బంగ్లాదేశ్‌లో 40 మంది సజీవ దహనం
డజన్ల సంఖ్యలో గల్లంతు
ఆసుపత్రిలో 70 మందికి చికిత్స
ఢాకా : దక్షిణ బంగ్లాదేశ్ జలకథిజిల్లాలో సుగంధ నదిపై 800 మందితో ప్రయాణిస్తున్న లాంచీ (పెద్ద పడవ) ఇంజన్ గదిలో ఆకస్మికంగా మం టలు చెలరేగడంతో 40 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ బట్టకట్టులో 800 మంది ప్రయాణిస్తున్నారు. లాంచీలో చాలామంది సజీవదహనం, లేదా ఊపిరి అందక మరణించా రు. కొందరు నీట మునిగి మరణించారు. లాంచీ ప్రయాణ సమయంలో చాలామంది నిద్రావస్థలో ఉన్నందువల్లనే ఎక్కువ మంది మరణించారని తోటి లాంచీ ప్రయాణికులు భావిస్తున్నారు. నది లో దూకినవారిలో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సామర్థ్యానికి మిం చిన స్థాయిలో ప్రయాణికుల్ని అక్రమంగా ఎక్కించుకోవడం, అనుభవం లేని డ్రైవరువల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రాథమిక అంచనా వేశారు. జనం, సామాన్లతో కిక్కిరిసిన లాంచీలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ విషాద సంఘటన జరిగిందని అధికారులు చెప్పా రు. ఇంజన్ గదిలో పుట్టిన మంటలు లాంచీ అంత టా వ్యాపించాయి. ఢాకా నుండి బర్గుయకు వెళ్ళే ఈ ఎంవి అభిజాన్ రకం లాంచీ ఢాకా నుండి తన ప్రయాణం ప్రారంభించగా, జలకథిజిల్లాలో ఘటన పోలీసులు చెప్పారు. అయితే అనేక డజన్లమంది జాడతెలియకుండా పోయారని అధికారులు చెప్పారు. గస్తీ దళాలు వారి కోసం గాలిస్తున్నారు. మంట కారణంగా 40 మంది సజీవదహనం కావడం ఘోర విషాదమని అధికారులు పేర్కొన్నారు. మంటల్లో కాలుతున్నవారిలో తొమ్మిదిమంది నదిలో పడి మునిగి మరణించారు. రాజధానికి 250 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఘటనలో ఎంతమంది మరణించినదీ తర్వాత వివరాలు తెలియజేస్తామని జిల్లా అధికారులు చెప్పారు. ఈ లాంచీ సామర్ధ్యం 300 కాగా, 310 మంది లిస్టెడ్ ప్రయాణికులు అందులో ఉన్నారని, మిగిలినవారు జాబితాలో లేకుండా అక్రమంగా లాంచీలో ఎక్కించుకున్నావారే అని భావిస్తున్నట్లు షిప్పింగ్ శాఖ జూనియర్ మంత్రి ఖలెద్ మహ్మద్ చౌధురి విలేకరుకు చెప్పారు. ఈ పూర్తి వ్యవహారాన్ని తెలుసుకునేందుకు మూడు బృందాలు వేరు వేరు చోట్ల దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పొరుగున ఉన్న బరిషాల్ జిల్లాలోని షేర్ ఏ బంగ్లా మెడికల్ కళాశాల ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, 70 మంది ఈ లాంచీ ప్రయాణికులకు తాము చికిత్స చేస్తున్నామని చెప్పారు.
తీర ప్రాంత గస్తీ దళాలు, అగ్ని మాపకదళ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు కూడా గాలింపులో పాల్గొంటున్నారు. నదీ సంగమ ప్రదేశంలో ఈ సంఘటన జరిగింది. తమ తమ బంధువుల జాడ తెలుసుకునేందుకు ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో జనం అక్కడకు చేరుకుంటున్నారు. లాంచీలో ఉన్న చాలామంది నదిలో దూకేశారు. వారిలో ఈత వచ్చిన వారు, రాని వారు ఎవరో వివరాలు తెలియవు. పెద్ద ఎత్తున మంటలు, పొగ చెలరేగడంతో లాంచీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాట కూడా జరిగిందని భావిస్తున్నారు. లాంచీ సామర్థ్యానికి మించి ఎక్కువమందిని ఎక్కించుకున్నందువల్లనే ప్రమాదంలో ఎక్కువ మంది మరణించారు. చాలామంది వారాంతపు సెలవులు గడపడం కోసం కుటుంబాలతో నదీ సంగమ ప్రాంతానికి వెళుతున్నందువల్లనే లాంచీ కిక్కిరిసిపోయింది. ఈ లాంచీలోని విఐపి క్యాబిన్‌లో బర్గున పథర్‌ఘట ఉప జిల్లా ప్రధాన పాలనాధికారి మహ్మద్ హుస్సేన్ మహ్మద్ అల్ మొజహిద్ కూడా తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఆకస్మికంగా దట్టమైన పొగ లాంచీని ఆవరించుకుందని, ఊపిరి అందకపోవడంతో భయం వేసిందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ అరవడం ప్రారంభించారని, గేటు దగ్గరకు పరుగులు తీశారని, మరికొందరు భయంతో నదిలో దూకేశారని ఆయన గుర్తు చేసుకుని చెప్పారు. అయితే లాంచీన సమీపంలోని గట్టుకు తరలించేందుకు లాంచీ మాస్టర్ ప్రయత్నించాడని కూడా ఆయన చెప్పారు. చాలామంది లోపలే చిక్కుకుపోయారు. వెంటనే తాను ప్రమాదం పసిగట్టి భార్య, బావమరిదితో కలిసి గడ్డకట్టిన స్థితిలో ఉన్న నదీ ప్రవాహంలో దూకి ఈదుకుటూ ఒడ్డుకు చేరామని చెప్పారు. ఈ ఘటన వార్త తెలిసిన వెంటనే 15 అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఉదయం 5.30 ఆరు గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గడచిన మే నెలలో లాచీ ఇసుక ఫెర్రీని ఢీ కొట్టడంతో 26 మంది మరణించారు. తర్వాత జూన్ నెలలో 100 మందితో ప్రయాణిస్తున్న లాంచీ బోల్తా పడటంతో 32 మంది మరణించారు. 2015 ఫిబ్రవరిలో జరిగిన మరో ఘటనలో 78 మంది మరణించారు.