ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రమే కాదు దేశమే ఆర్థిక మాంద్యంలో ఉం దని, ఇలాంటప్పుడు కొత్తగా సెక్రటేరియట్ బిల్డింగ్స్ కట్టాలా అని హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించింది. డబ్టులు లేనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారో కూడా చెప్పాలని కోరింది. ఇప్పుడున్న పాతిక ఎకరాల జాగాలో ఎన్ని బిల్డింగ్స్ కడతారు, ఏ శాఖకు ఎంత జాగా కేటాయిస్తారు.. కొత్త కట్టడానికి తుది ప్లాన్ ఎక్కడ ఉంది.. వంటి వివరాలు సమర్పించాలని సర్కార్‌ను ఆదేశించింది. ఆర్థిక మాంద్యం గురించి మీడియాల్లో కూడా వార్తలు వస్తున్నాయని, ఈ తరుణంలో కొత్తగా కట్టడానికి బదులు ఉన్న బిల్డింగ్స్‌కే మరమ్మతులు చేస్తే సరిపోయేదని బెంచ్ అభిప్రాయపడింది. సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చొద్దంటూ కాంగ్రెస్ నాయకులు ఎ. రేవంత్ రెడ్డి, టి.జీవన్ రెడ్డి, టిజెఎస్ నేత విశ్వేశ్వర్‌రావు ఇతరులు దాఖలు చేసిన పిల్‌తోపాటు 2016లో దాఖలైన మరో రెండు పిల్స్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్.చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆర్‌ఆండ్‌బి ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈనెల 7కి వాయిదా వేసింది. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని హైకోర్టు పరిశీలించింది. గత ఏడాది ఫిబ్రవరి 18న క్యాబినెట్ నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ పరిశీలించి… ప్రస్తుత స్థలంలోనే ఉన్న బిల్డింగ్స్‌కు మార్పులు చేసి వాడుకోవాలని తీర్మానంలో ఉందని, అదే తీర్మానంలో మరో చోట కొత్తగా సెక్రటేరియట్ కట్టాలని కూడా ఉందని, కొత్త నిర్మాణాన్ని చేపడతారా? మార్పులు చేస్తారా? దీనిపై తుదినిర్ణయం ఏం తీసుకున్నారా?’ అని డివిజన్ బెంచ్ ప్రశ్నలు వేసింది. క్యాబినెట్ నిర్ణయంలో హైకోర్టు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం తరఫు అడిషినల్ అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ‘హైకోర్టు సమీక్షించకుండా ఉంటుందని అనుకోవద్దు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా గుర్తుంది. ప్రజాధనంతో చేసే పనులు ప్రజాహితంగా ఉండాలి. లేకపోతే న్యాయ సమీక్ష చేస్తాం. ప్రజలకు చెందిన అంశాల పేరుతో క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు జోక్యం చేసుకోరాదనడం కుదరదని’ చెప్పింది. కోట్లాది రూపాయల ప్రజా ధనం వెచ్చించేటప్పుడు, అదీ సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఉండగా వాటిని కూల్చి కొత్తగా కట్టాలనే నిర్ణయం కాబట్టి న్యాయ సమీక్ష చేసే అధికారం హైకోర్టుకు ఉంది.. అని బెంచ్ చెప్పింది. కొత్తగా కట్టాలంటే కనీసం 5 సంవత్సరాలు కాలం పడుతుందని, రాజస్థాన్‌లో అయితే హైకోర్టును ఏకంగా 12 ఏండ్లు కట్టారని, తీరుబడిగా ఇక్కడ కూడా చేస్తే సెక్రటేరియట్‌లోని కీలక ఫైళ్ల మాటేమిటనే సందేహాన్ని వ్యక్తం చేసింది. ఒక ప్రాంగణంలో ఉండాల్సిన ఫైళ్లు వేరువేరు చోట్ల ఉంటే వాటికి ఫైళ్లు బయటకు వెళ్లవనే గ్యారెంటీ ఏదని ప్రశ్నించింది. క్యాబినెట్ నిర్ణయం తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడిందని, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందని, కొత్తగా సెక్రటేరియట్ బిల్డింగ్స్ కట్టాలనే సర్కార్ నిర్ణయం తీసుకుందని అడిషినల్ ఎజి చెప్పారు. టెక్నికల్ కమిటీ నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఆ నివేదికను సిఎం కెసిఆర్‌కు సమర్పించిందని.. దీనిపై సిఎం కెసిఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గతంలో ఈ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చినందున ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై డివిజన్ బెంచ్ తీవ్రంగానే స్పందించింది. ఇప్పటికే ఉన్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చరాదని మాత్రమే స్టే ఇస్తే మీరేమో స్టే కారణంగా ఏ నిర్ణయం తీసుకోలేదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ప్రభుత్వం కొత్తగా సెక్రటేరియట్ బిల్డింగ్స్ కట్టాలనే నిర్ణయానికి వచ్చిందని, క్యాబినెట్ తీర్మానం తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అయిందని, ఈ సబ్ కమిటీ టెక్నికల్ కమిటీని వేసిందని అదనపు ఎజి మరోసారి చెప్పారు.
లెక్క చెప్పండి!
RELATED ARTICLES