నేటి రాఫెల్ ఒప్పందంపై జెపిసి దర్యాప్తుకు పట్టుపడతామన్న కాంగ్రెస్
జాతీయ అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం: ప్రధాని
అఖిలపక్ష సమావేశంలో భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ: శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో జాతీయ ప్రాముఖ్యతకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశంలో అన్నారు. పార్లమెంట్ రాఫెల్ జెట్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) దర్యాప్తుకు ప్రతిపక్షం ఒత్తిడి చేయగలదని కాంగ్రెస్ తెలిపింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయలో చట్టం తేవాలని అఖిలపక్ష సమావేశంలో శివసేన అన్నది. ఈ అఖిలపక్ష సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ నుంచి వివిధ పార్టీలకు చెందిన సభా నాయకులు హాజరయ్యారు. వివిధ పార్టీలు లేవనెత్తే విషయాలను ప్రభుత్వం స్వీకరిస్తుందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంటు సజావుగా పనిచేయడానికి ప్రభుత్వం, ప్రతిపక్షం సహకరించుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. రెండు గంటలపాటు జరిగిన అఖిలపక్ష సమావేశానంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ విలేకరులకు వివరణలు ఇచ్చారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సానుకూలతను వ్యక్తం చేశాయన్నారు. నియమానుసారం ఉన్న అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయోధ్య వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన బిల్లు ప్రభుత్వం తేనంత వరకు పార్లమెంటు సమావేశాలను సాగనివ్వబోమని శివసేన ప్రతినిధి చంద్రకాంత్ ఖైర్ చెప్పారు. లోక్‌సభలో శివసేనకు 18 మంది సభ్యులు, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. శివసేన డిమాండ్‌కు తోమర్ ఎలాంటి జవాబు ఇవ్వలేదు. అఖిలపక్ష సమావేశానంతరం కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ‘ప్రతిపక్షం రాఫెల్ జెట్ ఒప్పందంపై జెపిసి దర్యాప్తును కోరుతుంది. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఆర్‌బిఐ స్వయం ప్రతిపత్తి సహా అనేక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతుంది’ అన్నారు. రాజకీయ కక్షసాధింపులకు ప్రభుత్వం సిబిఐ, ఇడి వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్, టిడిపి, టిఎంసి ఇటీవల ఆరోపించాయి. పార్లమెంటు సమావేశంలో ఆర్‌బిఐ స్వయం ప్రతిపత్తి అంశాన్నిలేవనెత్తుతామని ఆజాద్ అన్నారు. అఖిలపక్ష సమావేశానంతరం కొన్ని గంటలకే ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఇవిఎం)ల నిర్దుష్టత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, ఆజాద్‌తో కలసి లేవనెత్తారు.ఎలాంటి పరిశీలన జరపకుండా బిల్లులను తొందరపడి ప్రవేశపెట్టకూడదని తృణమూల్ కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశంలో తెలిపింది. సంస్థలు కుంటుపడ్డం, ఆర్థికవ్యవస్థలో గందరగోళం, ఇంధన ధరలు పెరగడం, నిరుద్యోగం వంటి విషయాలను కూడా టిఎంసి లేవనెత్తింది. డిసెంబర్ 24 నుంచి జనవరి 1 వరకు పార్లమెంటు సమావేశాలను రద్దుచేయాలని సమావేశంలో పాల్గొన్న అనేకమంది సూచించారని, ఇది సాంప్రదాయం అని పేర్కొన్నారని టిఎంసి వర్గాలు తెలిపాయి. బిజెపి పాలిత యుపిలో రైతులను దోచుకుంటున్నారని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో దళితులు, వెనుకబడినవారు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంలేదని అన్నారు. రాజ్యసభలోని అన్ని పార్టీల సభాపక్షం నాయకుల సమావేశాన్ని కూడా రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నిర్వహించారు. రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేందుకు కృషిచేయాలన్నారు.