ప్రజాపక్షం / హైదరాబాద్ : లాక్‌డౌన్‌లో వలస కార్మికులను ఆదుకోవడం, వారిని స్వస్థలాలకు చేర్చడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా మంగళవారం మఖ్దూంభవన్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, కార్యవర్గ సభ్యులు డాక్టర్ సుధాకర్, ఐప్సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవిఎల్, బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగం తదితరులు భౌతిక దూరాన్ని పాటిస్తూ పాల్గొన్నారు. వారంతా నల్లజెండాలను చేతబట్టుకుని ‘వలస కార్మికులను ఆదుకోవాలి’, ‘కరోనా ముసుగులో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలి’, ‘పేదలు, చేతివృత్తిదారులకు ఆర్థిక సహాయం చేయాలి’ అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఆ కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి : నారాయణ
ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో నడుచుకుంటూ పోతూ దారిలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు రూ. కోటి పరిహారంగా ఇవ్వాలని డాక్టర్ నారాయణ డిమాండ్ చేశారు. చనిపోయిన వలస కూలీలవి మామూలు మరణాలు కావని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. కరోనాను అడ్డం పెట్టుకుని రక్షణ రంగం, బొగ్గు, ఇస్రో వంటి దేశం గర్వించే ప్రభుత్వ రంగ సంస్థలకు ఎర్రతివాచీ పరిచేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. అసలు ఇబ్బందుల్లో ఉన్న వారిని వదిలేసి, ప్రైవేటుకు వంత పాడుతున్నారని, డెకాయిట్‌లకు మోడీ ప్రభుత్వానికి తేడా లేదని చెప్పారు. ఒక వేళ ప్రైవేటీకరణ చేయాలనుకుంటే కొవిడ్ వ్యవహారం అయిపోయాక పార్లమెంటులో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతి వలస కార్మికుల కుటుంబానికి రూ.10వేలు, 20 కిలోల బియ్యం ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.
కెసిఆర్ ప్రధాన పాత్ర పోషించాలి : చాడ
కరోనా ప్యాకేజీ వట్టి డొల్ల, పచ్చి మోసం అని సిఎం కెసిఆర్ అన్నారని, ఫెడరల్ అధికారాలు, హక్కులను లాక్కుంటున్న కేంద్రంపై పోరుకు కెసిఆర్ ప్రధాన పాత్ర పోషించాలని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను వ్యతిరేకించాలని, సింగరేణి వంటి బంగారు బాతును కూడా అమ్ముతున్నారని, డిస్కామ్‌లను అమ్ముతామంటున్నారని, వీటిపై స్పందించాలన్నారు. సిఎం కెసిఆర్ చెప్పిన మాటలను నిలబెట్టుకుంటూ తక్షణమే లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులతో కలిసి కేంద్రం మెడలు వంచే పోరాటలకు సిపిఐ అండగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ మొండి చేయి చూపినా, రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో రేషన్ కార్డు లేకున్నా పేదలకు బియ్యం ఇవ్వాలని, కొంత ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది వలస కార్మికులు ఉంటే, ఎనిమిది కోట్లమందే ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఫలితంగా రోడ్లపై, పట్టాలపై నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదాలు బారిన పడి, తిండి లేక సుమారు 140 మంది వలస కార్మికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి మానవత్వం కూడా లేదని, కనీసం రూ.10వేలు ఇవ్వలేదా? అని ఆయన నిలదీశారు. ఆటోడ్రైవర్లు, క్షురకులు, చిరువ్యాపారులకు రెండు నెలలుగా వ్యాపారం లేదని, వారిని ఆదుకునేందుకు ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వానికి మనసు రాలేదని విమర్శించారు.
ఉపరాష్ట్రపతికి లేఖ
పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సమంజసమేనా అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును సిపిఐ జాతీయకార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనకు మంగళవారం లేఖ రాశారు. “కొవిడ్‌కు, ప్రభుత్వ రంగ సంస్థలపై వేటుకు ఏమైనా సంబంధం ఉందా? జాతీయ అంగీకృత విధానం పబ్లిక్ సెటక్టార్‌ల, మార్పులు చేయదలుచుకుంటే పార్లమెంటులో చర్చ జరగాలి.పార్లమెంటులో ఎటూ మందబలం ఉంది కాబట్టి తీర్మానం నెగ్గుతుంది. అలాకాకుండా లాక్‌డౌన్ పదిరోజుల్లో ముగుస్తుండగా, అంతవరకు ప్రభుత్వం ఆగలేపోయిందా?” అని లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాది, పార్టీలకు అతీతంగా ఉన్నందునే ఉపరాష్ట్రపతి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువస్తున్నట్లు లేఖలో నారాయణ ప్రస్తావించారు.
వలస కార్మికులను ఆదుకోవాలి
RELATED ARTICLES