శతక్కొట్టిన కోహ్లీ.. రాణించిన ధోనీ, రోహిత్
భారత్ ఘన విజయం
ఆసీస్‌తో రెండో వన్డే
ఆడిలైడ్: తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. దీంతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమిండియా ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో మాత్రం విజయం సాధించి లెక్క సరిచేసింది. మూడో మ్యాచ్‌ల సిరీస్‌ను 1 సమం చేసింది. బౌలర్లు అంత అంతగానే రాణించినా బ్యాటింగ్‌లో మాత్రం విరాట్ కోహ్లీ (104), మహేంద్ర సింగ్ ధోనీ (51) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిం డియాను విజేతగా నిలిపారు. విజయంలో శిఖర్ ధావన్, దినేష్ కార్తిక్, రోహిత్ శర్మలు తమ వంతు సహకారం అందించారు. సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో షాన్ మార్ష్ (131; 123 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ ర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా చివరి ఓవర్ రెండో బంతికి 299/4 పరుగులు చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది. ధోనీ సిక్సర్ కొట్టి భారత్ విజయాన్ని పూర్తి చేశాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మెల్‌బోర్న్ వేది కగా చివరి వన్డే మ్యాచ్ జరగనుంది.
ధావన్ దూకుడు..
భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడైన ఆరంభాన్ని అందించాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి వేగంగా పరుగులు సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ సమన్వయంతో ఆడుతూ ఇతనికి అండగా నిలిచాడు. తొలి వన్డేలో విఫలమైన ధావన్ రెండో వన్డేలో మాత్రం చెలరేగి ఆడాడు. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల వర్షం కురిపించాడు. అయితే దూకుడుగా ఆడుతున్న ధావన్ 7.4 ఓవర్లో తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడిన ధావన్ 28 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో జత కలిపి రోహిత్ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే మరో వికెట్ చేజారకుండా జాగ్రత్త పడ్డారు. ఈక్రమంలోనే భారత్ 17.3 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది. ఆ వెంటనే కుదురుగా ఆడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మ (43; 52 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల)ను స్టోయినిస్ పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ కీలకమైన రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత కోహ్లీ, అంబటి రాయుడు భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. తర్వాత సమన్వయంతో ఆడుతున్న రాయుడు (36 బంతుల్లో 24) పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన రాయుడు ఈ మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. కోహ్లీకి మంచి సహకారం అందించాడు.
ఆదుకున్న కోహ్లీ, ధోనీ..
అనంతరం క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. 160 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను కోహ్లీ, ధోనీలు కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరిచి తమ జట్టును విజయానికి చేరువచేశారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పోతున్న ఆసీస్ బౌలర్లను వీరిద్దరూ తమ తెలివైన బ్యాటింగ్‌తో అడ్డుకున్నారు. ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూ తమ వికెట్లను కాపాడుకుంటూనే.. మరోవైపు వేగంగా పరుగులు కూడా సాధించారు. దీంతో స్కోరుబోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలోనే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లీ 66 బంతుల్లో రెండు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ధోనీ కూడా ఆచితూచిగా ఆడుతూ పరుగులు చేయడంతో భారత్ 26.3 ఓవర్లో 200 పరుగుల మైలురాయిని దాటింది. ఈ సమయంలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ముఖ్యమైన 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ధోనీ అండగా నిలువడంతో కోహ్లీ చెలరేగి ఆడాడు. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడి పరుగులు రాబట్టుకున్నాడు. ఈ జంటను విడదీయడానికి ప్రత్యర్థి బౌలర్లు ఎంతగానే శ్రమించారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఈక్రమంలోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న విరాట్ కోహ్లీ 108 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో కోహ్లీ తన ఖాతాలో 39వ వన్డే శతకం వేసుకున్నాడు. అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వారిలో సచిన్ (49 సెంచరీలు) తర్వాత కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో భారత్ విజయానికి మరింత చేరువైంది. సెంచరీ చేసి జోరుమీదున్న కోహ్లీ (104)ను రిచర్డ్‌సన్ తెలివైన బంతితో మ్యాక్స్‌వెల్‌చే క్యాచ్ పట్టించి ఇంటికి పంపించాడు. దీంతో భారత్ 43.4 ఓవర్లలో 242 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో భారత్‌కు విజయం కోసం 38 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ధోనీ, దినేష్ కార్తిక్ ఇద్దరే ప్రధాన బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. వీరిద్దరి తర్వాత బౌలర్లే ఉండడంతో ఆసీస్‌కు మ్యాచ్ విజయ అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. కానీ ఈ సమయంలో ధోనీ, కార్తిక్‌లు అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను మరో ఓటమినుంచి కాపాడారు. ధోనీ కుదురుగా ఆడుతుంటే.. కార్తిక్ మాత్రం దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించాడు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేస్తూ పరుగులను నియత్రించారు. దీంతో చివర్లో మ్యాచ్ మరింతగా రసవంతంగా మారింది. ఒకవైపు తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా.. మరోవైపు తమ వికెట్‌ను కూడా కాపాడుకోవాల్సి ఉండడంతో మ్యాచ్‌లో ఉతంఠతకు తెరలేచింది. కానీ చివర్లో వీరిద్దరూ అజేయంగా ఉండి మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఆఖరి ఓవర్లో భారత్‌కు గెలుపు కోసం 7 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సయంలో ధోనీ (48) స్ట్రయిక్‌లో ఉన్నాడు. బెహ్రన్‌డార్ఫ్ వేసిన 50వ ఓవర్ తొలి బంతికే ధోనీ లాంగాన్ మీదగా కళ్లు చెదిరే భారీ సిక్సర్ కొట్టి తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. తర్వాత బంతికి సింగిల్ తీయడంతో భారత్ 49.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లతో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. సిరీస్‌ను కూడా సమం చేసింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిన మహేంద్ర సింగ్ ధోనీ (55 నాటౌట్), 54 బంతుల్లో 2 సిక్స్‌లు) పరుగులు చేశాడు. మరోవైపు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన దినేష్ కార్తిక్ 14 బంతుల్లోనే 2 ఫోర్లతో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో బెహ్రన్‌డార్ఫ్, రిచర్డ్‌సన్, స్టోయినిస్, మ్యాక్స్‌వెల్‌కు చెరో వికెట్ లభించింది.
సెంచరీతో రాణించిన షాన్‌మార్ష్..
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఫించ్ (6)ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేయగా. అలెక్స్ కారే (27 బంతుల్లో 18)ను మహ్మద్ షమీ పెవిలియన్ పంపాడు. తర్వాత ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్ దూకుడుగా ఆడుతూ ఆసీస్ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే ఆసీస్ 13.3 ఓవర్లలో 50 పరుగుల మార్కును దాటింది. అనంతరం దూకుడుగా ఆడుతున్న ఖవాజా (23 బంతుల్లో 21)ను రవీంద్ర జడేజా రన్నౌట్ చేశాడు. తర్వాత వచ్చిన పీటర్ హాండ్స్‌కొంబ్ (20)పరుగులు చేసి ఔటవ్వడంతో ఆస్ట్రేలియా 134 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో షాన్ మార్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు అండగా నిలిచాడు. సహచర బ్యాట్స్‌మెన్‌ల సహకారంతో ఆసీస్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. మారస్ స్టోయినిస్ (29) పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులు అడుగుపెట్టిన హార్డ్ హిట్టర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ అకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ వేగంగా పరుగులు చేయడంతో ఆసీస్ స్కోరుబోర్డు వేగంగా ముందుకు సాగింది. మరోవైపు ధాటిగా ఆడుతున్న షాన్ మార్ష్ 108 బంతుల్లో 10 ఫోర్లతో శతకం సాధించాడు. చివర్లో భువనేశ్వర్ అద్భుతమైన బంతితో దూకుడుగా ఆడుతున్న మ్యాక్స్‌వెల్ (48; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)ను ఔట్ చేశాడు. తర్వాత అదే ఓవర్లో చిర స్మరణీయ ఇన్నింగ్స్ ఆడుతున్న షాన్ మార్ష్ (131; 123 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల)ను ఔట్ చేసి ఆసీస్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. తర్వాత వచ్చిన నాథన్ లియాన్ 5 బంతుల్లో 12 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 298/9 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 45 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. తన డెబ్యూ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేలవమైన ప్రదర్శన చేశాడు. ఇతను 10 ఓవర్లలో వికెట్ తీయకుండా 76 పరుగులు సమర్పించుకున్నాడు.
లెక్క సరిచేశారు..
RELATED ARTICLES