ప్రతీ అంశాన్ని కేంద్రానికి నివేదిస్తాం
భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో కేంద్ర బృందం పర్యటన
ప్రజాపక్షం/భద్రాచలం వరదలు,వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని కళ్లారా చూస్తున్నామని, ప్రకృతి విపత్తు వల్ల ఈ ప్రాంతంలో అపారనష్టం వాటిల్లిందని, ఇక్కడి ప్రతీ అంశాన్ని కేంద్రానికి పూసగుచ్చినట్లు నివేదిస్తామని కేంద్రబృందం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వర్షాలు, గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు జాతీయ విపత్తులు, హోం మంత్రిత్వ శాఖ సలహాదారు కునాల్ సత్యార్థి, డిపార్టెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ డిప్యూటీ సెక్రెటరీ అనీల్ గైరోల, సెంట్రల్ వాటర్ కమీషన్ డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రి ఆప్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ భయా పాండే, నేషన్ రిమోట్ సెన్సింగ్ సెంట్రల్ సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసులు, ఆయిల్ సీడ్స్ డైరెక్టర్ డా. పొన్నుస్వామి, ఏఈఎస్ రీజనల్ అధికారి ఎస్‌కె కుష్వా సభ్యులు గల కేంద్ర బృంధం క్షేత్రస్థాయిలో పర్యటించింది. బుధవారం రాత్రే ఐటిసి పిఎస్‌పిడి అతిధి గృహానికి చేరుకున్న వారు గురువారం ఐటిడిఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నష్టపు ఛాయా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా మాట్లాడుతూ వర్షాలలకు దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు,పంటలు, లింకురోడ్లు, పశుసంపద, మిషన్ భగీరధ పథకాలు, ఇరిగేషన్ చెక్ డ్యాంల లపై వివరించారు. అనంతరం బూర్గంపాడు మండలంలోని పూల్తేరువాగు, కొల్లుచెరువు గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు. అక్కడే రైతులకో ముఖాముఖి ఆయ్యారు. అక్కడ్నుంచి అశ్వాపురం మండలం అనందాపురం గ్రామంలో పర్యటించి దెబ్బతిన్నపత్తి పంటలను బృంధం పరిశీలించింది. ఈ గత నెల్లో కురిసిన భారీవర్షాల వల్ల అధిక వర్షపారం నమోదైనట్లు కలెక్టర్ వివరించారు. వర్షాల కారణంగా గోదావరి ఎగువ నుండి వచ్చిన వరదల కారణంగా గత నెల 20న భద్రాచలం వద్ద మొదటి వరద ప్రమాదహెచ్చరికను జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం 26వ తేది నుండి 28వ తేది వరకు మూడో ప్రమాద స్థాయిని దాటి గోదావరి ప్రవహించిందని తెలిపారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 84 గ్రామాలు ముంపుకు గురైనట్లు వివరించారు. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలను 44 పునరావాస కేంద్రాల్లో ఉంచామన్నారు. ముంపుకు గురైన 4454 కుటుంబాలకు చెందిన 14081 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి రక్షణ చర్యలు చేపట్టామని వివరించారు. అత్యవసర సేవల నిమిత్తం హెలీకాప్టర్‌తో పాటు 3 ఎన్‌డిఆర్‌ఎఫ్ టీంలను అందుబాటులో ఉంచామని, 15వేల ఇసుక బస్తాలు సిద్దం చేశామన్నారు. వరద ప్రవహంచే రహదార్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి రావాణాను నిలిపివేశామని, అదే విధంగా 70 ట్రాక్టర్లు, 16 లారీలు, 6 క్రైన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే రానున్న మూడు నెలలకు సరిపోను నిత్యవసరాలను సిద్దం చేసి పెట్టామని, 170 లైఫ్ జాకెట్లు, 118 లైఫ్ బాయ్‌లను అందుబాటులో ఉంచామని చెప్పారు. వరదల సహాయక చర్యలకు 23 మంది ప్రత్యేకాధికారు,184 మంది గ్రామస్థాయి ప్రత్యేకాధికారులు, 548 మంది గ్రామ పంచాయితీ స్థాయి అధికారులు, సెక్టోరియల్ అధికారులు 7 మంది, 42 మంది జోనల్ అధికారులు, 11 మొబైల్ టీమ్‌లను నియమించినట్లు కలెక్టర్ బృంధానికి వివరించారు. 103 ఆవాసాల్లో 11 చోట్ల మిషన్ భగీరధ ద్వారా మంచినీటి సరఫరాకు మరమ్మత్తులు వాటిల్లినట్లు చెప్పారు. 6 మండలాల పరిధిలోని 9 గ్రామాల్లో 15 పశువులు, 19 మేకలు, 3030 కోళ్లు చనిపోయినట్లు చెప్పారు. 41 గృహాలు పూర్తిగానూ, 162 గృహాలు పాక్షికంగా దెబ్బతినట్లు చెప్పారు. 16 మండలాల పరిధిలోని 44 గ్రామాలకు చెందిన 1402 మంది రైతుల 3151 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని వివరించారు. పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని 115 రోడ్లు మరమ్మత్తులకు గురయ్యాయని, ఇరిగేషన్‌కు సంబంధించి 47 చోట్ల రమ్మత్తులకు గురైనట్లు చెప్పారు. ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలోని 61 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్లు కలెక్టర్ కేంద్ర విపత్తుల బృంధానికి వివరించారు. అనంతరం అశ్వాపురం మండలం పరిధిలోని అనందాపురం గ్రామంలో పరద ముంపు వల్ల దెబ్బతిన్న పత్తి పంటను అధికారుల పరిశీలించి రైతులతో ముఖాముఖి అయ్యారు. వరదలు సంభవించినా, ముంపు వాటిల్లినా పంటుల సాగుచేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్,. ఎస్‌పి డా.వినీత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, ఇరిగేఏషన్ ఎస్‌ఇ వెంకటేశ్వరరెడ్డి, అర్‌అండ్‌బి ఇఇ భీమ్లా, పంచాయితీరాజ్ ఇఇ మంగ్యా, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉధ్యాన అధికారి జినుగు మరియన్న, పశుసంవర్థక శాఖ డిడి పురందర్, మిషన్ భగీరధ ఇఇలు తిరుమలేష్, నళిని తదితరులు పాల్గొన్నారు.
వరదలతో అపార నష్టం
RELATED ARTICLES