అభివృద్ధి, సంక్షేమం దిశగా తెలంగాణ
ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నరసింహన్
ప్రజాపక్షం / హైదరాబాద్ : సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం ముందుకుసాగుతోందని, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ చెప్పారు. ప్రస్తుత పద్ధతిలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తూ సొంత ఇంటి స్థలం ఉన్న పేదలకు గృహ నిర్మాణం కోసం రూ. 5 లక్షల నుండి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు గవర్నర్ ప్రకటించారు. రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 119 గురుకులాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శాసనసభలో శనివారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీకి విచ్చేసిన గవర్నర్‌కు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ స్వాగతం పలికారు. గవర్నర్ ప్రసంగిస్తూ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం దిశగా పయనిస్తోందని తెలిపారు. విద్యుత్ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని అన్నారు. పారిశ్రామిక, ఐటి రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయని, జిఎస్‌టి వసూళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని, అవినీతికి తావులేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇటీవలే సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకమన్నారు.పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులు శరవేగం గా జరుగుతున్నాయన్నారు. నీటి పారుదల రంగానికి గడిచిన నాలుగున్నరేళ్లలో రూ.77,777 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని, రానున్న కాలంలో రూ.1.72 లక్షల కోట్ల అంచనా వ్యయం తో పనులు చేస్తోందన్నారు.సమైక్య రాష్ట్రం లో ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇచిందన్నారు.ఇప్పటికే నాలుగు దశల్లో 20,171 చెరువుల పునరుద్ధరణ జరిగిందని, ఫలితంగా సాగునీటితో పాటు భూగర్భ జలా లు పెరిగాయని ఆయన తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామని గవర్నర్ చెప్పారు. ఇప్పటి వరకు 2,72,763 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసిందన్నారు.