HomeNewsBreaking Newsవరి సాగు వద్దంటే ప్రత్యామ్నాయమేది..?

వరి సాగు వద్దంటే ప్రత్యామ్నాయమేది..?

చెరువులు, కుంటల కింద సాగుచేసే పంటలేవి..?
అయోమయ పరిస్థితిలో అన్నదాతలు
ప్రజాపక్షం/వరంగల్‌ బ్యూరో : యాసంగిలో వరి ధాన్యం కొనేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరాఖండీగా ప్రకటించిన నేపథ్యంలో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై అయోమయం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం రైతులను కలవరపరుస్తోంది. ఈ నిర్ణయం వరి సాగుపై ఆధారపడిన వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. ప్రత్యామ్నాయ సాగుపై చాలా మంది రైతులు ఆసక్తి చూపడం లేదు. మరో వైపు ప్రత్యామ్నాయ పంటలపై ముందస్తు ప్రణాళికను ఖరారు చేయలేదు. దీంతో యాసంగిలో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ముఖ్యంగా చెరువులు,కుంటల కింద వరి మాత్రమే వేస్తారు. వరి కాకుండా ఏయే పంటలు వేస్తే ప్రయోజనకరమో రైతులకు తెలియక వారు సతమతమవుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసినా బురద పొలంలో సాగు కష్టమే. మరోవైపు ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, మద్దతు ధరలు, లాభాల గురించి రైతులకు అవగాహన కల్పించలేక పోతున్నారు. వరి సాగు వద్దని ప్రచారం చేయడం తప్ప, ప్రత్యామ్నాయ పంటల వల్ల ప్రయోజనాలేమిటో అధికార యంత్రాంగం స్పష్టంగా చెప్పడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రత్యామ్నాయ పంటలపై కొంత మంది రైతులు దృష్టి పెట్టగా మరికొందరు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వానా కాలంలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం చేతికి వస్తోంది. ధాన్యం అమ్ముకునేందుకు పూర్తిస్థాయిలో కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించుకోలేక కల్లాల వద్దే కుప్పలు పోసి నేటికీ జాగారం చేస్తున్నారు. అక్టోబరు రెండో వారంలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పినా అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లో కొనుగోళ్లు పూర్తి స్థాయిలో చేపట్టకపోవటంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే యాసంగి కష్టాలు మరింత క్లిష్టంగా ఉండొచ్చని రైతు లు ఆందోళన చెందుతున్నారు. వరి సాగు చేసిన పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు ఎలా పండుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు నచ్చిన పంటను సాగు చేసుకునేలా ప్రొత్సహించాలని, ప్రత్యామ్నాయ పంటలపై, విత్తనాలు, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.

క్రాప్‌ హాలిడే దిశగా…
ప్రజాపక్షం/మహబూబ్‌నగర్‌ బ్యూరో : యాసంగి సీజన్‌ దాటిపోతున్నా రైతులు నేటికి వరి నాట్ల వైపు కానీ, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు కానీ దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద, చెరువులు, కాలువల కింద మొత్తం పది లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌ నవంబర్‌ నాటికి వరి నాట్లు వేయాల్సి ఉండగా, ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనల నేపథ్యంలో రైతుల్లో అయోమయం నెలకొని నేటికీ ఏలాంటి సాగు పనులు చేపట్టలేదు. దీంతో ఈ ఏడాది పంటలకు విశ్రాంతి ప్రకటించే దిశగా రైతులు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నూనె గింజల సాగుకు పాలమూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అనువుగా ఉన్నాయని నిపుణులు చెప్పినప్పటికీ దానికి సంబంధించిన పంటల సాగుకు విత్తనాల కొరత రైతులను వేధిస్తుంది. ఆయిల్‌ ఫామ్‌ తోటలను జిల్లాలో విస్తారంగా పండించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తన జిల్లాలో రైతులను చైతన్యం చేసినా ఆయిల్‌ ఫామ్‌ మొక్కల కొరత మూలంగా వారు ముందుకు రావడం లేదు. భారీగా సబ్సిడీలు ఇస్తామని పాలమూరు రైతాంగం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నా అందుకు అనుగుణంగా విత్తనాలు మొక్కలు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్నది. గతంలో మాదిరిగా రైతాంగం ఆరుతడి పంటలపై ఆసక్తి చూపడం లేదు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతాంగం దృష్టి సారించాలని అధికారులు చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా విత్తనాలు సమీకరించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వినబడుతున్నాయి. ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్మించినా రైతన్నల అభివృద్ది దిశగా ఇంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని రైతులు అంటున్నారు. దీంతో ఈ ఏడాది రైతులలో నెలకొన్న అయోమయం దృష్ట్యా ‘క్రాప్‌ హాలిడే’గా భావించాల్సి ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments