ప్రజాపక్షం/న్యూస్‌నెట్‌వర్క్ నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. లక్షా 49 వేల 995 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. నీటి మట్టం 49 టిఎంసిలు దాటింది. భారీ వర్షాలు, ఎగువన ప్రవాహంతో వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మరో ఐదారు రోజుల్లో ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. నిర్మల్ జిల్లాలో కడెం ఉప్పొంగుతుండటంతో 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శుక్రవారం ఉదయం వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో 18 గేట్లు ఎత్తేందుకు అధికారులు యత్నించినా.. సాంకేతిక సమస్యలతో కొన్ని ఎత్తడం ఇబ్బందికరమైంది. పని చేసిన 14 గేట్ల ద్వారా ఎగువ నుంచి వచ్చిన వరదను కిందికి వదులుతున్నారు. ఇదే జిల్లాలో స్వర్ణ జలాశయం 2 గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గడ్డెన్న జలాశయానికి పెద్ద ఎత్తున వరదను అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. కడెం జలాశయం గేట్లు ఎత్తడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. కడెంతో పాటు మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పుష్కర ఘాట్ల మీదుగా నీరు నిలవగా.. గోదావరి గుండా భారీగా ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు చేరుతుంది. ధర్మపురి వద్ద పరిస్థితులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. తీర ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ధర్మపురి క్షేత్రానికి భక్తుల రాక దృష్ట్యా
ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వరకు గోదావరిలోకి ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదుల నుంచి అధిక వరద రాగా.. గురువారం నుంచి ప్రధాన గోదావరికి ప్రవాహం మొదలైంది. కడెం ప్రాజెక్టు నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు, ఎల్లంపల్లి పరివాహక ప్రాంతం నుంచి మరో లక్ష క్యూసెక్కులు రావడంతో ఎల్లంపల్లిలోని 25 గేట్లను ఎత్తారు. ఎల్లంపల్లిలోకి 2.50 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో 25 గేట్లు ఎత్తి మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన సుందిళ్ల, అన్నారం బ్యారేజీల గేట్లనూ ఎత్తేశారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని బ్యారేజీల్లోని నీటి మట్టాలను తగ్గించి, దిగువకు అధిక నీటిని వదిలేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద పార్వతీ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎప్పటికప్పుడు బ్యారేజ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు.. అదేస్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి 60 గేట్లు ఎత్తి నిరంతరాయంగా వచ్చిన వరదను వచ్చినట్లుగా పంపుతున్నారు.
త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నుంచి భారీగా వరద వచ్చి చేరుతుంది. పుష్కరఘాట్‌ల మెట్లపై నుంచి నదీ ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాజెక్టులో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి వరద భారీగా వస్తుంది. పుష్కరఘాట్‌ల వద్ద జలకళ సంతరించుకుంది. త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 11.580 మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సందర్శించారు. వెనక జలాలతో ప్రజలు ముంపు బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ముంపులోనే వనదుర్గా మాత ఆలయం
దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయం, జనమేజయుని సర్పయాగస్థలిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం నాలుగో రోజు కూడా జలదిగ్బంధంలోనే ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ఉన్న మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీటితో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీనికి తోడు పటాన్‌చెరు సమీపంలోని నక్కవాగు నీరు కూడా మంజీరాతో కలవడంతో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వనదుర్గా ప్రాజెక్టు నుంచి 12,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నీరు విడుదల చేయడంతో దిగువన ఉన్న వనదుర్గా ఆలయం ముందున్న నదీపాయ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయ ఇఒ, అర్చకులు ప్రధాన ఆలయాన్ని తాత్కాలికంగా మూసేసి.. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్ఠించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత మళ్లీ విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించి.. పూజలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు.
నిండు కుండలా సింగూరు
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుపై పెట్టుకున్న ఆశలకు జీవం పోసినట్లు ప్రాజెక్టుకు మళ్లీ జలకళ సంతరించుకుంది. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో డ్యాంలోకి భారీగా నీరు వచ్చి చేరుతొంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు 2,136 టీఎంసి వరకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 9,470 ఇన్ ప్లో కొనసాగుతుండగా జౌట్ ప్లో 365 క్యూసెక్యులుగా కొనసాగుతుంది. వానాకాలం ప్రారంభం దశలోనే ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపోస్తుంది. దీంతో రైతులు ,ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20,564 టీఎంసీల వరకు నీటి నిలువ ఉంది.
భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి నీటిమట్టం..
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39 అడుగులకు తగ్గింది. శుక్రవారం 43 అడుగులు దాటి ప్రవహించగా.. సాయంత్రానికి 42 అడుగులకు చేరుకోవటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. క్రమంగా తగ్గుతూ.. శనివారం ఉదయం 6 గంటలకు 39.8 అడుగుల మేర ప్రవహించిన గోదావరి మధ్యాహ్నానికి 39.4 అడుగుల వద్ద తగ్గింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు నుంచి నీటిని కొంతమేర గోదావరిలోకి వదులుతున్నారు. ఇంద్రావతి, ప్రాణహిత నుంచి కొనసాగుతున్న ప్రవాహానికి తోడు ఎగువన ఎల్లంపల్లి గేట్లు ఎత్తటంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు.
వర్షం తగ్గినా…ప్రాజెక్టులకువరదపోటు
RELATED ARTICLES