11 మంది దుర్మరణం
29 మందికి గాయాలు
ఆరుగురి పరిస్థితి విషమం
జమ్మకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘటన
జమ్ము : జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం వాటిల్లింది. పూంచ్ జిల్లాలో బుధవారం కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మరో 29 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. బస్సులో కొంత మంది విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. బస్సు గాలి మైదాన్ నుంచి పూంచ్‌కు వెళ్తుండగా సాజియాన్ సరిహద్దు బెల్ట్‌లోని బ్రారీ నాలా సమీపంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్థులు, పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక మంది నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలోనే 9 మంది ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులైన 29 మందిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఆందులో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్‌లో జమ్ములోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు. బస్సు అదుపు తప్పి 250 ఫీట్ల పైనుంచి జారిపడుతూ పెద్ద పెద్ద బండరాళ్లను ఢీకొట్టుకుంటూ లోయలో పడిందన్నారు. విద్యార్థులను కూడా తీసుకెళ్తున్న ఈ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయిందని చెప్పారు. ప్రమాదం పట్ల జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. మృతుల పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతని తెలియజేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అదే విధంగా జమ్ములో చికిత్స పొందుతున్న బాధితులను సిన్హా పరామర్శించారు. వారికి లక్ష రూపాయల సహాయాన్ని ప్రకటించారు. తరుచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో అక్కడ అన్ని వసతులు కలిగిన ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని పిఎంఒ ప్రకటించింది
లోయలో పడ్డ మినీ బస్సు
RELATED ARTICLES