HomeNewsBreaking Newsవణికిస్తున్న వాన

వణికిస్తున్న వాన

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షబీభత్సం
స్తంభించిన చార్‌ధామ్‌, శబరిమలై యాత్రలు
కొట్టాయం (కేరళ) : దేశంలోని పలు రాష్ట్రాలలో వానలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు,వరదలు భయపెడుతున్నాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్రను, కేరళ రాష్ట్రంలో శబరిమలై యాత్రనుతాత్కాలికంగా నిలిపివేశారు. కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌, గంగోత్రి, యముననోత్రిలకు వెళ్ళే యాత్రికులకు కూడా సమీప ప్రాంతాల్లో ఆగిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. కేరళ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించంతో ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిన్న కేరళలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఉత్తరాఖండ్‌లో…
ఉత్తరాఖండ్‌లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చార్‌ధామ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యమునోత్రి వెళ్ళే యాత్రికులను బాద్‌కోట్‌, జంకిచట్టిలలో ఆగిపోవాలని అధికారులు ఆదేశించారు. గంగోత్రి యాత్రికులను హర్షిల్‌, భట్వారి, మనేరిలలో నిలిపివేశారు. కేదార్‌నాథ్‌ యాత్రికులను కూడా తమ యాత్రలను నిలిపివేయాలని ఆదేశించారు. కేదార్‌నాథ్‌కు సుమారు 4000 మంది వెళుతున్నారు. యాత్రికుల క్షేమాన్ని కోరే వారిని ముందుకు కదలకుండా ఆపేశామని అధికారులు చెపారు. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌లో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. డెహ్రాడూన్‌లో జరిగే జిల్లాస్థాయీ ఖేల్‌ మహకుంభ్‌ ను కూడా రద్దు చేశారు. భారీ వర్షాలు, పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలుతోపాటు 60 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌షా సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో….
దక్షిణ బెంగాల్‌జిల్లాలకు మంగళవారం వరకు భారీ వర్ష సూచన ఉందని ఐఎండి తెలిపింది. పుర్బా మెదినిపూర్‌, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హౌరా, హుగ్లీ, కోల్‌కత జిల్లాల్లో భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. డార్జిలింగ్‌, కలింపోంగ్‌, జల్‌పైగురి, కూచ్‌బిహార్‌, అలిపుర్దుర్‌ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉంది. కోల్‌కతలో 22 మిలీకమీటనేక. , నగర శివారు డండం వినానాశ్రయం వద్ద 53 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నదుల్లో నీటమట్టాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని, పల్లపు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం, కొండచరిలు విరిగిపడే ప్రమాదం ఉందని ఐఎండి ముందుగానే హెచ్చరించడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జాలరులు వేటకు వెళ్ళకుండా ఆదేశాలిచ్చారు.
మధ్యప్రదేశ్‌లో…
మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలవల్ల ఖండ్వా లోక్‌సభ ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ ప్రచార పర్యటన వాయిదా పడింది. మధ్యప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో వర్షపాతం నమోదైంది. ముఖ్యమంత్రి ప్రసంగించాల్సిన బహిరంగ సభాప్రాంగణాలన్నీ నీటితో నిండిపోయాయి. ఈనెల 30న ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. దక్షిణ, పశిమ ప్రాంతాల నుండి వచ్చే గాలులతో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భోపాల్‌ ఐఎండి కార్యాలయం హెచ్చరించింది.షోపూర్‌ జిల్లాలోని కర్హాల్‌ ప్రాంతంలో భారీగా 312 మిల్లీమీటర్ల వర్షాతం నమోదైందని ఐఎండి అధికకారి జిడి పికె సహా చెప్పారు. కాగా రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాలను కూడా భారీ వర్షాలు కుదిపివేయడంతో ప్రజాజీవనం అతలాకుతలమైంది.
కేరళలో పది డ్యాముల గేట్లు ఎత్తివేత
కేరళ రాష్ట్రంలోని నదీపరీవాహక ప్రాంతాల్లో వరద నీటి మట్టం గణనీయంగా పెరుగుతూ ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. పది డ్యాముల వద్ద నీరు ప్రవాహంగా వస్తూ ఉండటంతో గేట్లు ఎత్తివేసి అధికారులు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. శబరిమలై భక్తుల రాకపోకలను తాత్కాలికంగా స్తంభింపజేశారు. అనేక రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొట్టాయం, ఇదుక్కి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. అధికార గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఒక్క కొట్టాయం జిల్లాలోనే 62 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. అక్టోబరు 24 వరకు పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని, మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించడంతో ఆసియాలో అతిఎత్తున కుక్కి డ్యామ్‌ రెండు గేట్లు ముందస్తు జాగ్రత్తగా ఎత్తివేశారు. అచన్‌కోవిల్‌ నదీ పరీవాహక ప్రాంతంలో పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందస్తు జాగ్రత్తగా తరలించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. సోమవారంనాటికి కుక్కి డ్యామ్‌ నీటిమట్టం 2,396.96 అడుగులకు చేరుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. త్రిస్సూర్‌ జిల్లాలో నది వెంట కట్టలపై నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయాలని కలెక్టర్‌ హరితా వి కుమార్‌ ఆదేశించారు. అయ్యప్ప యాత్రలను ప్రోత్సహించడం మంచిదికాదని ఐఎండి పేర్కొంది. దీంతో భక్తుల రాకను స్తంభింపజేయడం తప్ప మరో మార్గం లేదని రాష్ట్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. మరోవైపు వరద కారణంగా నదీపరీవాహక ప్రాంత ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న వస్తువులు, ముఖ్యమైన డాక్యుమెంట్లను అనేక కుటుంబాలు వరదనీటి పాలు చేసుకున్నాయి. నడిరోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 27 ఏళ్ళుగా ఎంతో కష్టపడి తాను కట్టుకున్న రెండు అంతస్తుల ఇల్లు మణిమాల నది వరదనీటిలో కొట్టుకుపోయిందన్న వార్త విని విధి నిర్వహణలో ఉన్న ప్రైవేటు బస్సు డ్రైవరు జేబి విషాదంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు. దాంతో ట్రాఫిక్‌ మధ్యలో ప్రయాణికులతో వెళుతున్న ఆ ప్రైవేటు బస్సు ముందకాయం పట్టణంలోని ట్రాఫిక్‌ మధ్యలో ఆగిపోవడంతో వేలాది వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. మణిమలయార్‌ నది వరదనీటి మట్టం పెరిగిపోవడంతో ఆ గట్టునే ఉన్న రెండు అంతస్తుల డ్రైవర్‌ జేజీ ఇల్లు మెల్లిగా కదులుతూ నదిలోకి విరిగిపడి నీళ్ళల్లో కొట్టుకుపోయిన దృశ్యం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. 161 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కంజిరపల్లి తాలూకాలో 62 ఇళ్ళు పూర్తిగా నేలమట్టం కాగా, 143 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మీనాచిల్‌ తాలూకాలో రెడు ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కేరళ ప్రభుత్వం నష్టం అంచనాలు ఇంకా సేకరిస్తోంది.మరోవైపు ప్రభుత్వం సహాయ కార్యకలాపాలకోసం, గల్లంతైనవారిని గాలించేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఎడతెగని వర్షాలతో వరదల ప్రభావంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 184 సహాయ శిబిరాలలో ఎనిమిది వేలమంది తలదాచుకున్నారు. కేరల ఇదుక్కిజిల్లా పశ్చిమ కనుమల్లో ముథువర పర్వతాల్లో పుట్టిన మణమాల నది భారీ వర్షాలకు వరదభీభత్సం సృష్టించి కేరళనువణికిస్తోంది. అనేక సంవత్సరాలుగా ఎంతో ప్రేమతో, సంప్రదాయపద్ధతుల్లో, భావోద్వేగాలతో పెనవేసుకుని దాచుకున్న వస్తువులు నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ వర్షాలు, వరదలకు రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లును ఎన్నో కుటుంబాలు కోల్పోయాయి. తన కుమార్తె వివాహం కోసం ఇంట్లో దాచిపెట్టిన రెండు లక్షల రూపాయల నగదు నీటిపాలైపోయిందని ఒక తండ్రి తల్లడిల్లిపోతున్న దృశ్యం ఎంతో ఆవేదన కలిగిస్తోంది. మణిమాల వరద నీటిలో తన రెండు అంతస్తుల ఇల్లు కుప్పకూలిపోయి కళ్ళముందే కొట్టుకుపోతుంటే తన భార్య తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, ఆ సమయంలో ఆమె దగ్గర ఉన్న చేతి పర్సు కూడా ఎక్కడో పోగొట్టుకుందని డ్రైవర్‌ జేబి విలపిస్తూ చెప్పారు. ఇప్పుడు తాము కట్టు బట్టలతో మిగిలామని, ఇప్పుడు మళ్ళీ తాము ‘సున్నా’ నుండి జీవితం పునఃప్రారంభించాలని జేబి అతడి భార్య పుష్ప చెప్పారు. తన ఇల్లు నదిలో విరిగిపడిపోతున్న దృశ్యాన్ని ఆద్యంతం తన పొరుగింటివారు వీడియోలో బంధించారని జేబీ చెప్పారు. కేరళలో పది డ్యాముల్లో నీరు భారీగా నిండిపోవడంతో గేట్లు ఎత్తివేసి రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. పంపానది నీటిమట్టం 15 సెంటీమీటర్లుకు బాగా పెరగడంతో కుక్కిడ్యామ్‌ నుండి భారీగా నీటిని దిగువకు వదులుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments