HomeNewsBreaking Newsలెక్క తేల్చాల్సిందే...

లెక్క తేల్చాల్సిందే…

బిసి జనగణన చేపట్టేలా పార్టీలన్నీ ఏకమై కేంద్రపై ఒత్తిడి పెంచాలి
‘బిసిల హక్కుల సాధన సమితి’ రౌండ్‌టేబుల్‌లో చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ దేశంలోని బిసి కులాల లెక్క తేల్చాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పాలకులు బిసిలకు కాకికి ఎంగిలిమెతుకులు వేసినట్టు వేస్తున్నారని విమర్శించారు. బిసి జనగనణ చేపట్టేలా అన్ని రాజకీయ పార్టీలూ ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. హైదరాబాద్‌, హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో ‘బిసిల హక్కు ల సాధన సమితి’ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిసి హ క్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండు రంగాచారి అధ్యక్షత వహించగా చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కాగా, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, టిజెఎస్‌ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌రావు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మ్యాడం రామేశ్వర్‌ రావు, ఐఎఎల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి, పూలె, అంబేడ్కర్‌ సంఘం నాయకులు కోలా జనార్ధన్‌, బిసి సంక్షేమ సంఘం నాయకులు దుర్గయ్య గౌడ్‌, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ కుమార్‌, జర్నలిస్టు ఇంద్రవెళ్లి రమేష్‌, బిసి సంఘాల ప్రతినిధులు పల్నాటి యాదయ్య, విజేయుడు ,యుగేంధర్‌, రొయ్యల కృష్ణ మూర్తి, టిడిపి నేత రవీంద్రచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ బిసిలలో చైతన్యం తీసుకువచ్చేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. సిఎం కెసిఆర్‌ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థలలో కూడా బిసి రిజర్వేషన్లు లేవన్నారు. రాష్ట్రంలోని ఫెడరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా సగానికిపైగా జనాభా ఉన్న బిసిలకు కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.1400 కోట్లు కేటాయించడం దుర్మార్గమని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే తనకే ఆశ్చర్యం కలిగిందని, తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో ఎంఎల్‌ఎగా తాను టిఆర్‌ఎస్‌ కంటే ఎక్కువే ప్రశ్నలు వేశానని, చర్చలో పాల్గొన్నానని, తన ప్రశ్నలతో నాటి సిఎం రోశయ్యకు చమలు పట్టించానని గుర్తు చేశారు. ఇప్పుడా పరిస్థితులు లేవని, అంత సెంటిమెంట్‌ రాజకీయాలు నడుస్తున్నాయని తెలిపారు. దేశంలో కులాల పేరుతో ఫాసిజం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ఫాసిజం, నియంతృత్వం రాజ్యమేలుతోందని, వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరోగమన విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ బిసిలకు చెందిన కులాలన్నీ ఒకతాటిపైకొచ్చి ఒక ఏజెండగా ఏర్పాడాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాలన్నారు. బిసి జనగనణ, జనాభా ప్రకారం నిధుల కేటాయింపు అంశాలపై బిసికులాలు సమావేశమవ్వాలని, ధర్నాలు చేపట్టాలని సూచించారు. ప్రధాని మోడీ ఒక జాదుగర్‌ లాంటి వారని, అందుకే మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌ రావు మాట్లాడుతూ ఒబిసి రిజర్వేషన్లు నాల్గవ తరగతి, కింది స్థాయి ఉద్యోగ పోస్టులకు మాత్రమే అమలవుతున్నాయన్నారు. తక్కువ జనాభా ఉన్న అగ్రవర్ణాలు ఎక్కవగా లబ్ధిపొందుతున్నారని, బిసిలకు అన్యాయం జరుగుతోందన్నారు. పాశం యాదగిరి మాట్లాడుతూ ఢిల్లీలో జోకర్లు, బ్రోకర్ల ప్రభుత్వం ఉన్నదని, వారికి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బిసి జనగనణ చేపట్టదని, బిసి కులాలే బిసి జనగణను చేపట్టి ప్రభుత్వం ముందు పెట్టాలని సూచించారు. బొమ్మగాని ప్రభాకర్‌ మాట్లాడుతూ బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లోని బిసిలలో చైతన్యం వస్తుందని, వారు అక్కడి ప్రభుత్వానికి సవాల్‌ విసురుతున్నారన్నారు. బిసి జనగనణ చేపడితే లెక్కలు తేలుతాయని, తద్వారా బిసిలకు నిధులు, రాజకీయ అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందనే పాలకులు భయపడుతున్నారని విమర్శించారు. కాగా బిసి కులజగనణ చేపట్టాలని, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిసి సదస్సులు నిర్వహించాలని, రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో బిసి జనాభాకు అనుగుణంగా నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మార్చి నెలలో చలో అసెంబ్లీ నిర్వహించాని రౌండ్‌ టేండ్‌ తీర్మానించినట్టు రాయబండి పాండురంగాచారి వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments