కోలుకోలేని దెబ్బతీస్తున్న అకాల వర్షాలు
హైదరాబాద్‌లో వరుణుడి ప్రతాపం
వికారాబాద్‌లో పంట నష్టాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం బృందం
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఐ
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతూనే ఉన్నాయి. అకాల వర్షాలకు పలు జిల్లాల్లో పంటలకు తీరని నష్టంవాటిల్లింది. ఈదురుగాలులతో వడగండ్లతో విరుచుకుపడుతున్న వానలు
మొక్కజొన్న, వరి, మిర్చి, మామిడి, మిరప, అరటి తదితర పంటల రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఖమ్మం, వికారాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, నల్లగొండ, రాజన్న సరిసిల్లతో పాటు హైదరాబాద్ తదితర జిల్లాల్లో శనివారం వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడంగల్ మండలాల్లో బలమైన ఈదురు గాలులతో వడగండ్లు కురిశాయి. సుమారుగా గంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం చక్రంపల్లిలో వడగండ్ల వాన కురిసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనూ వర్షానికి రోడ్లపై నీళ్లు ప్రవహించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం పడింది. బోయినపల్లి, గంగాధర, భీమారం, రామడుగు, కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి మండలాల్లో వడగండ్ల వాన దంచి కొట్టింది పెద్దపల్లి జిల్లాలోను పలుచోట్ల వర్షం పడింది. కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు మండలాల్లో వడగళ్లతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి నేల వాలి చిరు పొట్ట దశలోని పంట చేతికి అందకుండా పోయింది.
హైదరాబాద్‌లో వడగండ్ల వర్షం: హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి ప్రతాపం పలు ప్రాంతాల్లో శనివారం పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసి ముద్దయ్యారు. ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై పలుచోట్ల వడచూపించాడు. గ్రేటర్ హైదరాబాద్‌లోని గండ్లు కురిశాయి. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యారడైజ్, మాదాపూర్, హైటెక్ సిటీ, కుత్బుల్లాపూర్, కేపీహెచ్బీ, దుండిగల్ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, గండి మైసమ్మ, మియాపూర్, చందానగర్, పటాన్చెరు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం దంచి కొట్టింది. బోయినపల్లి, మారేడ్పల్లి, చిలకలగూడ, బేగంపేట్, ప్యాట్నీ, తిరుమలగిరి, కూకట్ పల్లి, హైదర్ నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. కాప్రా, ఈసీఐఎల్, చార్మినార్, బహదూర్పురా, యాకుత్ పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్నామ, బోడుప్పల్, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఆల్విన్ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్లో చిరుజల్లులు కురిశాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి వచ్చి చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
పశ్య పద్మ పేరుతో ఫొటోలు సెంట్రల్ డెస్క్‌లో ఉన్నాయి.
పంట నష్టాన్ని పరిశీలించిన రైతు సంఘం బృందం
ప్రజాపక్షం / వికారాబాద్ ప్రతినిధి : రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం ధర్మసాగర్ లో వికారాబాద్ జిల్లాలో మర్పల్లి మండలం, నవాబ్‌పేట్ మండలం ఏక్ మామిడి గ్రామంలో వడగళ్ల, భారీ వర్షాలకు పూర్తిగ దెబ్బతిని పోయిన పంటలను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం పరిశీలించింది. ముఖ్యంగా మర్పల్లి మండలం లో వడగండ్ల,గాలివాన లతో పంటలు పూర్తిగా దెబ్బతినడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, టమాట, క్యారెట్, వంకాయ ఉల్లి, కుసుమ, కాబుల్ సెనగ, చిక్కుడుకాయ, క్యాబేజీ, మామిడి, వరి పంటలు చేతికి వచ్చే ముందు దెబ్బతిన్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామంలో కావలి చంద్రయ్య, కావలి చంద్రకళ, నరసింహులు, కేకే వెంకటేష్, జ్ఞానేశ్వర్ రైతుల పొలాలను, నవాబ్‌పేట మండలం ఏక్ మామిడి గ్రామంలో ఉల్లి గులాబీ బంతి పూల తోటలను పరిశీలించారు. వికారాబాద్ జిల్లాలో మర్పల్లి గ్రామంలో మొక్కజొన్న కాబూల్ సెనగ కుసుమ పంటను పరిశీలించారు. సన్న చిన్న కారు మధ్యతరగతి రైతులు దారుణంగా దెబ్బతిని దిగాలు పడిపోయిన రైతాంగం ఎట్లా కోలుకోగలుగుతామని రైతు సంఘం నాయకుల ముందు కంటతడి పెట్టారు. పంటల బీమా అమలు కావడంలేదని, పెట్టుబడులు విపరీతంగా అధికం కావడం రైతులను కృంగతీస్తుంటే ఈ వర్షాలు మరింతగా దెబ్బతీశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఫోన్ చేసినా వ్యవసాయ అధికారులు ఎత్తని పరిస్థితి ఉందని తెలిపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి యుద్ద ప్రాతిపదికన నష్టపరికారాన్ని చెల్లించటానికి చర్యలు చేపట్టాలని, మొక్కజొన్న ఎకరాకు రూ.50 వేలు, కూరగాయల, మామిడి పండ్ల తోటలకు ఎకరాకు రూ.50 వే లు, వరి పంటకు రూ.30 వేల నష్టపరిహారం ఇచ్చి రైతుల కడగండ్లను తీర్చాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. పశ్యపద్మతో పాటు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభులింగం, వికారాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ గౌడ్, వికారాబాద్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి వెంకటేష్ అబ్దుల్లా, పీర్ మహమ్మద్ తదితరులు పంటలను పరిశీలించిన ప్రతినిధి బృందంలో ఉన్నారు.
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం / హైదరాబాద్ : అకాల వర్షాలు, వడగండ్లతో నష్టపోయిన పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంటల నష్టాన్ని అంచనా వేయాలని, చనిపోయిన మూగజీవాలకు, పశువుల కాపరులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఈదురు గాలులు, వడగండ్ల వానతో మొక్కజొన్న, వరి, మామిడి, మిరప, అరటి వంటి పంటలు నాశనం అయ్యాయని కూనంనేని ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతుకు పంట చేతికొచ్చే సమయంలో ఈదురు గాలుల వల్ల నష్టం జరగడంతో కోలుకోని స్థితిలోకి నెట్టబడ్డారని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఏ ఏ పంటలు, ఎన్ని ఎకరాలలో నష్టం వాటిల్లిందో, ఎంతమంది చనిపోయారో, ఎన్ని మూగజీవాలు చనిపోయాయో తక్షణమే సర్వే చేయాలని, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుతో మూగజీవాలు, పశువుల కాపర్లు మృత్యువాత పడ్డారని వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ఇచ్చి ఆదుకోవాలన్నారు. పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని వారన్నారు.
వడగండ్లు… రైతులకు కడగండ్లు
RELATED ARTICLES