ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకున్నా అనుమతివ్వని ప్రభుత్వం
పర్సన్ ఇన్చార్జిల పదవీకాలం మరో ఆరునెలలు పెంపు
ప్రజాపక్షం / హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(ప్యాక్స్), ఎఫ్ఎస్సిఎస్ ఎన్నికలు జరగనున్నాయి. కాలపరిమితి ముగిసి ఏడాది దాటినా వీటికి ఎన్నికల నిర్వహించడంలో ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతూనే ఉంది. ప్యాక్స్ ఎన్నికలను వీలైనం త త్వరగా నిర్వహించే బాధ్యత సహకార సంఘానికి అప్పగించేందుకు వీలుగా వ్యవసాయశాఖ భావించి ఏర్పాట్లన్ని చేసుకోవడం, అంతలోనే వాటిని వాయిదా వేయాలని సర్కా రు నుంచి ఆదేశాలు రావడంతో నిలిచిపోతూ వస్తున్నాయి. తాజాగా వీటి ఎన్నికలు మరో ఆరు నెలలపాటు వాయిదా పడ్డాయి. కాలపరిమితి ముగిసినప్పటి నుంచి వీటికి పర్సన్ ఇన్చార్జ్లను నియమించారు. ఆరునెలల పాటు కాలపరిమితి విధించి వీరి నియామకాలు జరిగాయి. నిజానికి నిబంధనల మేరకు సహకార సంఘాల పాలక మండళ్ల కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాలి. సహకార సంఘాల ఎన్నికల వాయిదా పడుతున్నా కొలది పర్సన్ ఇన్చార్జ్ల సర్వీసును పొడగిస్తూ వస్తున్నారు. తాజాగా మూడు రోజుల క్రితం వీరిని మరో ఆరునెలల పాటు పొడగిస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి జిఒ ఆర్టి.నెం.28ను జారీ చేశారు. అంటే సహకారం సంఘాల ఎన్నికలు మరో ఆరునెలలు ముందుకుపోయినట్టేనని తెలుస్తుంది. అప్పటి వరకు ఎంపిపి, జడ్పిటిసి, లోక్సభ, మున్సిపాల్టీల ఎన్నికలన్నీ అయిపోతాయి. ఈ ఎన్నికలన్నీ వరుసగా వస్తున్నందునే సహకార సంఘాల ఎన్నికలు మళ్లీ వాయిదా పడినట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 906 ప్రాథమిక రైతు సహకార సంఘాలు(పిఎసిఎస్) ఉన్నాయి. వీటిలో కొన్నింటి కాలపరిమితి గతేడాది జనవరిలోనే ముగిశాయి. మరి కొన్నింటి పాలక వర్గాల కాలపరిమితి గతేడాది ఫిబ్రవరిలో ముగిశాయి.