బౌలర్లు విజృంభించాలి.. బ్యాట్‌మెన్లు చెలరేగాలి
ఫీల్డింగ్‌లోనూ రాణిస్తే గెలుపు మనదే
సిడ్నీ: ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ పోరుకు సిద్ధమవుతోంది. ఎప్పటి నుంచో ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ గెలువని భారత్‌కు దాదాపు 70 ఏళ్ల నిరీక్షణ తర్వాత కోహ్లీ సేన చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని అందించింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించడమంటే అంత సులువుకాదు. కానీ కోహ్లీ అండ్ టీమ్ దానిని సాధ్యం చేస్తూ అద్భుతమైన విజయాన్ని భారత్‌కు అందించింది. చారిత్రక విజయాన్ని అందుకున్న భారత్‌పై ప్రపంచ వ్యప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ ఇప్పటికే తన సారథ్యంలో ఎన్నో రికార్డులను తిరగరాశాడు. తాజాగా ఆసీస్‌ను వారి హోమ్ గ్రౌండ్స్‌లో 2 ఓడించి కొత్త చరిత్ర సృష్టించాడు. 70వ దశకం నుంచి ఇప్పటి వరకు ఇతర ఏ భారత కెప్టెన్‌కీ సాధ్యం కాని రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. అయితే కొన్నిసార్లు డ్రాలతో గట్టెక్కిన భారత్ విజయం మాత్రం కలగానే ఉండేది. కానీ ఈసారి ఆ కలను కోహ్లీ సేన పూర్తి చేసింది. దీంతో జట్టు సభ్యులే కాకుండా, మాజీలు, భారత అభిమానులు సైతం సంబరాలు జరుపుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ టెస్టు సిరీస్‌ను కలిసి కట్టుగా రాణించి సొంతం చేసుకుంది. టెస్టు సిరీస్‌ను గెలుచుకుని జోరు మీదున్న టీమిండియాకు ఇప్పుడు వన్డే సిరీస్ పరీక్ష మొదలు కానుంది. అందుకే ప్రస్తుతం భారత్ వన్డే సిరీస్ విజయంపై దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా ఆసీస్‌పై భారత్ రికార్డులే మెరుగుగా ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు వన్డే మ్యాచ్‌ల ఫలితాలను చూస్తే ఆసీస్‌పై భారత్‌దే పైచేయి ఉంది. 2017లో చివరి సారిగా భారత్ పర్యటించిన ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో నాలుగింటిలో ఓటమి పాలైంది. కేవలం ఒక విజయమే సాధించింది. ఈ సిరీస్‌ను భారత్ 4 గెలుచుకుంది. ఇక ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య జనవరి 11 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే వన్డే సిరీస్ కోసం భారత జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. వన్డే స్పెషలిస్ట్ ప్లేయర్లతో టీమిండియా మైదానంలో అడుగుపెట్టనుంది. టెస్టు సిరీస్‌కు ఎంపిక కానీ శిఖర్ ధావన్, కేదర్ జాదవ్, హార్ధిక్ పాండ్యా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌లు భారత స్కాడ్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా వన్డే సిరీస్‌కు ఎంపిక అయ్యాడు.
ధోనీపైనే అందరి దృష్టి..
భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఏకైక కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి మరో ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్నాడు. వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోవాలంటే ధోనీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుంది. అయితే భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ ధోనీ గత కొంతకాలంగా నిలకడగా రాణించలేకపోతున్నాడు. వయసు పెరిగే కొద్దీ తనలోని దూకుడును పూర్తి స్థాయిలో కనబర్చలేకపోతున్నాడు. యువ ఆటగాళ్లతో పోటీ పడటంలో ధోనీకి కాస్త ఇబ్బందిగా మారుతోంది. కానీ ధోనీ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన విషయం ఎవ్వరూ మరవద్దు. ధోనీ ఒంటి చేత్తో ఎన్నో గొప్ప విజయాలు భారత్‌కు అందించాడు. అతని సత్తా ఏమిటో నిరూపించూకోవాల్సిన అవసరం అతనికి లేదు. ఇప్పుడు మునపటిలాగా దూకుడుగా ఆడకపోయినా అతనికి ఉన్న అనుభవం అమోఘం. అతను వికెట్ల వెనుక నిలబడే మ్యాచ్‌ను అంచనా వేయగలడు. ప్రస్తుత సారథి కోహ్లీకి మంచి సలహాలు ఇవ్వగలడు. గత కొన్ని రోజుల క్రితమే మన ముందు ఇలాంటి ఒక పెద్ద ఉదాహరణ వచ్చింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను కీలకమైన సెమీఫైనల్లో మ్యాచ్‌లో పక్కన పెట్టడంతో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ ఒకే తప్పుడు నిర్ణయంతో ప్రపంచకప్ నుంచే వైదొలిగింది. అప్పట్లో ఈ విషయమై కెప్టెన్ స్మృతి మంధనా, కోచ్ రమేశ్ పొవార్, సెలెక్టర్లపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడ భారత జట్టులో కూడా ధోనీ కూడా కీలక ఆటగాడు. అతనిని తక్కువ అంచనా వేస్తే భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ధోనీకి తన ఫామ్‌ను తిరిగి సాధించడానికి ఆస్ట్రేలియా సిరీస్ ఒక మంచి అవకాశం. ఈ సిరీస్‌లో రాణించి ప్రపంచకప్ జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని అందరూ కోరుకొంటున్నారు. విదేశీ పిచ్‌లపై ధోనీకి అపారమైన అనుభవం ఉంది. వికెట్ల వెనుకనుంచే బౌలర్లను మంచి సలహాలు ఇస్తూ మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయగలగాడు. అందుకే ధోనీకి భారత జట్టులో ప్రత్యేక స్థానం ఉంది. అతను మ్యాచ్ ఉంటే చాలు ప్రత్యర్థి జట్టుకు వణుకు ఖాయం. గొప్ప నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీకి ఎవరూ సాటిలేరు. ఇక ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ధోనీ మంచి ప్రదర్శన చేస్తాడని ఆశిద్దాం.
ధనాధన్ ధావన్..
ఇక మరో కీలక బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌పై కూడా భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఓపెనర్‌గా రోహిత్ శర్మకు, శిఖర్ ధావన్ మంచి భాగస్వామి. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు పరుగుల వరద పారడం ఖాయం. వీరి దూకుడి నైజం ఏ ప్రత్యర్థి జట్టుకైనా వణుకు పుట్టిస్తుంది. ధావన్ గత కొన్నేళ్లుగా పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. నిలకడమైన బ్యాటింగ్‌తో భారత్‌కు శుభారంభం అందిస్తున్నాడు. భారత్‌ల వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డే సిరీస్‌లో ధావన్ విజృంభించి ఆడాడు. టి20ల్లో కూడా గొప్పగా రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈసారి తన బ్యాట్‌ను ఆసీస్ గడ్డపై కూడా ఝుళిపించేందుకూ సిద్ధమయ్యాడు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతకు వైస్ కెప్టెన్‌గా మంచి సేవలు అందిస్తున్నాడు. బ్యాటింగ్‌లో డబుల్ సెంచరీల రారాజుగా పేరు సంపాదించాడు. ఇతను సెంచరీ చేస్తే చాలు డబుల్ సంచరీకి ఎక్కువ సమయం తీసుకోడు. బంతిని స్టేడియం బయట పంపించడమే ఇతని స్పెషాలిటి. ప్రత్యర్థి బౌలర్ ఎవరైన సరే బంతి గ్రౌండ్స్ బయట పడాల్సిందే. మరో కొన్ని రోజుల్లో వన్డే ప్రపంచకప్ కూడా జరగనుండడంతో భారత్‌కు ఈ ఆసీస్ వన్డే సిరీస్ మంచి ప్రాక్టీస్‌గా మారనుంది. బ్యాట్స్‌మెన్స్ ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి, పాఠాలు నెర్చుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశమనే చెప్పాలి.
సిరాజ్‌కు మంచి అవకాశం..
ఇక హైదరాబాద్ యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా ఈ సిరీస్ చాలా కీలకం. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తూ అతని స్థానంలో సిరాజ్‌కు భారత్ జట్టులో చోటు కలిపించారు. అయితే ఈ సిరీస్‌లో సిరాజ్ తుది జట్టులో అవకాశం సాధిస్తే అతనంత అదృష్టవంతుడు మరొక్కరు ఉండడు. ఎందుకంటే ఈ సిరీస్‌లో రాణిస్తే ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. అందుకే ఈ ఆసీస్ సిరీస్ అందరికీ ప్రత్యేకమే. సిరాజ్ గత కొంత కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి ఫలితాలు రాబట్టుతున్నాడు. సెలక్టర్లు దృష్టిని ఆకర్షించి భారత స్కాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. సీనియర్లతో ఆడి తన ఆటను మరింతగా మెరుగు పరుచుకోవాలని భావిస్తున్నాడు. నెట్స్‌లో కూడా మంచి సాధన చేస్తున్నాడు.
హార్ధిక్ పాండ్యా భారీ అంచనాలు..
ఇక టీమిండియాలో యువ సంచలనంగా ఎదుగుతున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండాపై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇతను బ్యాట్‌తో పాటు బౌల్‌తో కూడా రాణించగలడు. కొందరైతే పాండ్యాను భారత దిగ్గజం కపిల్‌దేవ్‌తో పోల్చుతున్నారు. అయితే హార్ధిక్ కొన్ని రోజులుగా గాయంతో మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో అతనికి చోటు లభించింది. ఇప్పుడు హార్ధిక్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. చాలా కాలంగా భారత్ ఎదురుచూస్తున్న పేస్ బౌలర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా హార్ధిక్ పాండ్యా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా ఆసీస్ సిరీస్‌లో రాణించి తనపై సెలెక్టర్లు, కెప్టెన్ కోహ్లీ ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటాడని అందరూ భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిలకడమైన ఆటతో అందరి ప్రశంసలు పొందుతున్నాడు. తాజాగా వన్డే సిరీస్‌లో ఆలౌరౌండర్‌గా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు హార్ధిక్ పాండ్యాకు మెరుగ్గా ఉన్నాయి. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శనలు చేసి వన్డే ప్రపంచకప్ తన స్థానాన్ని మరింతగా బలపరుచుకోవాలని పాండ్యా అతృతతో కనిపిస్తున్నాడు.