2019 పంట సీజన్‌లో క్వింటాల్ వరి ధర రూ. 1,815
కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం వరి కనీస మద్దతు ధరను 3.7 శాతం పెంచింది. అంటే క్వింటాల్‌కు రూ.65 పెంచింది. దీంతో వరి క్వింటాల్ ధర 2019 పంట సీజన్ లో రూ. 1,815 కానుంది. ఇదిలావుండగా నూనె గింజలు, పప్పు, ఇతర ధాన్యాల ధరలు కూడా గణనీయంగా పెంచింది. క్వింటాల్ జొన్నలకు రూ.120, రాగికి రూ. 253, కందికి రూ. 215, పెసరకు రూ. 75, మినపప్పుకు రూ. 100 చొప్పును 2019 పంట సీజన్‌లో కనీస మద్దతు ధరను కేబినెట్ పెం చింది. క్వింటాల్ వేరుశనగకు రూ.200, సోయాబీన్‌కు రూ.311 చొప్పున కనీస మద్దతు ధరను పెంచింది. దీనికి తోడు మధ్యరకం పత్తి క్వింటాల్‌కు రూ. 105, పొడుగు పత్తికి రూ. 100 చొప్పున కనీస మద్దతు ధర ను ప్రభుత్వం పెంచింది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాలపై సమావేశమైన కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. జూన్‌లో నైరుతి రుతుపవనాల వర్షాలు 33 శాతం కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో రైతులకు మేలు చేసే విధంగా వరి కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. ఇదిలావుండగా జులై, ఆగస్టులో వానలు బాగానే పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఖరీఫ్ పంటలో ప్రధానమైన వరి నాట్లను నైరుతి రుతుపవనాల సమయంలోనే చేపడుతుంటారు. అయితే ఈసారి వానలు ఆలస్యమైనందున వారం కింద టి వరకు ఖరీఫ్ పంట విత్తడం 146.61 లక్షల హెక్టార్లకు తగ్గిందని ప్రభుత్వ డేటా పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 162.07 లక్షల హెక్టార్లుగా ఉంది. వరి కనీస మద్దతు ధర పెంపు ప్రకటనను వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం చేశారు. 2022 నాటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కనీస లాభాన్ని 50 శాతం పెంచేందుకు చూస్తున్నామని వ్యవసాయ మంత్రి తెలిపారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర యంత్రాం గం ధర గ్యారంటీని ఇస్తుందన్నారు. రైతుల పంటలకు మద్దతు ధరను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సిఐ), ఇతర ప్రభుత్వ సంస్థలు అంటే… నాఫెడ్, ఎస్‌ఎఫ్‌ఎసి వంటివి అందించడం కొనసాగిస్తాయన్నారు. పత్తికి మద్దతు ధరను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) ఇస్తుందన్నారు.