ఆరవ రోజూ పార్లమెంటుకు తప్పని అంతరాయం
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై అధికార పక్షం, ప్రతిపక్షం సభ్యులు ఏమాత్రం తగ్గకుండా వాగ్వాదాలకు దిగడంతో ఆరో రోజు కూడా పార్లమెంటు సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. కావేరిపై ఎఐఎడిఎంకె, డిఎంకె, రాష్ట్ర ప్రత్యేక హోదాపై టిడిపి ఉభయ సభల్లో రచ్చ చేయడంతో ఎగువ సభ, దిగువ సభ రెండూ వాయిదాపడ్డాయి. రాజ్యసభ ఉదయం 11.00 గంటలకు సమావేశమయ్యాక మరునాటికి వాయిదా పడింది. లోక్‌సభ పదేపదే వాయిదాపడ్డప్పటికీ ఎడతెగని గోల మధ్యనే అద్దె గర్భం(సరోగసి) నియంత్రణ బిల్లును ఆమోదించింది. తర్వాత వినియోగదారుల రక్షణ బిల్లును కూడా స్పీకర్ మహాజన్ ఆమోదింపచేయాలనుకున్న ప్రయత్నంలో విఫలమయ్యారు. సభలో గోల ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. ఆ బిల్లును గురువారం చేపడతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ఆరో రోజున కూడా సజావుగా సాగక వాయిదాపడింది. డిసెంబర్ 11 నుంచి ప్రతిరోజు పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడుతున్నాయి. తొలి రోజు కీర్తిశేషులైన పార్లమెంటు సభ్యులకు నివాళులర్పించారు. తర్వాత డిసెంబర్ 12 నుంచి పార్లమెంటు ఉభయసభల్లో అంతరాయం ఏర్పడుతూ వస్తోంది. ఈ వారం రాజ్యసభ వికలాంగులకు సమాన హక్కులు కల్పించే బిల్లును ఆమోదించింది. కాగా లోక్‌సభ రెండు బిల్లులు ఆమోదించింది. ఒకటి లింగమార్పిడి వ్యక్తుల(ట్రాన్స్‌జెండర్) హక్కుల బిల్లు, రెండోది అద్దె గర్భం(సరోగసీ) నియంత్రణ బిల్లు.
లోక్‌సభలో ‘సరోగసీ బిల్లు’ ఆమోదం
RELATED ARTICLES