కొనసాగింపు, సడలింపులపై ప్రధానితో కేంద్ర హోంశాఖమంత్రి భేటీ
అన్ని రాష్ట్రాల సిఎంల అభిప్రాయాలను మోడీకి తెలిపిన అమిత్ షా
న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్‌డౌన్ మే 31 (ఆదివారం)తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. లాక్‌డౌన్ కొనసాగింపుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెల్లడించిన అభిప్రాయాలను ప్రధానికి షా వివరించినట్లు అధికారులు చెప్పారు. గడిచిన 24 గంటల్లో దేశంలోనే అత్యధికంగా 7466 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ప్రధాని, హోంమంత్రి మధ్య జరిగిన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్న అమిత్ షా దేశంలో కరోనా తీవ్రత, లాక్‌డౌన్ తదితర అంశాలపై మోడీతో చర్చించారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు వెల్లడించిన అభిప్రాయాలను, సూచనలను అమిత్ షా మోడికి తెలియజేశారని అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా మొదటిసారి మార్చి 24న 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత లాక్‌డౌన్‌ను మే 3 వరకు, మళ్లీ మే 17వ తేదీ వరకు, ఆ తరువాత మే 31 వరకు పొడిగించారు. అయితే నాలుగవసారి విధించిన లాక్‌డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనున్నట్లు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురు సిఎంలతో మాట్లాడిన అమిత్ షా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఏఏ రంగాలకు మినహాయింపులు అవసరం?, ఎలాంటి సమస్యలు ఉన్నాయి?, జూన్ 1వ తేదీ నుంచి ఎలా ముందుకు వెళ్దామో చెప్పాలని కోరినట్లు సమాచారం. అయితే ప్రతిసారి లాక్‌డౌన్ ముగియడానికి ముందు రోజుల్లో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుకున్నారు. కానీ ఆ సారి మాత్రం మరో మూడు రోజుల్లో లాక్‌డౌన్ ముగియనున్న వేళ హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించడం ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రతిసారీ ప్రధానితో పాటు అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, అమిత్‌షా నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా అత్యధిక సిఎంలు ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు, క్రమంగా సాధారణ పరిస్థితులను తీసుకువచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేస్తూనే లాక్‌డౌన్ పొడిగించాలని సూచించినట్లు మరో అధికారి వెల్లడించారు. ఒకటి, రెండు రోజుల్లో లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు, అమిత్ షాతో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ గోవా సిఎం ప్రమోద్ సావంత్ లాక్‌డౌన్‌పై స్పందించారు. లాక్‌డౌన్‌ను మరికొన్ని వారాల పాటు పొడిగిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కేంద్రం మరో 15 రోజులు లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే, తమ రాష్ట్రానికి కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. భౌతిక దూరం నిబంధనలతో 50శాతం సామర్థ్యంతో పనిచేసేందుకు రెస్టారెంట్లను అనుమతించాలని కోరానన్నారు. చాలా మంది ప్రజలు జిమ్‌లను కూడా పునఃప్రారంభించాలని కోరుకుంటున్నారని సావంత్ తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్ -4 ఆదివారంతో ముగుస్తుండటంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ దేశ వ్యాప్తంగా నెలకొంది.
లాక్‌డౌన్ 5.0
RELATED ARTICLES