కళాశాలల విద్యార్థులే లక్ష్యం….
పెద్ద ఎత్తున సరుకులను పట్టుకుంటున్న పోలీసులు
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో వరంగల్ కేంద్రంగా గంజాయి సరఫరా జోరందుకుంటున్నది. ఇటీవల వరుస దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున మత్తు పదార్థాన్ని పోలీసులు పట్టుకుంటున్నా.. గంజాయి ముఠాలు వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వరంగల్ ముందుంటుంది. ఇక్కడ అనేక ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి ఏటా 50 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసించేందుకు వస్తుంటారు. దీంతో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు సరఫరా చేస్తున్నాయి. ఇటీవల రాంనగర్‌లో విద్యార్థులు గంజాయి విక్రయిస్తుంటే పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారు. విద్యార్థులు సిగరెట్‌లో గంజాయి పెట్టి పీలుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సిగరెట్‌ను రూ.40 నుంచి రూ. 60 వర కు విక్రయిస్తున్నారు. ఇటీవల గంజాయి కేసుల్లో పట్టుబడిన వారితోపాటు వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి ముఠా నగరంలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్లు గుర్తించి ఆ దిశగా వారిపై నిఘా పెట్టారు. చిన్నచిన్న పొట్లాల్లో పెట్టి హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రవాణా చేస్తున్నట్లు పోలీసుల గుర్తించారు. కొంతమంది ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రైలు, లేదా బస్సు మార్గంలో వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా వారి సంబంధీకులకు గంజాయిని ఇచ్చి వెళ్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట గంజాయిని పట్టుకుంటూనే ఉన్నారు. ఇటీవల హన్మకొండ సుబేదారి స్టేషన్ పరిధి రాంనగర్‌లో భద్రాది కొత్తగూడానికి చెందిన ఓ విద్యార్థి గదిని అద్దెకు తీసుకొని గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించి తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మామునూరు ఠాణా పరిధిలో రోడ్డుపై తనిఖీలు నిర్వహించి 50 కిలోల గంజాయి పట్టుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. వరంగల్‌కు గంజాయి తరలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పరకాల శివారులో కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, పరకాల పోలీసులు ఆదివారం సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 6.40 లక్షల విలువ చేసే సరకు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడుతున్నవారిలో విద్యార్థులే అధికం
గంజాయి విక్రయాలలో పట్టుబడుతున్న వారు విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. విక్రయాలకు, గంజాయి తాగుడుకు అలవాటు పడిన పిల్లల ఇంటి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళుతున్నారు. ఎక్కువ మంది ఉన్నత వర్గాల నుంచి వచ్చిన పిల్లల ఉండడం వల్ల వారిపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ వ్యసనానికి అలవాటు పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఠాణాలకు తీసుకొచ్చి విచారణ చేసిన తరువాత వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నారు. అప్పుడుగానీ తల్లిదండ్రులు తేరుకోవడం లేదు. ఇప్పటికైనా తల్లి దండ్రులు విద్యార్థుల నడవడికపై దృష్టి సారించాలని పోలీసులు కోరుతున్నారు.
విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి
పిల్లలు గంజాయికి అలవాటుపడినట్లు గుర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి కౌన్సిలింగ్ నిర్వహించాలి. ముఖ్యంగా కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు విద్యార్థుల నడవడికపై దృష్టి సారించాలి. విద్యార్థులు మత్తుకు బానిసలవకుండా చూడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయాలు కాలేజీల పరిసరాల్లో గుర్తిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని ఇటీవల ప్రధానాచార్యుల సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి చెప్పారు.
వరంగల్ కేంద్రంగా గంజాయి సరఫరా
RELATED ARTICLES