వరద నీటితో జాలువారుతున్న పత్తి
మొక్కజొన్న, వరి నారుకు తీవ్ర నష్టం
ప్రజాపక్షం/వరంగల్ ఎడతెరపి లేకుండా వరుసగా కురిసిన వర్షాలు రైతులను నిండా ముంచాయి. గతంలో కంటే రెట్టింపు వర్షపాతం నమోదై చెరువులు,కుంటలు నిండడడంతో పాటు పొలాలలోకి నీరు చేరుకుంది. పంటలు వేసిన కొద్ది రోజులకే భారీ వర్షాల వల్ల పొలాల్లోకి వరదనీరు చేరడంతో రైతులకు కన్నీరే మిగిలినట్లయింది. వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు వరంగల్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. వారం రోజుల పాటు కురిసన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. దీంతో పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు మునిగిపోయాయి. వరి నారుమళ్లకు కూడా నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల ప్రకారం వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,13,532 ఎకరాల్లో పత్తి, 21,932 ఎకరాల్లో మొక్కజొన్న, 3వేల ఎకరాల్లో కంది, 600 ఎకరాల్లో పెసలు, 5వేల ఎకరాల్లో వేరుశనగ పంటలను సాగుచేస్తున్నారు. అయితే ప్రస్తుతం పత్తి పంట లేత శాఖీయ దశలో ఉందని, మొక్కజొన్న మోకాళ్ల ఎత్తు దశలో ఉందని, కంది, పెసలు లేత ఆకుదశలో ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా 90శాతానికి పైగా పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.అన్ని మండలాల్లో సాధారణం కంటే అతిగా వర్షపాతం నమోదు కావడం, చెరువులు అలుగు పోస్తుండడంతో ఆయకట్టుతోపాటు మెట్ట ప్రాంతాల్లోని పంటలు కూడా నీట మునిగాయి. జిల్లాలోని సంగెం, దుగ్గొండి, నర్సంపేట,నల్లబెల్లి,వర్దన్నపేట,రాయపర్తి,పర్వతగిరి తదితర అన్ని మండలాల్లో పత్తి పంట నీటమునిగింది. వర్ధన్నపేట మండలం చెన్నారం, బొల్లికుంట ప్రాంతాల్లో మొక్కజొన్న పంటలు కొంతమేర నీటమునిగాయి. పత్తి, మొక్కజొన్న, కంది, పెసలు తదితర పంటల సాగు అంచనాలో సుమారు 90శాతం పంటలు నీట మునిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
హనుమకొండ జిల్లాలో సగానికిపైగా
హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు సాగైన వానాకాలం పంటల్లో సగానికిపైగా నామరూపాల్లేకుండా పోయాయి. ఎక్కువగా సాగు చేసిన పత్తి పంట వర్షాలకు పూర్తిగా నీటమునిగింది.పత్తి పంటలో ఇప్పుడిప్పుడే మొలకలెత్తినవి కొన్నయితే.. కలుపుతీసిన అనంతరం ఏపుగా పెరుగుతున్నవి మరికొన్ని ఉన్నాయి. గత వారం రోజుల నుంచి పొల్లాలో పెద్దఎత్తున వరద నీరు చేరి పత్తి మొలకలు మగ్గిపోతున్నాయి.పంటలకు చేరిన వరద నీరంతా బయటకు వెళ్లడానికి మరో రెండు మూడు రోజులు పట్టేలా ఉంది. ఇప్పటికే చేలల్లో చాలాచోట్ల పత్తి మొక్కలు కుళ్లిపోవడం చూసి రైతులు దిగాలు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి నీళ్లపాలవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
పత్తి పంట నీటిపాలు
హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 77,163 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 56,335 ఎకరాల్లో పత్తివేశారు. 2,404 ఎకరాల్లో వరి, 122 ఎకరాల్లో కందులు, 44 ఎకరాల్లో సోయా, 1188 ఎకరాల్లో మొక్కజొన్న, 11,488 ఎకరాల్లో దైంచా, 22 ఎకరాల్లో కందులు వేశారు. గత సీజన్లో పత్తికి అధిక ధర పలకడం, ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించడం, పత్తి దిగుబడులు కూడా బాగానే వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ సారి పత్తివైపు మళ్లారు. అయితే ఎడతెరిపిలేని వర్షాలవల్ల పత్తిపంటపై ప్రభావం పడింది. ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు మండలాల్లో పర్యటిస్తున్నారు. పత్తితోపాటు ఇతర పంటల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నష్టాలను అంచనా వేస్తున్నారు. వారం రోజులుగా వర్షాలు పడడంతో నల్లరేగడి నేలల్లో నీరు నిలిచిపోయి పత్తిమొక్కలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
వరంగల్, హన్మకొండలో.. 90% పంటలు నీటమునక
RELATED ARTICLES