జాతీయ విపత్తుగా ప్రకటించాలి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
ప్రజాపక్షం/వరంగల్ ప్రతినిధి వడగండ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాలోని ఖిలా వరంగల్ మండలం దూపకుంట శివారులో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను సిపిఐ జిల్లా నాయకులతో కలిసి చాడ పరిశీలించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయారని, చేతికి అందిన పంట కళ్ల ముందే పాడై పోవడం బాధాకరమని అన్నారు. మొక్కజొన్న, వరి, మిర్చి, మామిడి మొదలగు పంటలు ఈ వడగండ్ల వాన వలన తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. తక్షణమే గ్రామాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించి నష్ట పోయిన రైతులకు ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. రైతులకు జరిగిన తీరని నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర నిధులతో కూడా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ పోతరాజు సారయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, వరంగల్, హన్మకొండ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాష్ మియా, రాష్ట్ర సమితి సభ్యులు మారుపాక అనిల్ కుమార్, ఖిలా వరంగల్ మండల కార్యదర్శి దండు లక్ష్మణ్, సహాయ కార్యదర్శులు ఓర్సు రాజు, తాళ్లపల్లి జాన్ పాల్, మండల నా యకులు వనం సౌందర్య, జెట్టి విజయ లక్ష్మి, చిట్యాల సువర్ణ,దుమాల పద్మ, నాయకులు జన్ను రాజు, చిరంజీవి, కుమార స్వామి పాల్గొన్నారు.