర్ణయించింది. “మా రాయబారులు న్యూఢిల్లీలో ఇంకెంతో కాలం ఉండబోరు. ఇస్లామాబాద్‌లో ఉన్న భారత రాయబారులను వెనక్కి పంపిస్తున్నాం” అని పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ పాక్ టీవీలకు ఇచ్చిన లైవ్ ఇంటర్యూలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని అధికరణ 370ని భారత్ సోమవారంనాడు రద్దు చేసిన విషయం తెల్సిందే. పైగా రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ (లద్దాఖ్)లుగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. భారత్‌కు ఇది చరిత్రాత్మక నిర్ణయం కావచ్చని, కానీ ప్రపంచ చరిత్రలో ఇదొక మాయని మచ్చ అని పాకిస్థాన్ అభివర్ణించింది. భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో భారత రాయబారిగా పనిచేస్తుండగా, పాక్ రాయబారి మొయిన్ ఉల్ హక్ ఇంకా న్యూఢిల్లీలో ఇంకా బాధ్యతలు చేపట్టాల్సివుంది. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని పాక్ ఎన్‌ఎస్‌సి సమావేశం సుదీర్ఘకాలంపాటు చర్చించింది. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిని కూడా సమీక్షించింది. భారత ప్రభుత్వం ఏకపక్షంగా, అన్యాయంగా చేపట్టిన చర్యల వల్ల భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం తలెత్తిందని అభిప్రాయపడింది. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించకపోగా, సమస్యను మరింత జఠిలం చేసిందని భారత ప్రభుత్వంపై విరుచుకుపడింది.