సామాన్య ప్రజలు బందూకులు పట్టి సాగించిన సమర భేరి ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’
మనిషి మనుగడ సాగినంత కాలం ‘అరుణ పతాకం’ రెపరెపలు
తెలంగాణ విలీన దినోత్సవం వేడుకల్లో సిపిఐ నేతల ఉద్ఘాటన
ప్రజాపక్షం/హైదరాబాద్
కమ్యూనిస్టుల సారథ్యంలో సామాన్య ప్రజలు బందూకులు పట్టి సాగించిన సమర భేరీ ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ ఈ మహత్తర పోరాట చరిత్రను ఎవరో వక్రీకరించినంత మాత్రనా సమసి పోయేది కాదని సిపిఐ నాయకులు అన్నారు. ఈ పోరాట స్ఫూర్తి ఎప్పుడూ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో తిరుగుబాటు చైతన్యాన్ని రగిలిస్తూనే ఉంటుందని, తద్వారా భూమి మీద మనిషి మనుగడ సాగినంత కాలం ‘అరుణ పతాకం’ రెపరెపలాడుతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ‘తెలంగా ణ రైతాంగ సాయుధ పోరాటం 76వ వార్షికోత్స వం, తెలంగాణ విలీనం దినోత్సం వేడుకల’ను హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో మంగళవారం సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు, జాతీయ జెం డాను, సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా అరుణ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళ్లు అర్పించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర నాయకులు ఆర్.అంజయ్య నాయక్, కె.కాంతయ్య, మారగోని అనిల్ కుమార్, బి.వెంకటేశం, ప్రవీణ్‌కుమార్, చంద్రమౌళి, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ్మా, లక్ష్మినారాయణ, ప్రజాపక్షం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బొమ్మగాని కిరణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజనాట్యమండలి అమరులను స్మరిస్తూ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం నాయకులు ప్రసంగించారు.
కమ్యూనిస్టులను అణచడానికే ‘పోలో ఆఫరేషన్’ : అజీజ్ పాషా
నిజానికి 1948 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం చేపట్టిన ‘పోలో ఆపరేషన్’ కమ్యూనిస్టులను అణిచివేయడానికి తప్ప నిజాం రాజుపైన కాదని సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా మూడోంతుల తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్టుల అధీనంలోకి వచ్చిందన్నారు. దీంతో ఒక దశలో ప్రపంచంలో అనేక దేశాలు గజ గజ వణికిపోయ్యాయన్నారు. తెలంగాణ కమ్యూనిస్టుల వశం కాబోతుందని ‘మీరు ఏం’ చేస్తున్నరంటూ అమెరికా సామ్రాజ్యవాద పాలకులు ఏకంగా భారత్ ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. దీని పర్యవసనమే అప్పటీ హోం శాఖ మంత్రి వల్లబాయ్ పటేల్ నేతృత్వంలో పోలీసు యాక్షన్ పేరుతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ‘పోలో ఆపరేషన్’ చేపట్టిందని వివరించారు. అప్పటికే నిరంకుశ నిజాం రాజు పతనం చివరి దశలో చేరిందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానిది మహాత్తర చరిత్ర అని చెప్పారు. ఈ చరిత్రను కొన్ని పత్రికలు, మరికొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
కమ్యూనిస్టు పార్టీ పేరు ఉచ్చరించడానికే పాలక పార్టీలకు భయం : కూనంనేని సాంబశివ రావు
కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పేరు ఉచ్ఛరించడానికే భయమని, చరిత్రను చరిత్రగా చెప్పడానికి కూడా అందరికీ భయమని,ఆ భయంలో భాగమే బిజెపి విమోచనమని, అప్పటీ ముఖ్యమంత్రి కెసిఆర్ సమాఖ్యత అని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలన దినోత్సవమని అంటున్నారని తెలిపారు. ఇది విలీనం దినోత్సమా?, లేక , ఆనాటి పోరాటాన్ని స్పూరింప జేసే దినోత్సమా? అనేది ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే స్పష్టత లేదని తెలిపారు. పోరాట స్ఫూర్తింప జేసే పేరు పెట్టాలంటే కమ్యూనిస్టు పేరు రావాలి, అందుకే అది ఇష్టంలేని పాలకులు, ప్రజాపాలన దినోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తూ అనాటి మహాత్తర చరిత్రను భావితరాలకు తెలియకుండ చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. నాడు భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సమయంలో అప్పటీ కేంద్ర ప్రభుత్వం, నిజాం రాజు మధ్య జరిగిన ఒప్పందంలో చట్ట బద్దంగా విలీనం అని పొందుపర్చారని వివరించారు. అందుకే కేంద్ర ప్రభుత్వమైన ,రాష్ట్ర ప్రభుత్వమైనా చట్టబద్దమైన తెలంగాణ విలీన దినోత్సవం పేరుతోనే ఉత్సవాలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వార్థ ప్రయోజాలనకు రాజకీయ పార్టీ సృష్టించిన పదం విమోచనం : కె.శ్రీనివాస్‌రెడ్డి
విమోచనం అన్న పదాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడాని సృష్టించారని కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంత ప్రజల మదిలో గాని, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు సాయుధ పోరాట చరిత్ర మొత్తం తెలుసని చెప్పారు. నిరంకుశ నైజాం రాచరిక వ్యవస్థను తొలగించిన తర్వాతనే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది తప్ప విమోచనం కాలేదని తెలిపారు. విలీనం పదం తప్ప విమోచనం అనే పదమే ఎక్కడా లేదన్నారు. 1948 సెప్టెంబర్ 17న నాటి పత్రికల్లో గాని, కేంద్ర ప్రభుత్వంతో నైజాం చేసుకున్న ఒప్పందంలో గాని ఎక్కడా విమోచనం అనే పదం కనిపించదన్నారు. పోరాట యోధులకు గుర్తింపు దక్కకుండ చేయాలనే కుట్రలో భాగంగా విమోచనం అనే పదాన్ని అప్పటి ఉప ప్రధానమంత్రి ఎల్.కె.అద్వాని సృష్టించారన్నారు. తెలంగాణ విముక్తిలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి పాత్ర ఉన్నదని చెప్పడానికి చేసే ప్రయత్నంలో భాగమే కమ్యూనిస్టులు నిజాంకు అమ్ముడు పోయ్యారని, ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో అద్వాని మాట్లాడారని, దీంతో ఆయనను ప్రజలందరూ ఆసహించుకున్న విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. కమ్యూనిస్టుల త్యాగధనుల పోరాట యోధుల ఫలితమే ఇవాళా ఈ తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడిందన్న భావన సృష్టించడానికి మరి కొందరూ ప్రయత్నించారని, 1969, 71ఉద్యమంతో పాటు ఆ తర్వాత జరిగిన పోరాటంతోనే తాము తెలంగాణను సాధించామని చెప్పే విధంగా చరిత్రను సృష్టించే ప్రయత్నాలు జరిగాయని, ఇది అన్యాయమని, పోరాట యోధులను కించపర్చేదిగా భావిస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో రైతుల హక్కులను కాపడుకుందాం : పశ్య పద్మ
పశ్యపద మాట్లాడుతూ నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పేద ప్రజలంతా సమాయత్తమై కమ్యూనిస్టుల సారథ్యంలో బందుకులు పట్టి సాగించిన ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ చరిత్రలోనే మహాత్తమైందన్నారు. నాడు తెలంగాణలో ఐదు కోట్ల ఎకరాల భూమి ఉంటే ఇందులో 60 శాతం భూమికి ప్రతి ఏటా నవాబుకు రూ.2 కోట్ల శిస్తు చెల్లిస్తూ ,రైతులు సాగు చేసుకోగా, 30 శాతం భూస్వాములు, జామిన్‌దార్ల చేతుల్లో, మరో 10 శాతం నవాబు కుటుంబ అవసరాల కోసం ఉండేదని వివరించారు.
పేరు ఏదైనా సాయుధ పోరాట యోధులను స్మరించుకోవడం గొప్ప శుభదినం : బొమ్మగాని ప్రభాకర్
1947 సెప్టెంబర్ 11న నిజాం రాజు నిరంకుశ పాలనకు మరణ శాసనం రాస్తూ కమ్యూనిస్టు దిగ్గజాలు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్ధూం మొయునుద్దీన్ ఇచ్చిన సాయుధ పోరాట పిలుపుతో ప్రజలంతా ఏకమై తిరుగుబాటు చేయడంతోనే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని బొమ్మగాని ప్రభాకర్ అన్నారు. ప్రజా పాలన, విమోచనం ఇలా పేరు ఏదైనప్పటికీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ రాష్ట్రంలోని యావత్తు రాజకీయ పార్టీలు విలీనం దినోత్సం వేడుకలు నిర్వహించుకోవడం నాలుగు వేల అమరవీరుల త్యాగాల స్మరించుకోవడమేనని, ఇదొక శుభదినంగా అభివర్ణించారు. ఈనాడు మతతత్వ పార్టీలు చెబుతున్నట్లు ఇది ముస్లింలకు వ్యతిరేకమైన పోరాటం కాదని, దున్నెవాడికి భూమి, వెట్టి చాకిరి విముక్తికి సాగిన మహాత్తర సమరంలో ప్రజలు గెలిచారని, దోరలు ఓడిపోయారని, ఇదే స్పూర్తితో మనమంతా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.