చెప్పులు లేకుండానే నడక : చెట్ల కిందనే వంటలు
వలస కూలీల తరలింపులో ప్రభుత్వాలు విఫలం
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : బతుకుదెరువు కోసం వలస వెళ్లడం ఈ నాటిది కాదు. స్వాతంత్య్రం రాక ముందు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లి జీవనోపాధిని వెతుక్కోవడం జరుగుతూనే ఉంది. స్వా తంత్య్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగంలో సాధించిన పురోగతి, వ్యాపార వాణిజ్య రంగాల్లో వచ్చిన మార్పులు, ఇతరత్రా వలసను ప్రోత్సహించాయి. కరువును జయించడంలో పాలకుల వైఫల్యం కూడా వలసలను మరింతగా ప్రోత్సహించింది. నైపుణ్యం కలిగిన పని నుండి నైపుణ్యత అవసరం లేని రోజు వారీ కూలీల వరకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్తూనే ఉన్నారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు లక్షల మంది వలస వెళితే తెలంగాణ రాష్ట్రంలో బతుకు దెరువు కోసం లక్షలాది మంది వచ్చి జీవనం గడుపుతున్నారు. కరోనా మహమ్మారి వలస జీవుల జీవితాలకు భారీ కుదుపునిచ్చింది. దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉండడంతో మొత్తం ఉపాధి కోల్పోయారు. జీవితం దినదినగండమైంది. ఉపాధి లేక బతుకు భారమైంది. దీంతో తమవారిని చూడాలన్న కోరిక బలంగా ప్రబలింది. స్వస్థలాలకు చేరాలన్న ఆతృత మొదలైంది. వివిధ రాష్ట్రాలలో ఉన్న లక్షలాది మంది కూలీలు స్వస్థలాలకు బయలుదేరారు. కూలీల మనోగతాన్ని పసిగట్టిన ప్రభుత్వాలు వలస కూలీలకు స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భౌతిక దూరం పాటించే విధంగానే చర్యలు తీసుకుంటూ స్వస్థలాలకు చేరుస్తామన్న ప్రకటనలు ప్రకటనలుగానే మిగిలిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు, హైదరాబాద్ ఇంకా దాని పరిసరాల నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వసల కూలీలు కాలి నడకన బయలుదేరారు. ఖమ్మం, వరంగల్లు, కరీంనగర్, ఉమ్మడి జిల్లాల్లో అంతర్రాష్ర్ట రహదారుల వెంట ఎక్కడ చూసినా బారులు తీరిన వలస కూలీలు కన్పిస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలే కదిలిపోతున్నాయి. సంకన బిడ్డను ఎత్తుకుని నెత్తిన ముఠాలు పెట్టుకుని కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా మహిళలు నడుస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలకు కాళ్లు బొబ్బలెత్తుతున్నా వారు నడుస్తున్న తీరు చూపరులను సైతం ఆలోచింపజేస్తుంది. ఖమ్మంజిల్లాలో శుక్రవారం దారెంట కనబడిన వందలాది మంది కూలీలను ప్రజాపక్షం కదిలిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో కళ్లవెంట రాలుతున్న కన్నీటి చుక్కలే సమాధానాలు అవుతున్నాయి. వీరి బాధను చూడలేని కొందరు పోలీస్ అధికారులు వాహనాలను ఎక్కించి కనీసం 10 కిలో మీటర్లు అయిన తీసుకుపోండి అంటూ వాహనదారులను బతిమిలాడడం గమనిస్తే వలస కూలీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అవగతమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల కోసం రైళ్లు ఏర్పాటు చేశాం, బస్సులు ఏర్పాటు చేశాం స్వస్థలాలకు చేరుస్తాం అన్న మాటలు మాటలకే పరిమితమయ్యాయి. వేల సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకున్న ఏ ఒక్క కూలీని స్వస్థలాలకు చేర్చిన ఘటన లేదు. ఆందోళనలు ఉధృతంగా సాగినప్పటికీ పాలకుల్లో చలనం కలగకపోవడం అత్యంత దారుణం. నాలుగు రోజుల కిందటే మహారాష్ట్రకు రైలు వస్తుందంటూ చెప్పిన అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితి. ఇప్పటికైనా వలస కూలీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్లక్ష్య వైఖరిని వీడనాడి త్వరితగతిన స్వస్థలాలకు చేర్చే ప్రణాళికలను వేగరపర్చాలి. అంతేకాదు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా అది నిగూడంగానే దాగి ఉందన్న వాదన సర్వత్రా విన్పిస్తుంది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తూ కనీసం భౌతిక దూరం పాటించకుండా వెళ్తున్న వీరి ప్రయాణం ప్రమాదకరమేనన్న విషయాన్ని కూడా పాలకులు గ్రహించడం లేదు. ప్రజారోగ్యం ప్రత్యేకించి కరోనా కట్టడి నేపథ్యంలో మానవీయ కోణంలో స్పందించాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.
వలస వెతలు
RELATED ARTICLES