1986 తరువాత గోదావరి నదికి 75.6 అడుగుల ప్రవాహం
చరిత్రలో రెండోసారి భద్రాద్రి వారధిపై వాహనాలకు బ్రేక్!
ఉత్తర తెలంగాణను వణికిస్తున్న వర్షాలు
ప్రజాపక్షం / భద్రాచలం/ న్యూస్‌నెట్‌వర్క్ గోదావరి వరద బీభత్సాన్ని సృష్టిస్తోంది. దీంతో గోదావరి పరివాహక ఏజెన్సీ ప్రాంతం వరద ముంపులో ఉంది. భద్రాచలం వద్ద 65 అడుగు నీటి మట్టం నమోదైంది. ఈ వరద మరింత పెరిగి 75 నుండి 80 అడుగులకు ప్రవహించే అవకాశం ఉన్నట్లు అధికారులు పకటించారు. భద్రాచలం వద్ద గోదావరిలో 19.04లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం 61.80 అడుగులకు చేరి కొనసాగుతున్నది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద 1976 నుంచి గోదావరి నది 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా ఇవాళ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి వంతెనను మూసివేశారు. భారీ వరద నేపథ్యంలో వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కాగా భద్రాచలం వంతె న చరిత్రలో రాకపోకలు నిలిపివేయడం ఇది రెండోసారి. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు. గురువారం సాయం త్రం 5 గంటలకు ఆంక్షలు అమలులోకి రాగా 48 గంటల పాటు కొనసాగనున్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. గడిచిన 70 ఏళ్లలో గోదావరి నది తుదిప్రమాద హెచ్చరికను దాటి 30 సార్లు ప్రవహించింది. అదే విధంగా గడిచిన 20 ఏళ్లుగా పరిశీలిస్తే 12 సార్లు మూడో ప్రమాదహెచ్చరికను దాటి గోదావరి నది ప్రవహించిది. గోదావరి వరదల కారణంగా జనజీనం అస్తవ్యస్తంగా మారింది. ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో శరణార్థులు తల దాచుకుంటున్నారు. ఆ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాలు, నిత్యవసరాలు కరువయ్యాయి. వ్యాపారులు అదునుగా భావించి సరుకుల ధరలు అమాంతం పెంచేశారు. కూరగాయలకు కృత్రిక కొరత సృష్టించి అందినకాడికి దోచుకుంటున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతం అతలాకుతలం
ఖమ్మం: గోదావరి పరివాహక ప్రాంతం అతలాకుతలమవుతుంది. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలోని ఎళ్ళు, ఊళ్ళను గోదారి ఏకం చేస్తున్నది. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరద చుట్టు ముట్టింది. కూనవరం, దుమ్ముగూడెం వెళ్లే రహదారులు జలమయమయ్యాయి. గురువారం సాయంత్రం నుంచి బ్రిడ్జి పై రాకపోకలు నిలిపి వేయడంతో భద్రాచలంకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తేగిపోయాయి. వందేళ్ల చరిత్రలో జూలై మాసంలో ఇంతటి వరదలు ఎప్పుడు రాలేదు. గోదావరి నదిపై ఎగువ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులు పొంగి పొర్లుతుండడం, గోదావరి ఉప నదులకు సైతం భారీగా వరద వస్తుండడంతో పరివాహక ప్రాంతంలో కనుచూపు మేర ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. గోదావరి వరదతో ఏజెన్సీ జన జీవనం స్తంభించింది. పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడుతో పాటు ఆంధ్రాలో విలీనమైన చింతూరు, విఆర్‌పురం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను వరద చుట్టు ముట్టింది. పినపాకలో చింతలబయ్యారం పూర్తిగా నీట మునిగింది. మణుగూరులో చిన్నరాయిగూడెం, అశ్వాపురం మండలంలో అమ్మగారిపల్లి బంజర సహా పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మండల కేంద్రమైన బూర్గంపాడులోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చర్ల మండలంలో తెగల గ్రామం పూర్తిగా నీట ముగినింది. పర్ణశాల, భద్రాద్రి రామయ్య పరిసరాలు వరద నీటిలోనే ఉన్నాయి. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాలా గ్రామాలకు 48 గంటలుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అమ్మగారిపల్లి (అశ్వాపురం) వద్ద గల సీతారామ ప్రాజెక్టు మల్టిపుల్ ప్రాజెక్టు నీట మునిగింది. మణుగూరులోని భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ (బిటిపిఎస్) లోకి వరద నీరు చేరింది. బుధవారమే బొగ్గు నిల్వ ప్రాంతాన్ని ముంచిన గోదావరి నేడు మరింత ఎగబాకింది. శబరి నదికి వరద పోటెత్తింది. అటు ఇటు రెండు కిలోమీటర్ల మేర శబరి ప్రవహిస్తుంది. కూనవరం బ్రిడ్జికి వరద నీరు అనుకుని ప్రవహిస్తుంది.
సముద్రాన్ని తలపిస్తున్న గోదావరి
కాళేశ్వరం: గోదావరి బేసిన్‌లో ని ఎగువ ప్రాంతాల ప్రాజెక్టుల నుండి పూర్తి స్థాయి గేట్లు ఎత్తి వరద ఉదృతిని గోదవారిలో తరలించడంతో కాళేశ్వరం వద్ద గోదావరి మునుపెన్నడూ చూడని విధంగా నాలుగు వైపులా మహోగ్ర రూపందాల్చి జల తాండవం చేస్తూ మహా సముద్రాన్ని తలపించేలా మారింది. కాళేశ్వరంలోని గోదావరి తీరానికి వెళ్లే ప్రధాన రహదారిపై వరద ఉదృతి చేరి సుమారు కిలోమీటర్ మేర నీరు పోటెత్తింది. దీనిలో భాగంగా కాళేశ్వరం రెడ్ అలర్ట్ ప్రభావంతో కొనసాగుతంది. కాళేశ్వరం గ్రామానికి సమీపంలోని పూస్కుపల్లి గ్రామానికి వరద ఉదృతి పొటెత్తి వరద నీరు చుట్టు చేరడంతో స్థాళనిక ప్రజలు జలద్రిగ్బందంలో చిక్కిపోయారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ భవేష్‌మిశ్రా ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం సంఘటన ప్రాంతానికి చేరుకుని ఎన్‌డిఆర్‌ఎఫ్ పర్యవేక్షణ బృందాల సహాయం కోసం ఎదుదరు చూస్తున్న పుస్కుపల్లి గ్రామస్థులను పడవల ద్వారా సురక్షింతంగా ఒడ్డుకు చేర్చి కాళేశ్వరంలోని పునరావాస కేంద్రానికి చేర్చారు.
నీటమునిగిన ఓపెన్ కాస్ట్‌లు…నిలచిపోయిన 9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
-రామìరి: భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓపెన్ కాస్టులు జలమయవడటంతో సింగరేణి వ్యాప్తంగా దాదాపు 9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్‌జి- డివిజన్ పరిధిలో గల ఓసిపి ఓసిపి రోజుకు 13 వేల టన్నులు బొగ్గును వెళికి తీయాల్సి ఉండగా ఒక బొగ్గు పెల్లకూడా బయటకు రాలేదు. మిగిలిన 17 డివిజన్‌లలో కూడా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయి రూ.20 కోట్ల మేరకు సంస్థకు నష్టం వాటిల్లడం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వర్షాలు కురవడంతోనే బొగ్గు ఉత్తత్తికి ఆటంకం ఏర్పడం జరిగిందని డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వర్షాకాలంలో చేపట్టవలసిన రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ కుండపొత వర్షానికి ఓపెన్‌కాస్టుల్లో నీరు భారీగా చేరిందన్నారు. ఓసిపి గనుల్లో చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జల దిగ్బంధంలో మంథని
మంథని : భారీ వర్షాలు, గోదావరి వరదలతో మంథని డివిజన్ కేంద్రం జల దిగ్బంధనంలో చిక్కుకుంది. గోదావరికి ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం, ఎల్లంపల్లి గెట్లు ఎత్తి దిగువకు నీరు వదలడంతో గోదావరి, బొక్కలవాగులో వరద నీరు చేరి మంథని పట్టణాన్ని చుట్టుముట్టింది. మంథని మున్సిపల్ పరిధిలోని లైన్‌గడ్డ, బోయినిపేట, బర్రెకుంట, ముత్యాలమ్మ గూడెం, దొంతుల వాడ, సుభాష్‌నగర్, మర్రివాడలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మంథని పురపాలక సంఘం, పోలీస్టేషన్, సమీకఋత బాలుర వసతి గృహం, ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లోకి వరద నీరు చేరింది. అర్దరాత్రి ఇండ్లలోకి నీరు రావడంతో సమాచారం తెలుసుకున్న అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రజలు ప్రణాలు అరచేతిలో పెట్టుకొని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు మంథని గోదావరి తీరంలో ఉన్న గౌతమేశ్వర ఆలయ పూజారులు, గోదావరిలో చాపల వేటకు వెల్లే మత్స్యకారులు, లైన్‌గడ్డలో 50 మంది, సూరయ్యపల్లి మూలమలుపు వద్ద ఉన్న జాండీర్ ట్రాక్టర్ షోరూమ్ వద్ద 16 మంది వరదల్లో చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మర్రివాడలో నివాసం ఉంటున్న సుమారు 40 మంది వరదల్లో చిక్కుకోగా అధికారులు స్పందించకపోవడంతో స్థానిక యువకులు ధైర్య సాహసాలతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మర్రివాడలోని మూడు నెలల పసిపాపను గంపలో పెట్టి వరదల్లోంచి ఓడ్డుకు చేర్చిన యువకులను పలువురు అభినందించారు.
ముంచెత్తిన వరద గోదావరి
ములుగు: ములుగు జిల్లాను వరదలు మంచెత్తున్నాయి. గోదావరికి అతిభారీగా వరద నీరు వచ్చి చేరుతుంది గోదావరి పరివాక పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పునరావాస కేంద్రాలకు వేలాది మంది బాధితులు తరలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోదావరి పరివాహక పల్లెలు ప్రమాదం అంచున ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ములుగు జిల్లా వ్యాప్తంగా జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. జనం ఇండ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ములుగు జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. గోవిందరావుపేట మండలంలో లక్నవరం, గుండ్లవాగు ప్రాజెక్టులకు మత్తడి పడడంతో పాటు ఉదృతంగా వరద వస్తుండడంతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ లక్ష్మింబ్యారేజ్ 81 గేట్లు ఎత్తి నీటికి కిందకు వదలుతున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు మళ్ళీ పెరుగుతున్న వరద… 52 గేట్లు ఎత్తేవేత
మంచిర్యాల టౌన్ : గోదావరినది ఉగ్రరూపం గురువారం కూడా శాంతించలేదు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తుండటం, కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, ఆవుట్ ఫ్లో పెరిగిపోతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మళ్ళీ వరద ప్రభావం అంతకంతకు పెరుగుతున్నది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 52 గేట్లను ఎత్తేసి ఎగువన వస్తున్న వరద నీటిని కిందికి పంపిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి లెవల్ 148 మీటర్లకు గాను 146 మీటర్ల నీటిశాతం పెరిగింది. 20 టిఎంసిల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టులో ఇప్పటికి 15 టిఎంసిల ను కిందకు వదులుతున్నారు. ఇంకా ఆరు టిఎంసిల నీటిని నిల్వ చేస్తున్నప్పటి ఎగువన వస్తున్న నీటి సామర్థ్యం బట్టి వరద నీటిని వదలేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఎగువన వస్తున్న వరద నీరు దాదాపు 12 లక్షల క్యూసెక్‌ల నీటిని వదిలేయడం విశేషం. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరితో పాటు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.—————————
జూరాలకు పోటెత్తిన వరద : 18 గేట్లు ఎత్తివేత
అమరచింత : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి , నారాయణపూర్ డ్యామ్ నుండి జూరాల ప్రాజెక్టుకు ఒక లక్ష 30వేల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. దీంతో అధికారులు 18 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలానికి లక్ష 9వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ దిగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 12 యూనిట్లలో నిరంతర విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. కాగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద పెరిగే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు 11 టీఎంసీల కెపాసిటి ఉండగా 9 టిఎంసిల నీటి నిల్వ సామార్థ్యం ఉంచి మిగతా నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.
దహేగాంలో విషాదం
ఆసీఫాబాద్ : కుమురం భీమ్ ఆసీఫాబాద్ జిల్లా దహేగాంలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. మండలంలోని పెసర కుంట పెద్ద వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుండటంతో బుధవారం సహాయ చర్యల కోసం సింగరేణి సంస్థ రెస్క్యూ టీమ్‌ను పంపించింది. అక్కడ ఇద్దరు కార్మికులు ఓ గర్భిణీని వాగు దాటించే క్రమంలో ప్రమాదవశాత్తు జారి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి మృతదేహాలను కనుగొన్నారు. మృతులు సతీష్, రాము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
గోడ కూలి మహిళ మృతి
బాన్సువాడ: బాన్సువాడ డివిజన్ పరిధిలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వర్ని మండలంలోని తగిలెపల్లి గ్రామానికి చెందిన మైదం రాజమణి అనే మహిళ ఇంటి గోడకూలి మరణించింది. విషయం తెలుసుకున్న తెరాస పార్టీ నాయకులు పోచారం సురేంధర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని వారి కుటుంబీకులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబానికి తగు ఆర్దిక సహౠయం అందజేసి ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చూస్తామన్నారు. శిథిల ఇండ్లలో నివసిస్తున్న ప్రసలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, వారికి పునరావాసం కల్పించేలా ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలన్నారు.
మునిగిన అన్నారం, సరస్వతి బ్యారేజీలు
కాళేశ్వరం: గత వారం రోజులగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్‌భూపాలపల్లిజిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గురువారం గోదారవి మహోగ్ర రూపం దాల్చింది. దీంతో కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి గోదావరి వరద ఉదృతి భారీగా చేరుకోవడంతో పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటార్లు వరద నీటిలో మునిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్యి, సరస్వతి బ్యారేజీలకు ఎగువ నుండి భారీగా వరద ఉదృతి పొటెత్తుతుండడంతో లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు తరలిస్తున్నారన్నారు. మేడిగడ్డ, లక్ష్మిబ్యారేజీ ఎగువలోని గోదావరి ప్రాణహిత నదుల నుండి రికార్డు స్థాయిలో 28,46,140 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో పూర్తిస్థాయి గేట్ల ద్వారా అదే స్థాయిలో దిగువకు తరలిస్తున్నారు. మరోవైపు సరస్వతి బ్యారేజీలోకి ఎగువలోని గోదావరి బేసిన్ నుండి 15,95,228 లక్షల క్యూసెక్కుల వరద ఉదృతి వచ్చి చేరుతుండడంతో సరస్వతి బ్యారేజీ పూర్తి స్థాయి గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని దిగువకు గోదావరిలో విడుదల చేస్తున్నారు.