HomeNewsBreaking Newsలక్ష్యంపైనే గురి

లక్ష్యంపైనే గురి

మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు… సంఘర్షణకు ప్రతిరూపం : మంత్రి కెటిఆర్‌
తెలంగాణ యువతకు ఆత్మీయ లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.టి.రామారావు అన్నారు. మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదని, సంఘర్షణకు ప్రతిరూపమని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుందని అన్నారు. తెలంగాణ యువతకు ఆదివారం ఆయన ఆత్మీయ లేఖ రాశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్‌ ఇవాళ దేశంలో నవ శకానికి నాంది పలికింది. తొమ్మిది ఏండ్ల వ్యవధిలో సుమారు రెండు లక్షల 25 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశ చరిత్రను సరికొత్తగా లిఖించబోతుందని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది. ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో విజయవంతంగా పూర్తి చేశాము. ప్రజల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వచ్చాక, 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టినం. ఇప్పటికే సుమారు 32 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చాం. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నాము. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగ పర్వం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒక్కటే. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకండి. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టండి. సానుకూల దృక్పథంతో సాధన చేసి, స్వప్నాలను సాకారం చేసుకోండి. కాలం తిరిగి రాదు. అవకాశాలను అందిపుచ్చుకోండి. ఏకాగ్రతతో అభ్యసించండి. లక్ష్యాన్ని చేరుకోండి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు అత్యధిక జీతాలను చెల్లిస్తున్నది. ఆ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండి. ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోండి. ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇప్పుడు ఒకెత్తు. ప్రాణం పెట్టి చదవండి. మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్మకున్న ఆత్మీయుల స్వప్నాలను నిజం చేయండి. తెలంగాణ యువతకు ఆకాశమే హద్దని చాటండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న మీ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌. మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఒక సోదరుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని కెటిఆర్‌ తన లేఖలో యువతకు సందేశం ఇచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments