మరియమ్మ మృతి ఘటనలో హైకోర్టు ఆదేశం
మృతదేహాన్ని వెలికితీసి రీపోస్టుమార్టం
సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలి
ప్రజాపక్షం/హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూ రు పోలీస్ స్టేషన్‌లో జరిగిన లాకప్ డెత్ ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మరియమ్మ అనే మహిళను పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లే లాకప్‌లో మరణించిందనే పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారించింది. మరియమ్మ మృతి ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేయాలని, తక్షణమే తమ ఆదేశాలు అమలు చేయాలని ఆదేశించింది. ఆలేరు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ విచారణ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విచారణ చేస్తున్నామని, జ్యుడీషియల్ విచారణ అవసరం లేదని ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. ఆలేరు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ విచారణ చేసి సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరియమ్మ మృతదేహాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం చేయాలని కోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది. మరియమ్మ లాకప్‌డెత్‌పై జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేయాల ని, బాధితురాలి కుటుంబానికి రూ. 5 కోట్లు ప్రభుత్వం పరిహారం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని, లాకప్‌డెత్ చేసిన పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని పియుసిఎల్ (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్) రిట్ వేసింది. దొంగతనం కేసులో మరియమ్మ, ఆమె కొడుకు, అతని స్నేహితుడిని అడ్డగూడూరు పోలీసులు జూన్ 16న నిర్బంధంలోకి తీసుకుని కొట్టారని, చిత్రహింసలకు మరియమ్మ 18వ తేదీన మరణించిందని, ఆమె కొడుకు ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నాడని (ఫొటోలను పిటిషనర్ అందజేశారు) పిటిషనర్ న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. జూన్ 16 నుంచి 18వ తేదీ వరకూ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లోని సిసి కెమెరాల ఫుటేజీని పోలీసుల ద్వారా తెప్పించుకుని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ వాదనను ప్రభుత్వం తరఫున ఎ.జి. బిఎస్ ప్రసాద్ వ్యతిరేకించారు. జాతీయ మానవహక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి మరణిస్తే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విచారణ చాలని, ఈ మేరకు ప్రభుత్వం విచారణ కూడా చేయిస్తోందని చెప్పారు. కమిషన్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పలు హైకోర్టులు తీర్పు చెప్పాయని హైకోర్టు గుర్తు చేసింది. సిసికెమెరాల ఫుటేజీ గురించి ఆరా తీస్తే, ఆడ్గగూడూరు పోలీస్‌స్టేషన్ కొత్తగా పెట్టిందని, సిసి కెమెరాలు ఏర్పాటు కాలేదని ఎ.జి. చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాల్సివుందని హైకోర్టు చెప్పింది. మరియమ్మ అనుమానస్పద మృతిపై ఆలేరు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
పోలీసులపై హత్య కేసు పెట్టండి : తమ్మినేని
మరియమ్మ మరణానికి కారణమైన పోలీసులపై హత్య కేసు పెట్టి అరెస్టు చేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పోలీసుల చిత్ర హింసల కారణంగానే ఆమె మరణించిందని, దీనిని కస్టోడియల్ హత్యగా పరిగణించాలని ఒక పత్రికా ప్రకటనలో కోరారు. కేవలం పోలీసుల అధికారులు ప్రాథమిక విచారణ చేసి ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడంతోనే సరిపోదన్నారు. బాధిత కుటుంబానికి దళితుల హత్య జరిగిన సందర్భంలో ఇచ్చే పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
వాస్తవ సమాచారం ఇవ్వండి
తెలంగాణ సిఎస్, డిజిపికి ఎన్‌సిఎస్‌సి నోటీసులు
న్యూఢిల్లీ : యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ సేషన్‌లో దళిత మహిళ అనుమానాస్పద మృతిపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను, సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా తెలంగాణ చీఫ్ సెక్రెటరీ (సిఎస్) సోమేశ్ కుమార్‌ను, డిజిపి మహేందర్ రెడ్డిని ఆదేశించింది. అదే విధంగా, ఈ కేసులో తీసుకున్న చర్యలను వివరించాలంటూ భువనగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) కె. నారాయణరెడ్డికి స్పష్టం చేసింది. ఎస్‌సిఎస్‌సి వద్ద ఉన్న సమాచారం మేరకు మృతురాలు మరియమ్మ వంట మనిషి. తన ఇంట్లో చోరీ జరిగిందని పేర్కొంటూ, మరియమ్మనే ఇందుకు పాల్పడిందని ఆమె పని చేస్తున్న ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీస్‌లు మరియమ్మను, ఆమె కుమారుడిని ఈనెల 17న పోలీస్‌లు అరెస్టు చేశారు. మరుసటి రోజనే ఆమె పోలీస్ లాకప్‌లో ఆమె మృతి చెందడం సంచలనం రేపింది. పోలీస్‌లు విపరీతంగా కొట్టి, హిసించడం వల్లే మరియమ్మ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. తాము నిర్దోషులమని ఎంతగా వేడుకున్నా పోలీస్‌లు వినిపించుకోలేదని మరియమ్మ కుమారుడు ఆరోపిస్తున్నాడు. ఈ సంఘటనపై ఎస్‌సిఎస్‌సి చైర్మన్ విజయ్ సంప్లా స్పందిస్తూ, పూర్తి సమాచారం అందించాలని తెలంగాణ సిఎస్, డిజిపికి నోటీసులు పంపారు. కేసుపై సత్వరమే స్పందించాలని, స్పష్టమైన కార్యాచరణను అనుసరించాలని ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు.