HomeNewsBreaking Newsలాక్‌డౌన్‌లో పెట్రో ధరల పెంపా?

లాక్‌డౌన్‌లో పెట్రో ధరల పెంపా?

సిపిఐ నేతల ఆగ్రహం
మద్యం షాపులు తెరవడంతో 40రోజుల లాక్‌డౌన్‌ వృథా: నారాయణ
ప్రతిపక్షాలను సిఎం కెసిఆర్‌ గౌరవించాలి: చాడ వెంకటరెడ్డి
వృత్తిదారులు, ఆటోడ్రైవర్లకు ప్యాకేజీ ప్రకటించాలి: అజీజ్‌పాషా
ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఒకవైపు అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్‌ ధర పడిపోతే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం లీటర్‌ పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచి ప్రజలపై భారం మోపిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. మఖ్దూంభవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడారు. ఒకవైపు కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కేంద్రం పెట్రో భారం మోపడం దారుణమని నారాయణ అన్నారు. 40 రోజుల లాక్‌డౌన్‌లో కేంద్రం 130 కోట్ల ప్రజానీకానికి ఇచ్చిందేమి లేదని, పైగా పెట్రో ధరలు పెంచిందని మండిపడ్డారు. 40కోట్ల మంది వలస కార్మికులను ఆదుకోవడంలో, బియ్యం, నగదు ఇవ్వడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా వారికి రూ.10వేలు, బియ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వలస కార్మికులంటే మానవ వనరులని, వారు లేకుండాపోతే ఫ్యాక్టరీలు పని చేయవని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కష్టకాలంలో రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం తాజాగా మద్యం అమ్ముకోమని అనుమతించిందని నారాయణ అన్నారు. దీంతో నలభై రోజులుగా లాక్‌డౌన్‌తో ప్రజలు పడుతున్న కష్టం మద్యం షాపులు తెరవడంతో వృథా అయిపోయిందన్నారు. తమ డబ్బులన్నీ మద్యం కొనేందుకు క్యూలో నిలబడుతున్న ప్రజలకు తినేందుకు పల్లీ, బఠానీలు సరఫరా చేయాలని టిఆర్‌ఎస్‌, వైసిపి నాయకులను ఎద్దేవా చేశారు. గుళ్లు, మసీదులు, చర్చిలు తెరిచినా ప్రజలు జాగ్రత్తగా వెళ్లి ప్రార్థన చేసుకొని హుండీలో డబ్బులు వేస్తారని, అలా కూడా ఆదాయం వస్తుందని, కాని వాటిని మూసేయించి ప్రజల ఆరోగ్యాలను చెడగొట్టే మద్యం షాపులను తెరిపించారని విమర్శించారు.
వైజాగ్‌ ఘటనపై దిగ్భ్రాంతి: వైజాగ్‌లో జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటనపై నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కంపెనీ అనుమతిని రద్దు చేయాలని, యాజమాన్యం, కాలుష్య నియంత్రణ మండలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ప్రతిపక్షాలను సిఎం గౌరవించాలి: చాడ
ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యం అర్థం లేదని, ప్రతిపక్షాలను సిఎం కెసిఆర్‌ గౌరవించాలని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రజల సమస్యలు, వాటి పరిష్కారంపై ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రతిపక్షాలు ఎక్కడివని ఆయన అనడం తగదన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామని, ఎవరి జాగీరు కాదని, నియంతృత్వం, నిరంకుశత్వం పనికిరాదన్నారు. సిఎం కెసిఆర్‌ ఎలాగో ప్రతిపక్షాలను కలవడని, అలాగే మాకు ఆయనను కలవాలనేమి ఉండదని, కాని ప్రజా సమస్యలపై గవర్నర్‌, చీఫ్‌ సెక్రటరీలకు ప్రాతినిధ్యం చేస్తే తప్పా అని ప్రశ్నించారు. అయినా తాము ఎక్కువ కరోనా పరీక్షలు చేయాలని, వలస కూలీలను ఆదుకోవాలని, కార్డు లేని అర్హులకు రేషన్‌, ఆర్థిక సహాయం చేయాలని, మూడు నెలలు రేషన్‌ తీసుకోని వారికి బియ్యం, నగదు నిలిపివేతను రద్దు చేయాలని కోరుతున్నామని, ఈ సూచనలేమైనా తప్పని అన్నారు. ఆశా వర్కర్లు, మెడికల్‌ కాంటింజెంట్‌ వర్కర్‌లకు నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదని, సిఎం అడితే వారిని పిలిపించి అది నిజమా? కాదా? నిరూపిస్తానన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మోడీకి ఆదర్శమని, అక్కడ లాక్‌డౌన్‌ ఎత్తేస్తే ఇక్కడ సడలింపులిచ్చి మద్యం షాపులకు అనుమతించారని, మోడీ కిటికీలు తెరిస్తే కెసిఆర్‌ ఏకంగా దర్వాజానే తెరిచారని అన్నారు.
జర్నలిస్టులను ఆదుకోవాలి: లాక్‌డౌన్‌లో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు సమాజానికి సేవ చేస్తున్నారని చాడ వెంకటరెడ్డి కొనియాడారు. అయితే, చాలా మీడియా సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, చాలా మంది జర్నలిస్టులకు జీతాలు ఇవ్వడం లేదని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సిఎం ఎప్పుడు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లను ఏర్పాటుచేసినా వాటిని కవర్‌ చేస్తూ ఆపత్కాలంలో ప్రజలకు జర్నలిస్టులు సమాచారాన్ని అందజేస్తున్నారని, వాళ్ల గురించి మీకు పట్టదా అని ప్రశ్నించారు. న్యాయవాదులకు రూ. 25 కోట్లు ఇస్తున్నారని, అలాగే జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని కోరారు.
కర్నాటక తరహా ప్యాకేజీ ఇవ్వాలి: అజీజ్‌పాషా
కర్నాటకలో చాకలి, మంగలి, ఆటో డ్రైవర్లు వంటి వర్గాలకు ప్రభుత్వం రూ.1600 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని అజీజ్‌ పాషా తెలిపారు. ఒక్కొక్కరికి రూ.5వేలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. లాక్‌డౌన్‌తో పలు వృత్తు లవారు పనులు లేక అల్లాడుతున్నారని, మన రాష్ట్రంలో కూడా వృత్తిదారులకు, ఇతర పనివారికి ఇలాంటి ప్యాకే జీ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై భారం మోపుతూ కేంద్రం పెట్రో ధరలను పెంచడాన్ని అజీజ్‌పాషా తీవ్రంగా ఖండించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments