HomeNewsBreaking Newsలేబర్‌ కోడ్‌లు రద్దు చేయండి

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయండి

కేంద్రానికి ఎఐటియుసి డిమాండ్‌
రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు మద్దతు
విస్తృత ప్రచార కార్యక్రమాలకు సన్నద్ధం

న్యూఢిల్లీ : దేశంలో కార్మికుల ప్రాథమిక, మౌలిక హక్కులనుకాలరాసే నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఎఐటియుసి (ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. నాగపూర్‌లో ఈనెల 21,22 తేదీల్లో రెండు రోజులు జరిగిన ఎఐయుసి వర్కింగ్‌ కమిటీ సమావేశాల్లో కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 12 డిమాండ్లను కూడా ఎఐయుసి కేంద్ర ప్రభు త్వం ముందుకు తీసుకువచ్చింది. ఈ మేరకు ఎఐటియుసి జాతీయ కార్యదర్శి సుకుమార్‌ దామ్లే మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా దేశవ్యాప్తం గా రెండు రోజులపాటు సార్వత్రిక సమ్మె చేయాలన్న కేంద్ర కార్మిక సంఘాల ఢిల్లీ సదస్సు తీర్మానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. రెండు రోజుల సమ్మె నిర్ణయాన్ని ముం దుకు తీసుకువెళ్ళాలని ఢిల్లీ సదస్సు తీర్మానానికి మద్దతు తెలియజేసింది. ఈ సమ్మెకు సన్నాహంగా దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ఉమ్మడి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్ధత తెలియజేసింది.దేశంలో ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ సహా ప్రజా వ్యతిరేక చర్యలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రదర్శనలు, ధర్నాలు, మానవహారాల నిర్మాణం, కాగడా ప్రదర్శనలు, జనరల్‌ బాడీ సమావేశాలు, సంతకాల ఉద్యమాలతోపాటు నాలుగు లేబర్‌ కోడ్‌ల వల్ల కలిగే ప్రమాదం, నష్టం వంటి విషయాలు తెలియజేసేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎఐటియుసి సంసిద్ధత వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీలో గతంలో జరిగిన కేంద్ర కార్మిక సంఘాల సదస్సులో చేసిన తీర్మానాలకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. దేశ కార్మికవర్గ హక్కులను, వారు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న అమూల్యమైన న్యాయబద్ధమైన సౌకర్యాలు, ప్రాథమిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని వర్కింగ్‌ కమిటీ సమావేశం డిమాండ్‌ చేసింది. వివాదాస్ప కార్మిక చట్టాలను పార్లమెంటు ప్రక్రియ ద్వారా రద్దు చేయాలని, దాంతోపాటే ప్రాణాంతకమైన ఆర్థిక భారాలు వేసే విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరింది. దేశంలో ప్రైవేటీకరణ ఊసే ఎత్తవద్దని, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. ఎఐటియుసి అధ్యక్షుడు రామిందర్‌ కుమార్‌ అధ్యక్షతన ఈ రెండు రోజుల వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఎఐటియుసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హెచ్‌.మహాదేవన్‌, ఉపాధ్యక్షుడు బలదేవ్‌ ఘన్‌ఘాస్‌లు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, వాటిని అడ్డుకోవాల్సిన తక్షణ ఆవశ్యకతను సమావేశంలో వివరించారు. ఎలాంటి ఆదాయపన్నులూ చెల్లించని కుటుంబాలకు నెలకు రూ.7,500 లు ఆహార, ఆదాయ మద్దతు ప్రభుత్వం అందజేయాలని ఎఐటియుసి వర్కింగ్‌ కమిటీ సమావేశం కోరింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ)పథకానికి నిధుల కేటాయింపులను పెంచాలని సమావేశం కోరింది. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలని కోరింది. అనిశ్చిత, అసంఘటిత కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రత ఇవ్వాలని, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్నభోజన పథకాలతోసహా ఇతర ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేస్తున్న కార్మికులందరికీ చట్టబద్ధమైన కనీస వేతనాలు ఇవ్వాలని, వారరికి సామాజిక భద్రత సమకూర్చాలని సమావేశం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అగ్రభాగన నిలిచి ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న కార్మికులు అందరికీ సరైన రక్షణ ఇవ్వాలని, వారికి బీమా సదుపాయం సమకూర్చాలని సమావేశం కోరింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం సహా ప్రజలకు ఉపయోగపడి ఇతర ముఖ్య రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంపు చేయాలని, ఆ విధంగా జాతి ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కలిగించాలని సమావేశం డిమాండ్‌ చేసింది. పెట్రోలియం ఉత్పత్తులపై సె్రంటల్‌ ఎక్సైజు డ్యూటీని తగ్గించాలని, పెరుగుతున్న ధరలను అరికట్టేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, వారందరికీ సమాన పనికి సమాన వేతనం నిబంధన వర్తింపజేయాలని, అదేవిధంగా జాతి ఆస్తుల అమ్మకాలను నిలిపివేయాలని, వృద్ధులకు పెన్షన్లను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎఐటియుసి నాగపూర్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం డిమాండ్‌ చేసింది.
రైతులకు ఎఐయుటిసి శుభాభినందనలు
ఏడాదికాలంలో చిత్తశుద్ధితో మడమతిప్పకుండా గొప్ప ఉద్యమ నడిపిస్తున్న దేశంలోని రైతులకు ఎఐటియుసి నాగపూర్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం మంగళవారంనాడు శుభాభినందనలు తెలియజేసింది. వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రైతుల ఉద్యమానికి తలవొగ్గి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం శుభపరిణామమని సమావేశం పేర్కొంది. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లోని మూడు ప్రాంతాలలో వేలాదిమంది రైతులు కరోనా మహమ్మారిని కూడా లెక్కచేయకుండా సాగు చట్టాల రద్దు కోసం పోరాటం చేసి విజయం సాధించడం దేశ రైతాంగంలో ఆత్మవిశ్వాసం నింపిందని సమావేశం పేర్కొంది. ఈ స్ఫూర్తితోనే మిగిలిన డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై సమైక్యంగా ఒత్తిడి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని సమావేశం పేర్కొంది. కార్మికులకు హాని చేసే, ప్రైవేటీకరణకు, కార్పొరేట్లకు మేలు చేసే నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణం ఉపసంహరించాలని కేంద్రాన్ని ఎఐటియుసి డిమాండ్‌ చేసింది. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైన రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటుపరంచేశారని, ఎక్కడ సమ్మె చేసినాగానీ, దాన్ని నేరంగా పరిగణిస్తున్నారని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలాఉండగా, 2022 డిసెంబరులో కేరళలో ఎఐటియుసి 42వ సెషన్‌ నిర్వహించాలని కూడా నాగపూర్‌ సమావేశం తీర్మానించినట్లు సుకుమార్‌ దామ్లే ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments